Share News

ఆదిత్యుడి సేవలో.. ఆకాశవీధిలో..

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:19 AM

Rathasaptami celebrations begin ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి జయంతి (రథసప్తమి) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 25న రథసప్తమిని పురస్కరించుకుని ఈసారి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

ఆదిత్యుడి సేవలో.. ఆకాశవీధిలో..

  • వైభవంగా రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం

  • తొలిరోజు హెలికాప్టర్‌ రైడ్‌ సందడి

  • అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు

  • అరసవల్లి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ప్రత్యక్షదైవం, ఆరోగ్యప్రదాత అయిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి జయంతి (రథసప్తమి) వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 25న రథసప్తమిని పురస్కరించుకుని ఈసారి వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలిరోజు సోమవారం ఆదిత్యుడ్ని భక్తులు దర్శించుకుని.. పూజలు చేశారు. అలాగే ఆర్‌్క్షబీ అతిథి గృహం ఆవరణలో హెలికాప్టర్‌ రైడ్‌ను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ప్రారంభించారు. మరోవైపు ఆర్ట్స్‌ కళాశాల రోడ్డులోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం సురభి కళాకారుల నాటక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అరసవల్లిలో ఆలయ ప్రాంగణమంతా విద్యుత్‌ వెలుగులు విరజిమ్మాయి. ఈ ఏడాది రథసప్తమి వేడుకలను హైటెక్‌ హంగులతో... ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ తెలిపారు. రథసప్తమి రోజున 2లక్షల మందికి పైగా భక్తులు ఆదిత్యుని దర్శనానికి తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు.

  • ఎయిర్‌పోర్టు తరహా భద్రత

  • శ్రీకాకుళం నగరంలోని డచ్‌ బంగ్లా (ఆర్‌్క్షబీ కార్యాలయం) ప్రాంగణం వద్ద హెలికాప్టర్‌ రైడ్‌ సోమవారం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. టిక్కెట్‌ ధర రూ.2200. ఇక్కడ ఎయిర్‌పోర్టు తరహాలో మెటల్‌ డిటెక్టర్లతో తనిఖీలు ఉంటాయి. మొబైల్‌ ఫోన్లు, బ్యాగులు భద్రపరిచేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రైడ్‌ పూర్తయ్యాక భక్తులకు జ్ఞాపకార్థం ఒక ఫొటో, స్వామివారి ప్రసాదం ప్యాకెట్‌ అందజేస్తారు. టిక్కెట్లు అక్కడికక్కడే తీసుకోవచ్చు లేదా అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా చేసుకోవచ్చు.

  • మంగళవారం నుంచి ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ‘హాట్‌ ఎయిర్‌ బెలూన్‌’ రైడ్‌ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. టిక్కెట్‌ ధర రూ.999.

  • 23 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు

  • వాస్తవానికి సోమవారం నుంచే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కావలసి ఉంది. మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతికి సంతాప సూచకంగా వాటిని 23వ తేదీకి వాయిదా వేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో ఫుడ్‌ స్టాల్స్‌, డ్వాక్రా బజార్‌, అమ్యూజ్‌మెంట్‌(పిల్లల ఆటవస్తువులు) మాత్రం సోమవారం నుంచే ప్రారంభమయ్యాయి.

  • 23న ఉదయం స్థానిక 80 అడుగుల రోడ్డులో 7 నుంచి 8వేల మందితో మెగా సూర్యనమస్కారాలు, మధ్యాహ్నం శోభాయాత్ర. సాయంత్రం ‘డ్రోన్‌ షో’ ఉంటుంది. రథసప్తమి విశిష్టతను డ్రోన్ల ద్వారా చూపిస్తారు. లేజర్‌ షో, బాణసంచా కాల్పులు కూడా ఉంటాయి. ఎన్టీఆర్‌ మున్సిపల్‌ మైదానంలో ఆటల పోటీలు జరుగుతాయి.

  • 24న సాయంత్రం 5 గంటల నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ బృందంతో మ్యూజికల్‌ నైట్‌, డ్యాన్స్‌ కార్యక్రమాలు జరుగుతాయి.

  • ఉచిత దర్శనానికి మూడు క్యూలైన్లు

  • 24వ తేదీ అర్థరాత్రి 12 గంటలకు రథసప్తమి పూజలు ప్రారంభమవుతాయి. రాత్రి ఒంటి గంట లేదా 1.30 గంటల నుంచి సర్వదర్శనాలు ప్రారంభిస్తారు. గర్భగుడి వద్ద మొత్తం 6 క్యూలైన్లు ఉంటాయి. ఇందులో సామాన్యుల కోసం ప్రత్యేకంగా మూడు ఉచిత దర్శనం లైన్లను కేటాయిస్తున్నారు. అలాగే రూ.100, రూ.300, రూ.500, వీఐపీ లైన్లు వేరుగా ఉంటాయి.. సామాన్యులకు 30 నిమిషాల్లో దర్శనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

  • క్యూలైన్లలో కార్పెట్లు, తాగునీరు, పాలు, టీ, ప్రసాదం అందజేస్తారు. భక్తుల సౌకర్యార్థం చెప్పుల స్టాండ్‌ ఏర్పాటు చేస్తున్నారు. మిల్లు జంక్షన్‌ నుంచి ఆలయం వరకు ఎక్కడికక్కడ ఎల్‌ఈడీ స్ర్కీన్లు, లౌడ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసి, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తారు. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ బుకింగ్‌, ఉచిత బస్సు సదుపాయం కల్పిస్తున్నారు.

  • దర్శనం టిక్కెట్లు ఎలా తీసుకోవాలంటే...

  • వాట్సాప్‌ గవర్నెన్స్‌ ‘మనమిత్ర’ ద్వారా ఆన్‌లైన్‌లో, అలాగే డబ్లుడబ్లుడబ్లు.ఏపీటెంపుల్స్‌.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా రూ.100, రూ.300, రూ.500 టిక్కెట్లు సొంత మొబైల్‌ ఫోన్ల నుంచే బుక్‌ చేసుకోవచ్చు. ఒకవేళ కుదరకపోతే డచ్‌ బంగ్లా వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయవచ్చు.

Updated Date - Jan 20 , 2026 | 12:19 AM