Share News

భయం గుప్పిట్లో..

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:30 AM

Srikakulam peoples trapped in the Gulf ఇరాన్‌ - ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం వేళ.. గల్ఫ్‌లో నివసిస్తున్న జిల్లావాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ తమవారి పరిస్థితి ఎలా ఉందోనని స్థానికంగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్ల ద్వారా వారి యోగక్షేమాలు, అక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు.

భయం గుప్పిట్లో..
అబుదాబిలో శబ్దాల తీవ్రతకు ఊడిన శ్లాబ్‌ సీలింగ్‌

  • గల్ఫ్‌లో చిక్కుకున్న జిల్లావాసులు

  • యుద్ధం వేళ ఇబ్బందులు

  • ఆందోళనలో కుటుంబసభ్యులు

  • ఇచ్ఛాపురం/ సోంపేట రూరల్‌, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌ - ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధం వేళ.. గల్ఫ్‌లో నివసిస్తున్న జిల్లావాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అక్కడ తమవారి పరిస్థితి ఎలా ఉందోనని స్థానికంగా కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఫోన్ల ద్వారా వారి యోగక్షేమాలు, అక్కడి పరిస్థితులు తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువగా ఉద్దానం ప్రాంత యువత గల్ఫ్‌ దేశాల్లో పరిశ్రమల్లో వెల్డర్‌, ఫిట్టర్‌, ఫ్యాబ్రికేటర్‌తోపాటు సహాయకులుగా పనిచేస్తున్నారు. టెక్కలి, పలాస, ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన చాలా మంది యువకులు దుబాయ్‌, అబుదాబి, సౌదీ అరేబియా, ఖతార్‌, కువైట్‌, ఒమన్‌, బెహ్రయిన్‌ తదితర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్నారు. కాగా ప్రస్తుతం యుద్ధం జరుగుతుండడంతో గల్ఫ్‌లో ఉన్న జిల్లావాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. స్వగ్రామాల్లో తమ కుటుంబసభ్యులకు, స్నేహితులకు చెప్పి ఫోన్‌ చేసి తమ బాధను విన్నవించుకుంటున్నారు. గల్ఫ్‌ దేశాలపై దాడులు పెరిగాయని, దుబాయ్‌లో తాము పనిచేస్తున్న కార్యాలయం సమీపంలో క్షిపణి శకలాలు పడ్డాయని ఇచ్ఛాపురానికి చెందిన యువకులు తెలిపారు. ప్రతిక్షణం భయంభయంగా గడుపుతున్నామని వెల్లడించారు.

  • పరిస్థితి ఘోరంగా ఉంది

  • ఆంధ్రాకు చెందిన ఆరు కుటుంబాలు.. అబుదాబిలో వేర్వేరు అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నాం. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మూడు రోజులుగా భారీ శబ్దాలతో మిస్సైల్స్‌ వచ్చి పడుతున్నాయి. ఆ శబ్దాలకు కొన్నిచోట్ల ఇంటి సీలింగ్‌ పడిపోవడంతో కంప్యూటర్లు పాడైపోతున్నాయి. ఏసీ తదితర సామగ్రి కింద పడిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. బయటకు వెళ్లడం లేదు. కంపెనీలకు వెళ్లకుండా రూముల్లోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాం. నిత్యావసరాల ధరలు కూడా పెరిగిపోయాయి. ఏంచేయాలో పాలుపోవడం లేదు. దుబాయ్‌ కాలమానం ప్రకారం మంగళవారం వేకువజామున 2.30 గంటలకు అబుదాబిలోని ముస్తాఫా, మహ్మాద్‌ దింజాయ్‌ సిటీ, అల్ఫల్లా, కలీఫా సీటీ ప్రాంతాల్లో క్షిపణి దాడులు జరిగాయి. వెంటనే అబూదుబాయ్‌ డిఫెన్స్‌ సిస్టం సిద్ధమై వాటిని గాల్లోనే పేల్చేశారు. ఆ పేలుళ్లకు సంబంధించిన పరికరాలు చెల్లాచెదురై పడ్డాయి. దీంతో ప్రజలు బయటకు రావటానికి భయపడుతున్నారు. మేజర్‌ ఆఫీసులన్నీ తెరవకుండా వర్క్‌ఫ్రం హోం చేయిస్తున్నారు. కొన్ని కంపెనీలు మాత్రమే సైట్‌కు తీసుకెళ్తున్నాయి.

