Share News

ఇలా ఉంటే నీరెలా?

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:26 PM

వంశధార ప్రధాన ఎడమకాలువ పరిధిలోని శివారు ప్రాంతాలకు సాగునీటి గండం పొంచి ఉంది.

ఇలా ఉంటే నీరెలా?
కోటబొమ్మాళి మండలం మంచాలపేట సమీపంలో జాతీయరహదారి వద్ద కాలువ దృశ్యం

- అధ్వానంగా వంశధార ప్రధాన ఎడమకాలువ

- నిధులు మంజూరైనా అరకొరగా పనులు

- శివారు ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్థకమే?

- కానరాని ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశం

- ఆందోళనలో రైతులు

టెక్కలి, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): వంశధార ప్రధాన ఎడమకాలువ పరిధిలోని శివారు ప్రాంతాలకు సాగునీటి గండం పొంచి ఉంది. పలుచోట్ల షట్టర్లు శిథిలం కావడం, అండర్‌ టన్నల్స్‌, సూపర్‌పాసేజ్‌లు, ఆప్‌టెక్‌ స్లూయిస్‌లు, సర్‌ప్లస్‌వైర్లు వంటివి దెబ్బతినడం, దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోకపోవడం, పూడికలు, గుర్రపుడెక్క తొలగించకపోవడం, గట్లు బలహీన పడడం వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో ఈ ఏడాది శివారు ప్రాంతాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది జూన్‌ 15 నాటికే ఎడమకాలువ ద్వారా సాగునీరు అందించాలని ప్రభుత్వం సంకల్పించినా ఆ స్థాయిలో పనులు సాగడం లేదు.

ఇదీ పరిస్థితి..

వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా సుమారు 1.48 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. అందులో 58,267 ఎకరాలకు చెరువులు ద్వారా సరఫరా కావాల్సి ఉంది. కానీ, శివారు భూములకు నీరు అందకపోవడంతో ప్రతి సంవత్సరం వేలాది ఎకరాల్లో పంట దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో కాలువ ఆధునికీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది ఆపరేషన్‌ మెంటెనెన్స్‌ కింద నరసన్నపేట డివిజన్‌ పరిధిలో 116 పనులకు రూ.8.60కోట్లు, టెక్కలి డివిజన్‌ పరిధిలో 53 పనులకు రూ.2.12కోట్లు కేటాయించింది. అయితే, వంశధార అధికారులు నరసన్నపేట డివిజన్‌లో 0-10 కిలోమీటర్ల పరిధిలో సుమారు రూ.కోటి ఆపరేషన్‌ మెంటినెన్స్‌ పనులు పెట్టగా, 10-55కిలోమీటర్లు మధ్య అంతంత మాత్రమే పెట్టారు. దీంతో కేవలం డిస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ పనులకు ప్రాధాన్యత ఇచ్చి మెయిన్‌ కాలువపై దృష్టి సారించడం లేదు. ఈ పనులు కూడా అధికార పార్టీ కార్యకర్తలకు ఉపాధిగా మారాయే తప్ప పూర్తిస్థాయిలో జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి వంశధార ఎడమ కాలువ వెంబడి 2,400 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉంది. కానీ, టెక్కలి దరికి వచ్చేసరికి కనీసం 600 క్యూసెక్కులు కూడా రావడం లేదు. కాలువలో కనిపిస్తున్న పూడికలు, పిచ్చిమొక్కలను చూసి శివారు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశం జాప్యం..

ఇరిగేషన్‌ ఎడ్వైజరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఈ సమావేశానికి హాజరై ఖరీఫ్‌ సీజన్‌ గురించి ముందస్తుగా ప్రణాళికలు వేయాల్సి ఉంది. అయితే, ఏప్రిల్‌లో జరగాల్సిన ఈ సమావేశం ఇప్పటి వరకూ జరగలేదు. దీంతో ఆయా శాఖలకు లోపాలను సరిదిద్దుకునే అవకాశం కనిపించడం లేదు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దృష్టిసారించి శివారు ప్రాంతానికి సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

సాగునీరు అందిస్తాం

ప్రధాన ఎడమకాలువ పరిధి శివారు ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నదే మా లక్ష్యం. నరసన్నపేట డివిజన్‌లో ప్రధాన కాలువలో జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ పనులకు సంబంధించి వ్యవసాయ, రెవెన్యూ, వంశధార అధికారులతో ఓ కమిటీ వేస్తాం. ఇప్పటికే గొట్టాబ్యారేజీ నుంచి కిడిసింగి వరకు ఆపరేషన్‌ మెంటెనెన్స్‌ నిధులు రూ.10.72కోట్లతో పనులు జరుగుతున్నాయి. మరో రూ.9కోట్లతో అత్యవసర పనులకు ప్రతిపాదనలు పెట్టాం. బ్యారేజీలోకి నీరు చేరిన వెంటనే విడుదల చేస్తాం.

-జి.రామచంద్రరావు, వంశధార సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌

Updated Date - Jun 10 , 2026 | 11:26 PM