ఆర్నబ్తో అపార నష్టం
ABN , Publish Date - Oct 30 , 2026 | 12:40 AM
Crops submerged across 21,000 hectares ఆర్నబ్ తుఫాను జిల్లాను అతలాకుతలం చేసింది. ఈ నెల 26 ఆరు నుంచి 28 అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులకు సిక్కోలు వణికిపోయింది. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగగా.. ఒడిశా నుంచి పోటెత్తిన వరద నీటితో సరిహద్దు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
21వేల హెక్టార్లలో నీట మునిగిన పంటలు
రోడ్లు, విద్యుత్, ఉద్యాన పంటలకు రూ.కోట్లలో నష్టం
శ్రీకాకుళం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): ఆర్నబ్ తుఫాను జిల్లాను అతలాకుతలం చేసింది. ఈ నెల 26 ఆరు నుంచి 28 అర్ధరాత్రి వరకు కురిసిన భారీ వర్షాలు, భీకర గాలులకు సిక్కోలు వణికిపోయింది. వంశధార, నాగావళి నదులు ఉప్పొంగగా.. ఒడిశా నుంచి పోటెత్తిన వరద నీటితో సరిహద్దు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రోడ్లు కోతకు గురవగా.. విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది. గురువారం సాయంత్రం నాటికి జిల్లాలోని 29 మండలాల పరిధిలో 728 గ్రామాలు ప్రభావితమయ్యాయి. మొత్తం 48,836 మంది రైతులు నష్టపోగా, 21,590.64 హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. ఇందులో అత్యధికంగా 21,538.64 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. మందస, రణస్థలం మండలాల్లో 52 హెక్టార్లలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంట నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యాన పంటలకూ కోలుకోలేని దెబ్బ
జిల్లాలో ఉద్యాన పంటలకూ భారీ నష్టం వాటిల్లింది. 26 మండలాల్లోని 96 గ్రామాల పరిధిలో 4657 మంది రైతులకు చెందిన 383.8 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో కూరగాయలు 250.2 హెక్టార్లలో దెబ్బతినగా.. టమోటా 37, కొబ్బరి 33, అరటి 27, బొప్పాయి 17, పసుపు 4.8, పూల పంటలు 2.8, ఇతర పండ్ల తోటలు 14.7 హెక్టార్లలో దెబ్బతిన్నాయి. ఉద్యానశాఖకు మొత్తం 443.84 లక్షల నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.
ఛిద్రమైన రహదారులు
భారీ వర్షాలకు జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. రహదారులు, భవనాల శాఖ (ఆర్అండ్బీ) పరిధిలో 245 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 32 భారీ వృక్షాలు నేలకూలాయి. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు రూ.11 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.74 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని తొమ్మిది మండలాల్లో 17 కిలోమీటర్ల మేర 11 రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.11.6 ఆరు కోట్లు అవసరమని అధికారులు నివేదించారు.
అస్తవ్యస్తమైన విద్యుత్ వ్యవస్థ
ఈదురుగాలులకు 538 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, 33కేవీ ఫీడర్లు 55, 11 కేవీ ఫీడర్లు 99, 54 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ శాఖకు రూ. 144.11 లక్షల నష్టం వాటిల్లింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఎక్కువగా పంట నష్టం సంభవించిన మండలాలు
మండలం విస్తీర్ణం
ఇచ్ఛాపురం 3,449
పొందూరు 3,200
టెక్కలి 1,800
కోటబొమ్మాళి 1,580
పాతపట్నం 1,262
మెళియాపుట్టి 1,135
కొత్తూరు 1,048
సంతబొమ్మాళి 1,036