మునిసిపాలిటీల్లో.. పనులు చేయలేం
ABN , Publish Date - Jan 05 , 2026 | 11:53 PM
No general funds మునిసిపాలిటీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఏడాదిగా బిల్లులు నిలిచిపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్ అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు.
స్పష్టం చేస్తున్న కాంట్రాక్టర్లు
ఏడాదిగా అందని బిల్లులు
కానరాని సాధారణ నిధులు
పలాస, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లించడం లేదు. ఏడాదిగా బిల్లులు నిలిచిపోవడంతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇంజనీరింగ్ అధికారులు సైతం చేతులెత్తేస్తున్నారు. మునిసిపాలిటీల్లో సాధారణ నిధులతో మంజూరైన పనులను కాంట్రాక్టర్లు పూర్తిచేశారు. నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత ప్రాధాన్యక్రమంలో కాంట్రాక్టర్ల ఖాతాలో బిల్లుల నగదు జమవుతుంది. కాగా.. ఏడాదిగా చేసిన పనులకు ఒక్కపైసా కూడా సాధారణ నిధులు ఇవ్వలేదు. ఆరు నెలల కిందట అప్‌లోడ్ చేసిన పనుల పరిస్థితి కూడా యథాతథంగా ఉంది. ఫలితంగా మునిసిపాలిటీల్లో జనరల్ ఫండ్‌తోపాటు ప్రత్యేక ఆర్థిక సంఘ నిధులతో మంజూరైన పనులు కూడా ఇకపై చేయలేమని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇంజనీరింగ్ అధికారులు ఏమిచేయాలో తెలియక సతమతమవుతున్నారు.
శ్రీకాకుళం కార్పొరేషన్‌తోపాటు పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీల్లో సాధారణ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. ఇచ్ఛాపురం మునిసిపాలిటిలో ఏకంగా పనులు చేయలేమని కాంట్రాక్టర్లు తెగేసి చెబుతున్నారు. పలాస-కాశీబుగ్గలో పాత బిల్లులు ఇస్తేనే పనులు చేస్తామని కొందరు పేర్కొంటున్నారు. మరికొందరు తాము మునిసిపాలిటీకి చెల్లించాల్సిన పన్నులు ప్రజలే కట్టాలని, లేదంటే పనులకు సంబంధించిన సిమెంట్, ఇసుక ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమదాలవలస మునిసిపాలిటీ, శ్రీకాకుళం కార్పొరేషన్‌లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బిల్లుల కోసం అధికారుల చుట్టూ కాంట్రాక్టర్లు ప్రదక్షిణ చేయాల్సి వస్తోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు బిల్లులు పూర్తిగా ఇవ్వలేదు. దీంతో కాంట్రాక్టర్లు పనులు నిలిపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రాధాన్యత క్రమంలో పాత బిల్లులకు మోక్షం కల్పించింది. దీంతో కాంట్రాక్టర్లు అంతా కొత్త పనులకు కూడా శ్రీకారం చుట్టొచ్చని భావించారు. కానీ పరిస్థితి తిరకాసుగా మారింది. నిబంధనల ప్రకారం ప్రాధాన్యతా క్రమంలో బిల్లులు చెల్లిస్తారు తప్ప.. చేసిన పనులకు తక్షణం డబ్బులు జమయ్యే సూచనలు కనిపించడం లేదు. చేసిన పనులకు కనీసం 50 శాతం బిల్లులైనా చెల్లించి.. మిగిలినవి ప్రాధాన్య క్రమంలో అందజేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. పురపాలక సంఘం నిబంధనలో మార్పులు చేసి కనీసం జనరల్ ఫండ్ నిధులు స్థానిక సంస్థల విశేషాధికారం మేరకు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మునిసిపాలిటీ చేసిన పనులు కాంట్రాక్టర్లకు బకాయిలు
--------------------------------------------------------
ఇచ్ఛాపురం 12 రూ. 38 లక్షలు
పలాస-కాశీబుగ్గ 36 రూ.1.50 కోట్లు
శ్రీకాకుళం కార్పొరేషన్ 70 రూ.4 కోట్లు
ఆమదాలవలస 10 రూ.30 లక్షలు