Share News

పెళ్లి చేసుకుంటానని.. బంగారంతో ఉడాయించి

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:44 AM

ఇన్‌స్టాగ్రాంలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు.. వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు.

పెళ్లి చేసుకుంటానని.. బంగారంతో ఉడాయించి
వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

- యువతిని మోసగించిన వ్యక్తి

- అరెస్టు చేసిన పోలీసులు

పలాస, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఇన్‌స్టాగ్రాంలో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు.. వివాహం చేసుకుంటానని ఆమెను నమ్మించాడు. చివరకు ఆమె వద్ద ఉన్న మూడు తులాల బంగారం ఆభరణాలను తీసుకున్నాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. విశాఖపట్నంలో నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ శుక్రవారం విలేకరులకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా లింగాపూర్‌ గ్రామానికి చెందిన గాజు అనిల్‌కుమార్‌ విశాఖపట్నం ద్వారకా బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ పార్లల్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన బెట్టింగులకు అలవాటుపడి డబ్బులు పోగొట్టుకున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించి బెట్టింగులు, జల్సాలకు వినియోగించడానికి అనేక మందిని ఇన్‌స్టాగ్రాంలో ఆకర్షిస్తూ వారితో చాటింగ్‌ చేసేవాడు. అనేక మంది యువతులతో ఈ విధంగా పరిచయం చేసుకొని వారిని పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పేవాడు. వారి నుంచి విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలను తస్కరించేవాడు. ఈ క్రమంలో నెల రోజుల కిందట సోంపేట మండలం జగతికేసుపురం గ్రామానికి చెందిన ఓ యువతితో చాటింగ్‌ చేశాడు. ఆమె కూడా అతని మాయమాటలను నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆమె దీనికి అంగీకరించింది. గత నెల 26న ఆమె మూడు తులాల బంగారు ఆభరణాలు (రూ.ఐదు లక్షల విలువైనవి) తీసుకొని పలాస-కాశీబుగ్గ చేరుకుంది. అప్పటికే అక్కడ ఉన్న అనిల్‌కుమార్‌ కొత్త నగలు చేయిస్తానని నమ్మబలకడంతో ఆమె ఆ ఆభరణాలను ఆయనకు ఇచ్చింది. ఆ నగలు తీసుకొని అనిల్‌కుమార్‌ ఉడాయించాడు. దీంతో తాను మోసపోయానని గుర్తించి కుటుంబీకులకు ఈ విషయాన్ని చెప్పింది. దీనిపై బాధితురాలు ఈ నెల 6న కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. నిందితుడిని విశాఖపట్నంలో అరెస్టు చేశారు. ఆయన నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

Updated Date - Mar 14 , 2026 | 12:44 AM