Share News

ఒడిశా టు సిక్కోలు

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:06 AM

Illegal transportation of urea ఒడిశా నుంచి సిక్కోలుకు యూరియా యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. వరుస రెండు రోజుల్లో చల్లవానిపేట, జమ్ము ప్రాంతాల్లో 200 బస్తాల యూరియా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయశాఖ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమవుతోంది.

ఒడిశా టు సిక్కోలు
జమ్ము వద్ద విజిలెన్స్‌, వ్యవసాయశాఖ అధికారులకు పట్టుబడిన యూరియా బస్తాలు

  • యథేచ్ఛగా యూరియా అక్రమ రవాణా

  • వరుస రెండు రోజుల్లో 200 బస్తాల పట్టివేత

  • విజిలెన్స్‌ దాడుల్లో పట్టుబడుతున్న వైనం

  • నరసన్నపేట, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి):

  • ఈ నెల 5న చల్లవానిపేట జంక్షన్‌ వద్ద ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 100 యూరియా బస్తాలు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయశాఖ అధికారులకు పట్టుబడ్డాయి. పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన డోల రమణమూర్తి ఎటువంటి అనుమతి లేకుండా ఈ యూరియాను తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఆయనపై 6ఏ కేసు నమోదు చేశారు. యూరియా బస్తాలను చల్లవానిపేట సొసైటీకి అప్పగించారు. వ్యాన్‌ని సీజ్‌ చేసి జలుమూరు పోలీసుస్టేషన్‌కు తరలించారు.

  • తాజాగా మంగళవారం జమ్ము వద్ద విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయశాఖ అధికారులు దాడుల్లో మరో 100 యూరియా బస్తాలు పట్టుబడ్డాయి. శ్రీకాకుళం నగరానికి చెందిన పి.విజయ్‌కుమార్‌.. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి వాహనంలో ఈ యూరియా దిగుమతి చేసుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఆయనపై 6ఏ కేసు నమోదు చేశామని ఏవో సూర్యకుమారి తెలిపారు. వాహనాన్ని సీజ్‌ చేసి.. పట్టుబడిన యూరియాను స్థానిక ప్రాథమిక సహకార సంఘానికి అప్పగించామన్నారు.

  • ఒడిశా నుంచి సిక్కోలుకు యూరియా యథేచ్ఛగా దిగుమతి అవుతోంది. వరుస రెండు రోజుల్లో చల్లవానిపేట, జమ్ము ప్రాంతాల్లో 200 బస్తాల యూరియా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయశాఖ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశమవుతోంది. కూటమి ప్రభుత్వం యూరియా వినియోగంపై పరిమితులు విధించింది. శాస్త్రవేత్తల సూచనల మేరకే రైతులకు యూరియా అందిస్తోంది. దీంతో జిల్లాలో యూరియాకు డిమాండ్‌ పెరిగింది. ఎంత ధర అయినా సరే మార్కెట్‌లో యూరియా కొనేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈక్రమంలో కొంతమంది వ్యాపారులు ఒడిశా నుంచి దిగుమతి చేస్తూ.. జిల్లాలో అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి, తదితర ప్రాంతాల నుంచి రోజూ వందలాది టన్నుల యూరియా.. పాతపట్నం, మెళియాపుట్టి, చాపర, మందస మీదుగా జిల్లాకు చేరుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా వ్యాన్‌ల్లో 50 క్వింటాళ్లు చొప్పున దిగుమతి చేస్తున్నారు. ఒడిశాలో ఒక్కో బస్తా రూ.400 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో రైతులకు రూ.550కి విక్రయిస్తున్నారు. ఈ యూరియా దిగుమతిను మొక్కజోన్న, వరి ధాన్యం గ్రామాల్లో కొనుగోలు చేసే వ్యాపారులు దిగుమతి చేసుకుంటూ గ్రామాల్లో రైతులకు అధిక ధరలకు విక్రయాలు చేస్తున్నారు. నరసన్నపేట, జలుమూరు, పోలాకి , శ్రీకాకుళం, గార పరిసర మండలాల్లో వరి, మొక్కజొన్న సాగుచేస్తున్న రైతులు ఈ యూరియాను అధికంగా కొనుగోలు చేస్తున్నారు. అలాగే ఒడిశా సరిహద్దున ఉన్న మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం, మందస, పలాస తదతర మండలాలకు కూడా విచ్చలవిడిగా యూరియా దిగుమతి అవుతోంది. అనుమతి లేకుండా దిగుమతి చేస్తున్న ఈ యూరియాపై విజిలెన్స్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌, వ్యవసాయశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈక్రమంలో ముమ్మరంగా దాడులు చేస్తూ.. యూరియాను స్వాధీనం చేసుకుంటున్నారు. యూరియా అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Updated Date - Oct 07 , 2026 | 12:06 AM