  • - డి.ఉమాశంకర్‌, ఇచ్ఛాపురం

  • నిద్రలేకుండా..

  • అబుదాబిలో అర్ధరాత్రి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. ఎటువంటి ప్రమాదం జరుగుతుందోనని కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాం. కంపెనీ హాస్టళ్లలో ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నాం. ఏంచేయాలో మాకు తెలియడం లేదు.

  • - సుగ్గు కృష్ణ, ఇచ్ఛాపురం

  • ఏమి జరుగుతుందో..

  • దుబాయ్‌లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. మా క్యాంపస్‌లు పక్కనే అమెరికాకు చెందిన స్థావరాలు ఉన్నాయి. వాటిని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులు హోరెత్తిస్తున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన మాకు వెంటాడుతోంది. మమ్మల్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేయాలి.

  • - దానయ్య, బెల్లుపడ

  • స్వస్థలాలకు తీసుకెళ్లరూ..

  • సోంపేట మండలం తాళ్లబద్రకు చెందిన ఉగ్రపల్లి కృష్ణారావు కొన్నేళ్లుగా దుబాయ్‌లోని ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. కాగా.. ప్రస్తుతం అక్కడ యుద్ధవాతావరణం నేపథ్యంలో పరిస్థితి భయాందోళనగా ఉందని కృష్ణారావు ఫోన్‌ ద్వారా కుటుంబ సభ్యులకు వెల్లడించారు. ‘గత రెండు రోజులుగా మేము ఉండే చోట క్షిపణుల శకలాలు పడుతున్నాయి. రాత్రివేళ భారీ శబ్దాలు వస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మమ్మల్ని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాల’ని కృష్ణారావు కోరారు.

  • నివాసం పక్కనే శకలాలు

  • ‘బతుకుతెరువు కోసం దుబాయి వలస వచ్చాం. ఇరాక్‌, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ , అమెరికా క్షిపణిదాడులు భయపెడుతున్నాయి. నివాసం ఉంటున్న సేలం నగరం సమీపంలో రోడ్డుపై శకలాలు పడడాన్ని కళ్లారా చూసి భయపడ్డామ’ని సిరిమామిడి గ్రామానికి చెందిన కారాగి ఈశ్వరరావు, లక్ష్మణరావు, పుచ్చ తులసీదాసు, తెలిపారు. పాలవలస, కొర్లాం, రుషకుద్ద, మామిడిపల్లి తదితర గ్రామాలకు చెందిన పలువురు గల్ఫ్‌ దేశాల్లో కూలి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. స్వగ్రామాల్లో ఉన్న కుటుంబ సభ్యులు క్షేమ సమాచారం ఎపపటికప్పుడు తెలుసుకుంఉటన్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్టు వారు తెలిపారు.

  • ధైర్యంగా ఉండండి..

  • గల్ఫ్‌ బాధితులు ధైర్యంగా ఉండండి. భారత ప్రభుత్వంతోపాటు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు సైతం ప్రత్యేక దృష్టిపెట్టారు. అక్కడి ప్రభుత్వాల ఆదేశాల మేరకు సురక్షిత ప్రాంతాల్లో ఉండడండి. వీలైనంత త్వరగా గల్ఫ్‌ బాధితులకు సురక్షిత ప్రాంతాలకు తెచ్చేందుకు అన్నివిధాలా కృషిచేస్తాం.

  • - బెందాళం అశోక్‌, రాష్ట్ర ప్రభుత్వ విప్‌, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే

Updated Date - Mar 04 , 2026 | 12:30 AM