ఇంటికి తిరిగి వస్తారనుకుంటే..
ABN , Publish Date - May 21 , 2026 | 11:59 PM
శ్రీకాకుళం రూరల్ మండలం లోని పీజీపేట తీరంలో ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృత దేహాలు లభ్యమయ్యాయి.
గల్లంతైన విద్యార్థుల మృతి
కుటుంబాల్లో విషాదం
శ్రీకాకుళం రూరల్, మే 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రూరల్ మండలం లోని పీజీపేట తీరంలో ఈతకు వెళ్లి గల్లంతైన విద్యార్థుల మృత దేహాలు లభ్యమయ్యాయి. ఈత కు వెళ్లిన వీరిద్దరూ విగత జీవులుగా మారడంతో విషాదం నెలకొంది. పోలీసుల కథనం మేరకు.. పెద్దగణగళ్లవానిపేట వద్ద తీరంలో బుధవారం ఇద్దరు బాలురు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఈ మేరకు పోలీసులు బుధవారం మధ్యాహ్నం నుంచి గాలించారు. రాత్రి వరకు పడవలు, వలలతో వెతికారు. చివరకు కుందువానిపేట తీరం సమీపంలో గురువారం ఉదయం గుజ్జల లీల కృష్ణా(15), వజ్రపు సాయి తిలక్ (15) విగతజీవులుగా కనిపించారు. పదో తరగతి పూర్తిచేసిన వీరిద్దరూ ఆటపాటలతో గడపాల్సిఉండగా విగతజీవులుగా కనిపించడంతో విషాదం నెలకొంది. వీరిద్దరు మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. రూరల్ ఎస్‌ఐ కె.రాము మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.