Share News

భూగర్భ‘ఘనులు’!

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:00 AM

310 leases... hundreds of industries జిల్లాలో ఖనిజ సంపద అక్రమార్కుల పాలిట వరంలా మారుతోంది. అక్రమ మైనింగ్‌, రవాణాపై అధికారులు దాడులు చేస్తూ జరిమానాలు విధిస్తున్నా.. వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో లీజులు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాబట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భూగర్భ‘ఘనులు’!

  • జిల్లాలో యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌

  • 310 లీజులు.. వందల్లో పరిశ్రమలు

  • ఇష్టారాజ్యంగా తవ్వకాలు

  • మూడేళ్లలో రూ. 3.84 కోట్ల జరిమానాలు

  • డీఎంఎఫ్‌ నిధులకు పెండింగ్‌ బిల్లుల భారం రూ.25.90 కోట్లు

  • జిల్లా గనులు, భూగర్భ శాఖ నివేదిక వెల్లడి

  • శ్రీకాకుళం, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఖనిజ సంపద అక్రమార్కుల పాలిట వరంలా మారుతోంది. అక్రమ మైనింగ్‌, రవాణాపై అధికారులు దాడులు చేస్తూ జరిమానాలు విధిస్తున్నా.. వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలో లీజులు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు ఉన్నా.. ఆశించిన స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం రాబట్టలేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయల్టీ, సీనరేజ్‌ ఫీజులకు సంబంధించి లక్ష్యసాధనలో ఈ ఏడాది కాస్త ఫర్వాలేకున్నా.. గత రెండేళ్లలో మాత్రం కనీసం 60 శాతం కూడా వసూలు కాకపోవడం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు మైనింగ్‌ బాధిత ప్రాంతాల అభివృద్ధికి వాడాల్సిన జిల్లా మినరల్‌ ఫౌండేషన్‌ నిధుల్లో సగానికిపైగా పాత బిల్లులకే సరిపోతున్నాయి. కొత్త పనులకు నిధుల లేమి వేధిస్తోంది. తాజాగా జిల్లా గనులు, భూగర్భ శాఖ విడుదల చేసిన నివేదిక ఈ వాస్తవాలను వెల్లడించింది.

  • జిల్లావ్యాప్తంగా మూడేళ్లలో కలర్‌ గ్రానైట్‌, రోడ్‌ మెటల్‌, క్వార్ట్జ్‌ తదితర చిన్న తరహా ఖనిజాలకు సంబంధించి 1417.524 హెక్టార్ల విస్తీర్ణంలో మొత్తం 310 లీజులు మంజూరయ్యాయి. అలాగే 154 గ్రానైట్‌ కటింగ్‌, పాలిషింగ్‌ యూనిట్లు, 111 స్టోన్‌క్రషర్లు కలుపుకొని మొత్తం 289 ఖనిజ ఆధారిత పరిశ్రమలు నడుస్తున్నాయి. మరోవైపు జిల్లాలో నిర్మాణ రంగాలకు ఇసుక కొరతను నివారించేందుకు దూసి, తోటపాలెం, ఆకులతంపర తదితర 8 ప్రాంతాల్లో డీ-సిల్టేషన్‌ పద్ధతిలో తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్‌ 2 నాటికి 6,64,919 మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తమ నివేదికలో వెల్లడించారు. కాగా.. ఖనిజాల తవ్వకాల ద్వారా పెద్ద ఎత్తున రాయల్టీ, సీనరేజ్‌ ఫీజుల రూపంలో ఆదాయం వస్తుందని అంచనా వేసినప్పటికీ, గడిచిన రెండేళ్ల రికార్డులు తీవ్ర నిరాశను మిగిల్చాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు రూ.238 కోట్లు ఆదాయం లక్ష్యం కాగా.. కేవలం రూ.143.94 కోట్లు మాత్రమే వసూలైంది. 60.48 శాతం ప్రగతితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక 2024-25లో రూ. 149.90 కోట్ల లక్ష్యానికిగానూ కేవలం రూ. 87.58 కోట్లు(58.43 శాతం) మాత్రమే వసూలైంది. అయితే 2025-26లో మాత్రం పరిస్థితి కొంత మెరుగుపడింది. రూ.190 కోట్ల లక్ష్యానికిగానూ రూ. 230 కోట్లు వసూలైంది. 113.94 శాతం మేర లక్ష్యాన్ని సాధించడం కొంత ఊరటనిచ్చే అంశం.

  • అక్రమ తవ్వకాలకు అడ్డూఅదుపూ లేదు

  • జిల్లాలో ఖనిజాల అక్రమ రవాణా, అనుమతులు లేని తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. 2023-24లో 134 అక్రమ మైనింగ్‌ కేసులను నమోదు చేసిన అధికారులు రూ.47.89 లక్షల జరిమానా వసూలు చేశారు. 2024-25లో కేవలం 53 కేసుల్లోనే ఏకంగా రూ.2.28 కోట్ల భారీ అపరాధ రుసుము వసూలు చేశారంటే అక్రమాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. 2025-26లో కూడా 107 కేసులు నమోదు చేసి రూ.1.08 కోట్ల మేర జరిమానాలు రాబట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో (ఆగస్టు 31 చివరి నాటికి) 12 కేసులు నమోదు చేసి రూ.6.69 లక్షలు వసూలు చేశారు.

  • పెండింగ్‌ బిల్లుల గుదిబండ..

  • మైనింగ్‌ బాధిత ప్రాంతాల అభివృద్ధికి కేటాయించే డీఎంఎఫ్‌ నిధుల పరిస్థితి కూడా ఆశాజనకంగా లేదు. ఈ-పర్మిట్‌, ఇసుక ద్వారా జిల్లాకు ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి రూ. 102.92 కోట్లు జమయ్యాయి. వివిధ ప్రాజెక్టులు, కొవిడ్‌-19 ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు రూ.64.60 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం పీడీ ఖాతాలో రూ.33.79 కోట్లు మిగిలి ఉండగా, ఇందులో గతంలో చేసిన పనులకు సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులే రూ.25.90 కోట్లు ఉండటం గమనార్హం. ఈ పాత బిల్లుల భారంపోనూ జిల్లాలో కొత్త పనులు ప్రతిపాదించడానికి మిగిలింది కేవలం రూ.7.89 కోట్లు మాత్రమే.

Updated Date - Oct 09 , 2026 | 12:00 AM