Share News

దేన్నీ వదలం!

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:14 AM

Illegal gravel excavations రణస్థలం మండలంలో అక్రమార్కులు కొండలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ముక్తింపురంలో 76 ఎకరాల్లో కొండ పోరంబోకు భూమి ఉంది. వననర్సరీలో భాగంగా ఈ భూమిలో అటవీశాఖ నీలగిరి, ఆకేసు చెట్లు పెంచుతోంది. కాగా అక్రమార్కులు ఈ ప్రాంతంలో కనీస అనుమతులు లేకుండా వేలాది క్యూబిక్‌ మీటర్లలో కంకర తవ్వకాలు చేపట్టారు.

దేన్నీ వదలం!
కంకర తవ్వకాలతో స్వరూపం కోల్పోయిన ముక్తింపురం కొండ .. ఇన్‌సెట్‌లో.. కోసంగిపురం రోడ్డులో ప్రభుత్వ గృహ సముదాయం వద్ద కంకర తవ్వకాలు..

  • ముక్తింపురం కొండపై కంకర అక్రమ తవ్వకాలు

  • హెచ్చరిక బోర్డులను ఖాతరు చేయని వైనం

  • పత్రికల్లో కథనాలు వచ్చినప్పుడే అధికారుల చర్యలు

  • ఆతర్వాత అటువైపు కన్నెత్తి చూడని వైనం

  • వైసీపీ హయాంలో 15 ఎకరాల మేర చదును

  • ఆక్రమించుకునేందుకు చోటా నేతల పన్నాగం

  • ‘కొండనూ వదలం. ప్రభుత్వ భూమినీ విడిచిపెట్టం. అంతా మాదే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు. రణస్థలంలో ముక్తింపురం కొండపై ఇష్టారాజ్యంగా కంకరను అక్రమంగా తవ్వి.. తరలించేస్తున్నారు. దీనిపై పత్రికల్లో కథనాలు వచ్చినా.. అధికారులు హెచ్చరికలు జారీచేసినా.. అక్రమ తవ్వకాలు మాత్రం ఆపడం లేదు. మరోవైపు పలాసలో కూడా యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తున్నారు. సాక్షాత్తు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష రంగంలోకి దిగి హెచ్చరికలు జారీ చేసినా అక్రమార్కులు తగ్గడం లేదు. రాత్రివేళల్లో కొండలపై ఇష్టారాజ్యంగా కంకర తవ్వేస్తూ.. గోతులుగా మార్చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే భవిష్యత్‌లో కొండలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • రణస్థలం, పలాస, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): రణస్థలం మండలంలో అక్రమార్కులు కొండలను యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ముక్తింపురంలో 76 ఎకరాల్లో కొండ పోరంబోకు భూమి ఉంది. వననర్సరీలో భాగంగా ఈ భూమిలో అటవీశాఖ నీలగిరి, ఆకేసు చెట్లు పెంచుతోంది. కాగా అక్రమార్కులు ఈ ప్రాంతంలో కనీస అనుమతులు లేకుండా వేలాది క్యూబిక్‌ మీటర్లలో కంకర తవ్వకాలు చేపట్టారు. వందలాది లారీలు, ట్రాక్టర్లలో కంకరను తరలించేశారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ గతంలో పలుమార్లు కథనాలు రాయగా.. అధికారులు స్పందించారు. ఇది ప్రభుత్వ భూమి అని తవ్వకాలు చేపట్టినా, ఆక్రమించినా శిక్షార్హులు అంటూ హెచ్చరిక బోర్డు పెట్టారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజులు అక్రమాలు నిలిచిపోయాయి. మళ్లీ తాజాగా ముక్తింపురం కొండపై కంకర తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నాటి హెచ్చరిక బోర్డులు కూడా ఎక్కడా కానరావడం లేదు. రోజూ పదుల సంఖ్యల్లో లారీలు, ట్రాక్టర్లతో కంకర తరలిపోతున్నా.. భూగర్భ గనులు, మైనింగ్‌ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

  • అప్పట్లో భారీ ఆక్రమణ..

