Share News

ముట్టుకుంటే.. ముప్పే

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:19 AM

The dangers posed by electrical transformers శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు అనేక చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చారు. కానీ వాటి వల్ల ప్రజలకు ప్రమాదాలు కలుగకుండా కనీసస్థాయిలో కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ముట్టుకుంటే.. ముప్పే
శ్రీకాకుళం జీటీ రోడ్డులోని బ్యాంకు ఎదుట రక్షణ కంచె లేని విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లకు ఆనుకుని వాహనాల పార్కింగ్‌

విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లతో పొంచి ఉన్న ప్రమాదం

చాలాచోట్ల కానరాని రక్షణ కంచెలు

భయాందోళనలో శ్రీకాకుళం నగర ప్రజలు

పాత శ్రీకాకుళం, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ అధికారులు అనేక చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చారు. కానీ వాటి వల్ల ప్రజలకు ప్రమాదాలు కలుగకుండా కనీసస్థాయిలో కూడా చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు బయటే వదిలేయడంతో.. పొరపాటున అవి తగిలినా.. వాటిని ముట్టుకున్నా.. ప్రజలకు, మూగజీవాలకు ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉందని పలువురు భయాందోళన చెందుతున్నారు.

శ్రీకాకుళం నగరంలో సుమారు 350కిపైగా విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వీటిలో చాలా ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు లేక ముప్పు పొంచే పరిస్థితులు నెలకొన్నాయి. చాలా చోట్ల భూమికి తక్కువ ఎత్తులో ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చడం వల్ల ప్రమాదాలు వాటిల్లే అవకాశం ఉంది. నానుబాలవీధి నుంచి పుణ్యపువీధి మధ్యలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు సంబంధించిన విద్యుత్‌ వైర్లు బయటకు వేలాడుతున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవుల వేళ.. పిల్లలు, యువకులు ఆట సందడిలో ఈ వైర్లను తాకితే ప్రమాదమే. శ్రీకాకుళం నగరంలో జీటీ రోడ్డు స్టేట్‌బ్యాంక్‌ సమీపంలో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద అదే పరిస్థితి. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతోపాటు.. వస్త్రదుకాణాలు ఇదే మార్గంలో ఉండడంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. కానీ ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌కు రక్షణ కంచె లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉంది. ప్రధాన రహదారిలో మరికొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు లేవు. నగరం శివారు వీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు చుట్టూ పిచ్చిమొక్కలు దర్శనమిస్తున్నాయి. శ్రీరామ్‌నగర్‌ కాలనీ వద్ద రామగెడ్డ సమీపాన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌కు తీగజాతి మొక్కలు అల్లుకున్నాయి. వీటిని పశువులను తినేందుకు ప్రయత్నించే క్రమంలో విద్యుత్‌ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ కంచెలు ఏర్పాటు చేయాలని, వాటిచుట్టూ ఉన్న పిచ్చిమొక్కలు, తీగలు తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తాం

శ్రీకాకుళంలో ఐదు అడుగులు కన్నా తక్కువ ఎత్తులో ఉండే విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తిస్తాం. వాటి ఎత్తు పెంచేందుకు చర్యలు చేపడతాం. ప్రమాదకరమై ప్రాంతాల్లో రక్షణ కంచెలు ఏర్పాటు చేస్తాం.

- ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, శ్రీకాకుళం

Updated Date - Apr 24 , 2026 | 12:19 AM