Share News

నిబంధనలు పాటిస్తే ఒట్టు!

ABN , Publish Date - Mar 04 , 2026 | 11:54 PM

నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో కొందరు బిల్డర్లు అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లో నిబంధనలు కాలరాస్తున్నారు.

నిబంధనలు పాటిస్తే ఒట్టు!

- నరసన్నపేటలో అడ్డగోలుగా అపార్ట్‌మెంట్ల నిర్మాణం

- డమ్మీ ప్లాన్లతో బిల్డర్ల బురిడీ

- కానరాని సుడా అనుమతులు

- సెల్లార్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

- కొనుగోలుదారుల గగ్గోలు

- పోలాకి మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి నరసన్నపేటలోని ఒక అపార్టుమెంట్‌లో ఇటీవల ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు. ఫ్లాట్‌ ధరలో 30శాతం మేరకు అడ్వాన్స్‌ను బిల్డర్‌కు చెల్లించాడు. అపార్టుమెంట్‌ పూర్తి కాగా.. ఆ ఉపాధ్యాయుడు బ్యాంకులో రుణం పొందేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. సుడా అనుమతిచ్చిన ప్లాన్‌ జతచేయాలని బ్యాంకు అధికారులు కోరారు. దీనికోసం ఆ ఉపాధ్యాయుడు బిల్డర్‌ను అడిగితే.. పాత ప్లాన్‌ మాత్రమే ఉందని.. సుడా ప్లాన్‌ లేదని చెప్పడంతో ఆ ఉద్యోగి ఖంగుతిన్నాడు. గత్యంతరం లేక ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలో రుణం తీసుకున్నాడు.

- పట్టణంలోని మరొక అపార్టుమెంట్‌లో ఇటీవల నరసన్నపేటకు చెందిన వ్యాపారి ఫ్లాట్‌ను కోనుగోలు చేశాడు. సెల్లార్‌లో పార్కింగ్‌ ఉన్నట్లు ఫ్లానింగ్‌లో చూపించారు. తీరా అపార్టుమెంట్‌ నిర్మాణం పూర్తయిన తరువాత చూస్తే... సెల్లార్‌లో షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించి ఉంది. కేవలం దారి మాత్రమే ఉంచారు. ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే కనీసం అగ్నిమాపక శకటం వెళ్లేందుకు అవకాశం కూడా లేదు. దీంతో ఫ్లాట్‌ కొనుగోలు చేసిన వ్యాపారి బిల్డర్‌తో గొడవపడినా ఫలితం లేకపోయింది.

నరసన్నపేట, మార్చి 4(ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మేజర్‌ పంచాయతీలో కొందరు బిల్డర్లు అపార్ట్‌మెంట్ల నిర్మాణాల్లో నిబంధనలు కాలరాస్తున్నారు. సుడా (శ్రీకాకుళం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ) అనుమతులు లేకుండానే అపార్ట్‌మెంట్లు కడుతున్నారు. గతంలో (2019 ముందు) పంచాయతీ నుంచి జీ ప్లస్‌ త్రీ నిర్మాణాల కోసం తీసుకున్న అనుమతులనే సుడా అనుమతులుగా చెప్పి డమ్మీ ప్లాన్‌తో కొనుగోలుదారులను బురిడీ కొట్టిస్తున్నారు. వారి మాటలను నమ్మి ఈ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్లను కోనుగోలు చేస్తున్న వారు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలో 15 వరకు అపార్ట్‌మెంట్లు ఉండగా ఇందులో సగానికిపైగా నిబంధనలను అతిక్రమించి నిర్మించినవే ఉన్నాయి. కొన్నిచోట్ల సాగునీటి కాలువలు, చెరువులు, మురికి కాలువలను ఆక్రమించి భవనాలను నిర్మించారు. గతంలో కొందరు పంచాయతీ అధికారులు ప్లాన్లు మార్చుచేయడంలో బిల్డర్లకు తోడ్పాటు అందించారనే విమర్శలు ఉన్నాయి.

ఇదీ పరిస్థితి..

- పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఇటీవల అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు జోరుగా జరుగుతున్నాయి. నిబంధనలు పాటించి నిర్మాణాలు చేపడుతున్నట్లు బిల్డర్లు చెప్పి పునాది దశలోనే ఫ్లాట్లను విక్రయిస్తున్నారు. సంబంధిత కొనుగోలుదారులు ఫ్లాట్లను ష్యూరిటీగా పెట్టి బ్యాంకు రుణం తీసుకునేందుకు దరఖాస్తు చేసుకుంటే వాటికి సుడా అనుమతులు లేవని బ్యాంకర్లు తిరస్కరిస్తున్నారు. దీంతో ప్రైవేటు సంస్థల నుంచి రుణం తీసుకోవాల్సి వస్తోంది.

- మరి కొందరు బిల్డర్లు పట్టణ ప్రణాళిక విభాగం నిబంధనలను కాలరాసి సెల్లార్‌ భాగంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో వాచ్‌మన్‌ గది తప్ప ఎటువంటివి ఉండకూడదు. కారు, ద్విచక్ర వాహనాల పార్కింగ్‌కు, ప్రజలు రాకపోకలకు వీలుగా సెల్లార్‌ను ఖాళీగా ఉంచాలి. కానీ, సెల్లార్‌లో షాపులను నిర్మిస్తుండడంతో అపార్టుమెంట్‌లో ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శకటం వెళ్లేందుకు కూడా వీలులేని పరిస్థితి నెలకొంది.

- అపార్ట్‌మెంట్‌లలో ఉంటున్న వారు సమావేశం అయ్యేందుకు, చిన్నచిన్న ఫంక్షన్లు చేసుకునేందుకు గాను ఒక ఫ్లాట్‌ను కేటాయించాలి. ఇలా నిబంధనలు పాటిస్తామని సుడా నుంచి అనుమతి పొంది నిర్మాణాలు చేపట్టాలి. కానీ, నరసన్నపేటలో ఉన్న అపార్ట్‌మెంట్లలో ఆ గది కేవలం ప్లాన్‌లోనే ఉంటుంది. తరువాత వాటిని కూడా నివాస గదిగా మార్పు చేసి విక్రయాలు చేపడుతున్నారు. సుడా అనుమతి లేకపోతే బ్యాంకులు కూడా ఇళ్లు కోనుగోలు చేసేందుకు రుణాలు ఇవ్వవు. ఇది తెలియని కొందరు కొనుగోలుదారులు బిల్లర్ల మాయలో పడి ముందస్తుగా అడ్వాన్స్‌లు చెల్లిస్తున్నారు. ఆ ఫ్లాట్‌ను ష్యూరిటీగా పెట్టి రుణం అడిగితే బ్యాంకులు ఇవ్వడం లేదు. దీంతో వారు ఇబ్బంది పడుతున్నారు.

సుడా అనుమతి తీసుకోవాలి

సుడా అనుమతి లేకుండా బహుళ అంతస్తు భవనాలను నిర్మించకూడదు. సుడా నిబంధనలు, ప్లాను ప్రాప్తికే నిర్మాణాలు చేపట్టాలి. నిబంధనలు పాటించకుండా కట్టిన అపార్టుమెంట్లపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం. అపార్టుమెంట్‌ వాసుల సామాజిక కార్యక్రమాల కోసం ఓ గదిని కేటాయించాల్సిందే.

-అమర్‌నాథ్‌, సుడా అధికారి, శ్రీకాకుళం

Updated Date - Mar 04 , 2026 | 11:54 PM