  • గతంలో ముక్తింపురం కొండను వైసీపీ నేతలు ఆక్రమించేందుకు పన్నిన పన్నాగం వివాదంగా మారింది. ఇక్కడ ఎకరా రూ.3కోట్లకుపైగా పలుకుతోంది. ఈ భూమి పక్కనే ప్రైవేటు లేఅవుట్‌లు వెలిశాయి. ఇక్కడ సెంటు రూ.3లక్షల చొప్పున ఇంటి ప్లాట్‌లుగా విక్రయించారు. దీంతో కొండ పోరంబోకు భూమిపై కొంతమంది కన్నుపడింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కొండ దిగువ ప్రాంతంలో 15 ఎకరాలు చదును చేసి ప్లాట్లుగా విభజించారు. గ్రామంలో నిరుపేదల పేరిట ప్లాట్లను విభజించారు. ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఎటువంటి అనుమతులు తీసుకోలేదు. 200 మందికిపైగా ప్లాట్లు కట్టబెట్టారు. అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసినట్టు ప్రచారం చేశారు. కానీ తెర వెనుక మొత్తం భూమిని ఆక్రమించుకోవాలని అప్పటి చోటా నేతలు యత్నించారు. అది రెండు సామాజికవర్గాల మధ్య వివాదంగా మారిపోయింది. 2024 ఫిబ్రవరి 4న ఘర్షణకు దారితీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తరువాత అధికారులు వచ్చి బోర్డులు పాతడంతో వివాదం సద్దుమణిగింది. ఈ తంతు జరిగి ఏడాది తిరగకముందే గ్రావెల్‌(కంకర) దందా నడిచింది. ఇప్పుడు కూడా సూచిక బోర్డులు పెట్టినా అక్రమార్కులు బేఖాతరు చేస్తున్నారు. ఇష్టారాజ్యంగా కంకర తవ్వేస్తుండడంతో కొండ ఆనవాళ్లు లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కొండపై కంకర అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

  • చర్యలు తీసుకుంటాం

  • ముక్తింపురం కొండలో కంకర తవ్వకాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సిబ్బందిని అప్రమత్తం చేశాం. పూర్తిస్థాయిలో పరిశీలిస్తాం. కంకర అక్రమంగా తవ్వేవారిపై నిఘా పెట్టాలని వీఆర్‌వోలకు ఆదేశాలు ఇచ్చాం. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం.

  • - సనపల కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌, రణస్థలం

  • పలాసలో కలెక్టర్‌, ఎమ్మెల్యే హెచ్చరించినా..

  • పలాసలో కంకర తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. కోసంగిపురం రోడ్డు ప్రభుత్వ గృహ సముదాయం ప్రాంతంలో ఐదు ఎకరాల కంకర కొండ ఉండేది. అప్పటి కాలనీలో రోడ్డు నిర్మాణం కోసం కొండను తవ్వారు. ఎటువంటి అనుమతులు లేకుండా తవ్వినా మట్టి కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం భారీస్థాయిలో వారికి డబ్బులు చెల్లించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మిగిలిన కొండతోపాటు ఆ ప్రాంతంలో పది అడుగుల కిందకు కూడా తవ్వకాలు చేపట్టి మట్టిని తరలించారు. ఇప్పటికీ తరలిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో జరిగిన కంకర మట్టి తవ్వకాల విలువ రూ.కోటికిపైగా ఉంటుందని అంచనా.

  • జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో డీపట్టా భూముల్లో అనుమతులు లేకుండా కంకరను తరలిస్తున్నారు. భూమిని చదును చేసే పేరుతో మొత్తం ఆ ప్రాంతంలో ఇప్పటికి వంద టిప్పర్లుకు పైగా కంకరను తవ్వినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో కంకరను తవ్వి రహదారులు, పునాదుల్లో నింపేందుకు దీన్ని తరలిస్తున్నారు. దీనికికూడా మైనింగ్‌, రెవెన్యూశాఖ నుంచి అనుమతులు లేకపోవడం విశేషం.

  • సాక్షాత్తు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే గౌతు శిరీష.. ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల కిందట కంకర తవ్వకాల ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇప్పటివరకూ కంకర తవ్వకందారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి.

  • వాస్తవానికి బెండి కొండను క్వారీ తవ్వకాలకు అనుమతి ఇస్తామని మైనింగ్‌శాఖ అధికారులు సూచనప్రాయంగా తెలిపారు. ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంతో సాధారణ కొండలు సైతం బోడికొండలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కంకర తవ్వకందారులపై చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

  • ఈ విషయమై తహసీల్దార్‌ టి.కల్యాణచక్రవర్తి వద్ద ప్రస్తావించగా.. ‘పలాసలో కంకర అక్రమ తవ్వకాలు చేపడుతున్న ప్రాంతాలను గుర్తించాం. అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామ’ని తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 12:14 AM