Share News

మీ ఇళ్లయితే.. ఇలానే ఉంచుతారా?

ABN , Publish Date - Jul 23 , 2026 | 12:28 AM

Minister Parthasaradhi expresses anger over officials' conduct హుద్‌హుద్‌ గృహ సముదాయం నిర్మాణాల్లో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర గృహ నిర్మాణం, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లయితే ఈ విధంగానే ఉంచుతారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు.

మీ ఇళ్లయితే.. ఇలానే ఉంచుతారా?
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి పార్థసారధి, చిత్రంలో ఎమ్మెల్యేలు అశోక్‌, శిరీష

  • హౌసింగ్‌ అధికారుల తీరుపై మంత్రి పార్థసారధి అసహనం

  • హుద్‌హుద్‌ గృహ సముదాయం పరిశీలన

  • పలాస, జూలై 22(ఆంధ్రజ్యోతి): హుద్‌హుద్‌ గృహ సముదాయం నిర్మాణాల్లో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర గృహ నిర్మాణం, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ ఇళ్లయితే ఈ విధంగానే ఉంచుతారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం సూదికొండ కాలనీ సమీపంలో అసంపూర్తిగా ఉన్న హుద్‌హుద్‌ గృహసముదాయాన్ని పలాస, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేలు గౌతు శిరీష, బెందాళం అశోక్‌తో కలిసి మంత్రి పరిశీలించారు. ఇళ్లపై పొదలు, రహదారులు కనిపించకుండా పిచ్చిమొక్కలు, శిథిలమైన నిర్మాణాలు చూసి చలించిపోయారు. ఇంజనీరింగ్‌ అధికారులను పిలిచి ఎందుకు నిర్మాణాలు ఆగిపోయాయి, లబ్ధిదారులకు ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మరమ్మతులకు రూ.9కోట్ల మేర ఖర్చు అవుతాయని ఇంజనీరింగ్‌ అధికారులు తెలిపారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అనంతరం గృహాల పరిస్థితి నేరుగా పరిశీలించారు. హుద్‌హుద్‌ గృహాలను మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందించే చర్యలు చేపడతామని మంత్రి పార్థసారధి తెలిపారు.

  • డిసెంబరు నాటికి పూర్తి చేయాల్సిందే

  • ‘గత వైసీపీ ప్రభుత్వం గృహనిర్మాణ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది. 2014-19లో 4.73 లక్షల గృహాలను రద్దు చేసి.. రెండు లక్షల మందికి రూ.919 కోట్ల బిల్లులు ఎగ్గొట్టింద’ని రాష్ట్ర గృహ నిర్మాణ, పౌరసంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. బుధవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో పలాస, ఇచ్ఛాపురం నియోజవర్గాలకు సంబంధించి గృహ నిర్మాణశాఖపై సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ‘గృహ నిర్మాణ పథకం ప్రజలకు చేరువ కావాలి. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతు కొత్త హౌసింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. నిర్మించిన ప్రతి ఇంటికి దశలవారీగా మొత్తం నగదు చెల్లించాలి. డిసెంబరు నాటికి ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తిచేయాల్సిందే. ప్రజల సొంతింటి కళ నెరవేర్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వంతో మాట్లాడి కొత్తగా 5.75లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నార’ని తెలిపారు.

  • ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ ‘లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఇళ్లు, బిల్లులు మంజూరు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ అధికారులకు ముందుగా హౌసింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు సమాచారం ఇవ్వడంలో తాత్సారం జరుగుతోందని తెలిపారు. వైసీపీ మాదిరి కూటమి ప్రభుత్వంలో దోపిడీ జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

  • వివిధ మండలాలకు చెందిన నాయకులు దువ్వాడ సంతోష్‌కుమార్‌, దాసరి తాతారావు, తమ్మినేని గంగారామ్‌, సప్ప నవీన్‌ మాట్లాడుతు రాజపురంలో గతంలో 30 ఇళ్లు నిర్మించినా నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. గ్రామ పెద్దలు పేదలకు మోసం చేసిన కారణంగా కొత్తగా గృహాలు పొందలేకపోతున్నారని, బిల్లులు రావడం లేదని.. అధికారులు పట్టించుకోవడం లేదని తెలిపారు. టిడ్కో గృహ లబ్ధిదారులకు ఇళ్లులేక, స్థలాలు లేక బాధపడుతున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో సమస్యలు పరిష్కరించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్‌ ఎస్‌ఈ ఎం.కృష్ణయ్య, పీడీ నర్సింగరావు, డీఈఈ సత్యజిత్‌, జేసీ ఫర్మాన్‌అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో అప్పలరాజు, పీరుకట్ల విఠల్‌రావు, వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావుయాదవ్‌, మల్లా శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 12:28 AM