పశువైద్యం.. దైన్యం
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:58 PM
Shortage of doctors and staff జిల్లాలో పాడి పశువుల పెంపకం పెరిగినా పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యులు, సిబ్బంది కొరతతో అరకొర సేవలు అందుతున్నాయి. దీంతో పాడిరైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లో కొరత అధికంగా ఉంది.
జిల్లాలో వైద్యులు, సిబ్బంది కొరత
టెక్కలి డివిజన్‌లో అధిక ఖాళీలు
పాడిరైతులకు సక్రమంగా అందని సేవలు
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పాడి పశువుల పెంపకం పెరిగినా పశువైద్యం అందని ద్రాక్షలా మారింది. పశువైద్యులు, సిబ్బంది కొరతతో అరకొర సేవలు అందుతున్నాయి. దీంతో పాడిరైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రధానంగా టెక్కలి డివిజన్‌లో కొరత అధికంగా ఉంది. టెక్కలి, పాతపట్నం, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గాల పరిధిలోని 14 మండలాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. ఒక్కో మండలంలో 25 వేలకుపైగా పశువులు, 50 వేలకుపైగా గొర్రెలు, మేకలు ఉన్నాయి. కానీ వాటి సంఖ్యకు తగ్గట్టుగా పశువైద్యులు, సిబ్బంది లేరు. పశుసంవర్థక శాఖకు సంబంధించి టెక్కలి డివిజన్‌లో ఏడుగురు ఏడీ స్థాయి, 36 మంది పశువైద్యుల స్థాయి పశువైద్యశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ఆరుగురు ఏడీలు విధులు నిర్వహిస్తున్నారు. 17 మంది పశువైద్యులు విధుల్లో ఉండగా ..19 మంది కొరత ఉంది. క్షేత్రస్థాయిలో 407 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా.. 105 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో పశువైద్యానికి అవస్థలు తప్పడం లేదు. చాలామంది రైతులు పాడి పశువులను విక్రయించి ప్రత్యామ్నాయ ఉపాధి వైపు వెళుతున్నారు.
వైసీపీ పాలనలో పశువైద్యులు, సిబ్బంది భర్తీ జరగలేదు. కూటమి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఎటువంటి కదలిక లేదు. సిబ్బంది కొరత కారణంగా ఒక్కో వైద్యుడు అదనపు బాధ్యతలు చూడాల్సి వస్తోంది. రెండుచోట్ల విధులు నిర్వహించాల్సి వస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అసలే సీజనల్ వ్యాధులు, ఆపై ప్రభుత్వ ఆదేశాల మేరకు పథకాలతో పాటు కాలానుగుణంగా టీకాలు వంటివి వేయాల్సి ఉంది. దీంతో సిబ్బంది ఆపసోపాలు పడుతున్నారు. పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ చూపి.. పశువైద్యులతో పాటు సిబ్బందిని భర్తీ చేయాలని పాడిరైతులు కోరుతున్నారు.
నివేదించాం
టెక్కలి డివిజన్‌లో పశువైద్యులు, సిబ్బంది కొరతపై ఉన్నతాధికారులకు నివేదించాం. అయినా ఉన్న వైద్యులు, సిబ్బందితో మెరుగైన సేవలందిస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాం.
- అప్పలస్వామి, పశుసంవర్ధక శాఖ ఏడీ, సొంపేట