Share News

అంతా మా ఇష్టం

ABN , Publish Date - Aug 27 , 2026 | 11:49 PM

Illegal quarry operations... hills vanishing... పొందూరులో క్వారీల అక్రమ నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ లభ్యమయ్యే నల్లరాయి.. నిర్మాణాల వినియోగానికి అత్యంత నాణ్యమైనది. ఈ నేపథ్యంలో ఈ రాయి కోసం మండలంలోని రాపాక, ఇల్లయ్యగారిపేట, గారపేట (కృష్ణాపురం), వావిలపల్లిపేట తదితర గ్రామాల్లో కొండలను అక్రమార్కులు పిండి చేస్తున్నారు. అధిక శాతం క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్న విషయం తెలిసినా.. అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు.

అంతా మా ఇష్టం
కృష్ణాపురం సమీపంలో డీ-పట్టా భూముల్లో అనధికారికంగా నిర్వహిస్తున్న క్వారీ

  • పొందూరులో క్వారీల అక్రమ నిర్వహణ

  • కానరాని నిబంధనలు, అనుమతులు

  • కనుమరుగవుతున్న కొండలు..

  • పేలుడు పదార్థాలతో ప్రమాదాలు

  • పట్టించుకోని అధికారులు

  • పొందూరు, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): పొందూరులో క్వారీల అక్రమ నిర్వహణ యథేచ్ఛగా సాగుతోంది. ఇక్కడ లభ్యమయ్యే నల్లరాయి.. నిర్మాణాల వినియోగానికి అత్యంత నాణ్యమైనది. ఈ నేపథ్యంలో ఈ రాయి కోసం మండలంలోని రాపాక, ఇల్లయ్యగారిపేట, గారపేట (కృష్ణాపురం), వావిలపల్లిపేట తదితర గ్రామాల్లో కొండలను అక్రమార్కులు పిండి చేస్తున్నారు. అధిక శాతం క్వారీలు అక్రమంగా నిర్వహిస్తున్న విషయం తెలిసినా.. అధికారులు మామూళ్లు తీసుకుని చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే స్థానికులు ఆరోపిస్తున్నారు. కొండలు కనుమరుగై పర్యావరణం దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్వాహకులు ఇష్టారాజ్యంగా పేలుడు పదార్థాలు వినియోగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని వాపోతున్నారు.

  • 5 క్వారీలకే అనుమతులు

  • పొందూరు మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 50 పైగా క్వారీలు నిర్వహిస్తున్నారు. వీటిలో 5 క్వారీలకు మాత్రమే లీజు అనుమతులు ఉన్నాయి. మిగిలిన వాటిని అక్రమంగా నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. కేవలం సాగుకు వినియోగించాల్సిన డీ-పట్టా భూముల్లో క్వారీల నిర్వహణ అక్రమంగా సాగిస్తున్నారు. రాపాక, గారపేట గ్రామాల్లోని భూముల్లో సుమారు 50 అడుగుల లోతు వరకు క్వారీలు నిర్వహిస్తూ.. భారీగా రాయిని తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. క్వారీల్లో నిర్వాహకులు మోతాదుకి మించి పేలుడు పదార్థాలు వినియోగిస్తున్నారు. అత్యంత ప్రమాదకరమైన అమ్మోనియా, నైట్రేటు, డిటోనేటర్లు, జిలెటిన్‌స్టిక్స్‌, డైనమేట్స్‌ వినియోగిస్తుండడంతో 7 కిలోమీటర్ల వరకు పెద్దపెద్ద శబ్దాలు వినిపిస్తుంటాయి. సమీపంలో ఇళ్ల గోడలకు పగుళ్లు కూడా వస్తున్నారు. మరోవైపు పేలుడు పదార్థాలు పెట్టే కార్మికులకు కూడా రక్షణ పరికరాలు ఇవ్వకపోవడంతో ఒక్కోసారి వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొన్నిసార్లు మరణాలు సంభవిస్తుంటాయి. తీవ్రమైన ప్రమాదాలు జరిగినపుడు బయటకు వస్తాయి. చిన్న సంఘటనలు జరిగి కార్మికులు తీవ్రంగా గాయపడినపుడు వారి కుటుంబ సభ్యులను డబ్బుతో ప్రలోభపెట్టి.. సంఘటనలు బయటకు రాకుండా చూస్తున్నారు. పేలుళ్ల సమయంలో రహదారులపై రాకపోకలు సాగించే ప్రయాణికులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. క్వారీల్లో ప్రమాదాలు జరిగిన సమయాల్లో రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌ అధికారులు హడావుడి చేస్తారు. రెండుమూడు రోజులు క్వారీల్లో తనిఖీలు చేసి.. తర్వాత వదిలేస్తారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమాలు సాగిస్తున్న క్వారీల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

  • చర్యలు తీసుకుంటాం

  • పొందూరు మండలంలో క్వారీలను పరిశీలిస్తాం. అనధికారికంగా నిర్వహిస్తున్న క్వారీలపై చర్యలు తీసుకుంటాం. డీ-పట్టా భూముల్లో నిర్వహిస్తున్న క్వారీల నిర్వాహకులపై కేసులు పెట్టి భూములు స్వాధీనం చేసుకుంటాం.

    - ఆర్‌.వెంకటేష్‌, తహసీల్దార్‌, పొందూరు

Updated Date - Aug 27 , 2026 | 11:49 PM