భక్తుల రద్దీకి అనుగుణంగా..
ABN , Publish Date - Feb 07 , 2026 | 12:01 AM
Arrangements for Mahashivratri celebrations శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.
మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయండి
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశం
జలుమూరు, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): శ్రీముఖలింగంలో ఈ నెల 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అన్నిశాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ‘శివరాత్రి ఉత్సవాలకు గతేడాది కంటే భక్తులు పెరిగే అవకాశమున్నందున క్యూలైన్లు పెంచి 300 మీటర్లు వరకు బారీకేడ్లు నిర్మించాలి. ఎండ తగలకుండా షామ్యానాలు వేయాలి. వీఐపీలను దక్షిణద్వారం గుండా విడిచిపెట్టకుండా ప్రత్యేక క్యూలైను ఏర్పాటు చేయాలి. భక్తులు అడ్డదారిలో రాకుండా కట్టడి చేయాలి. ఉచిత, ప్రత్యేక దర్శనాలకి వేర్వేరు బారికేడ్లు ఏర్పాటు చేయాలి. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటరు అందుబాటులో ఉంచాలి. పారిశుధ్య నిర్వహ ణ చేపట్టాలి. చక్రతీర్థ స్నానాలకు వంశధార నదిలో నీటిప్రవా హం ఉండేలా చర్యలు తీసుకోవాలి. వాహనాల పార్కింగ్ కు స్థలాన్ని కేటాయించి.. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలి. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఉత్సవాలు విజయవంతం చేయాల’ని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, ఎస్సీ కె.వి.మహేశ్వరరెడ్డి, దేవదాయశాఖ ఏసీ ప్రసాద్ పట్నాయక్, ఆలయ ఈవో ఏడుకొండలు, ఆర్డీవో కె.సాయిప్రత్యూష, టెక్కలి డీఎస్పీ బి.లక్ష్మణరావు, సీ.ఐ శ్రీనివాసరావు, జలుమూరు ఎస్.ఐ బి.అశోక్‌బాబు, తహసీల్దారు జె.రామారావు, ఎంపిడివో బి.చిన్నమ్మడు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ సత్యనారాయణ, విద్యుత్ డీఈ జి.సురేష్, ఏఎంసీ అధ్యక్షుడు తర్ర బలరాం, ఆలయ పాలక మండలి చైర్మన్ శివప్రసాద్ పాడి పాల్గొన్నారు.
శివరాత్రి ఉత్సవాలకు శుభరాట
ప్రసిద్ధ శైవక్షేత్రం.. దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు శుక్రవారం శుభరాట(పందిరిరాట) వేశారు. ఈ నెల 15 నుంచి 18 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఈవో ఏడుకొండలు ఆధ్వర్యంలో గ్రామ పురోహితులు బంకుపల్లి భూషణశర్మ నేతృత్వంలో శుభరాట ఘనంగా నిర్వహించారు. మహాశివరాత్రి ఉత్సవాల్లో అంతా శుభమే జరగాలని దేవతామూర్తులకు పూజలు చేసినట్లు అర్చకులు తెలిపారు.