Share News

మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతాడనుకుంటే...

ABN , Publish Date - Apr 11 , 2026 | 11:39 PM

విధులు ముగించుకొని వస్తున్న ఆ కానిస్టేబుల్‌ మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతాడనగా... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

 మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతాడనుకుంటే...
గోపాల్‌ (ఫైల్‌)

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌ దుర్మరణం

నందిగాం, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): విధులు ముగించుకొని వస్తున్న ఆ కానిస్టేబుల్‌ మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతాడనగా... రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. మండల కేంద్రమైన నందిగాం ఎస్సీ కాలనీకి చెందిన చీమల గోపాలకృష్ణ అలియాస్‌ గోపాల్‌(40) అనే పోలీస్‌ కానిస్టేబుల్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నందిగాంకు చెందిన గోపాల్‌ టెక్కలి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై నందిగాం వస్తుండగా ఆకులరఘునాఽథపురం, బెజ్జిపల్లి మధ్య జాతీయ రహదారిపై వెనుక నుంచి వరికోత యంత్రం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. జాతీయ రహదారిపై వెళుతున్న వారు గుర్తించి 108కు సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. గోపాల్‌ మృతితో భార్య సునీత, కుమార్తెలు జోష్మిక, కాన్విక, తల్లి సరోజినమ్మ, సోదరుడు రాజు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహానికి టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంబులెన్స్‌లో నందిగాం పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేర్చగా... అక్కడి నుంచి యువకులు, సైనికోద్యోగులు, మాజీ సైనికోద్యోగులు బైక్‌ర్యాలీగా మృతదేహాన్ని ఇంటివద్దకు చేర్చారు. శనివారం సాయంత్రం పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. టెక్కలి సీఐ విజయ్‌కుమార్‌, నందిగాం ఎస్‌ఐ షేక్‌ మహ్మద్‌ అలీ, ఏఆర్‌ కానిస్టేబుళ్లు, స్థానిక పోలీసులు నివాళులర్పించారు. మూడురౌండ్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవ వందనం చేశారు. అనంతరం మృతదేహానికి సోదరుడు రాజు నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేశారు. నందిగాం ఎస్‌ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 11 , 2026 | 11:39 PM