Share News

ఆ పార్టీ కాకుంటే.. ఈ పార్టీ!

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:28 AM

Switching parties just for the sake of positions... స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఆశించిన పదవులు దక్కుతాయన్న నమ్మకం ఉన్న పార్టీలో కొనసాగడం.. లేదంటే మరో పార్టీ కండువా కప్పుకోవడం.. చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతుండగా, మరికొందరు టీడీపీ నుంచి జనసేన, బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు.

ఆ పార్టీ కాకుంటే.. ఈ పార్టీ!

  • స్థానిక ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు

  • కూటమిలోకి వరుస చేరికలు..

  • మరికొన్నిచోట్ల టీడీపీ నుంచి జనసేన, బీజేపీలోకి..

  • ఆశించిన పదవుల కోసమే పార్టీ మార్పులు..

  • గుండ కుటుంబం వైసీపీలోకి ఆహ్వానం!

  • శ్రీకాకుళం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో రాజకీయ వలసలు జోరందుకున్నాయి. ఆశించిన పదవులు దక్కుతాయన్న నమ్మకం ఉన్న పార్టీలో కొనసాగడం.. లేదంటే మరో పార్టీ కండువా కప్పుకోవడం.. చేస్తున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతుండగా, మరికొందరు టీడీపీ నుంచి జనసేన, బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారు. మరోవైపు, శ్రీకాకుళంలో మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ కుటుంబం వైసీపీలో చేరుతుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

  • కూటమిలోకి వరుస చేరికలు

  • సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ, ఎంపీ స్థానాలను కూటమి కైవసం చేసుకుంది. అప్పటి ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నాయకులు, కార్యకర్తలు ఇప్పుడు స్థానిక సంస్థల్లో పదవులు ఆశిస్తున్నారు. మరోవైపు వైసీపీలో కొనసాగిన పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరుతున్నారు. టెక్కలి, పాతపట్నం, ఆమదాలవలస నియోజకవర్గాల్లో వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలు, సానుభూతిపరులు ఇప్పటికే టీడీపీ గూటికి చేరారు. మిగిలిన కొద్దిమంది మినహా క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు పార్టీని వీడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలు రానున్న స్థానిక ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముంది.

  • పదవుల కోసం పార్టీ మార్పులు

  • రాజకీయాల్లో ఉన్న చిన్నస్థాయి నాయకుల నుంచి కీలక నేతల వరకు పదవులు ఆశించడం సహజం. అయితే, ఆయా పార్టీల్లో అవకాశాలు దక్కకపోతే ప్రత్యామ్నాయ పార్టీల వైపు చూస్తున్నారు. మాజీ డీసీసీబీ చైర్మన్‌ డోల జగన్‌ కాంగ్రెస్‌లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి, అనంతరం వైసీపీలో చేరారు. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లి, తాజాగా జనసేనలో చేరారు. కూటమిలో జనసేన ద్వారా ఏదో ఒక పదవి దక్కుతుందన్న ఆశతో ఆయన ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే తరహాలో శ్రీకాకుళం నగరంలో దశాబ్ద కాలంగా టీడీపీలో చురుగ్గా పనిచేసిన ఓ నాయకుడు తాజాగా బీజేపీలో చేరారు. ఇలాంటి పార్టీ మార్పులు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటున్నాయి.

  • గుండ కుటుంబం చుట్టూ రాజకీయ చర్చ

  • వైసీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తాజా రాజకీయ వ్యూహాలు జిల్లాలో చర్చకు దారితీస్తున్నాయి. మాజీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం కుటుంబం భూవ్యవహారానికి సంబంధించిన కేసులో చిక్కుకోవడంతో వైసీపీలో గతంలో కలకలం రేగింది. ఈ పరిణామం పార్టీ ప్రతిష్ఠపై ప్రభావం చూపిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పార్టీ అధినేత జగన్‌ జిల్లా రాజకీయ వ్యవహారాల్లో ధర్మానకు ప్రాధాన్యమిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం మాజీ ఎమ్మెల్యే, దివంగత మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ సతీమణి గుండ లక్ష్మీదేవిని వైసీపీలోకి ఆహ్వానించినట్లు ప్రచారం సాగుతోంది. ఆమె వైసీపీలో చేరడం దాదాపు ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ పరిణామం ధర్మాన వెంట ఉన్న నాయకుల్లో అసంతృప్తికి కారణమవుతోందన్న చర్చ కూడా ఉంది. లక్ష్మీదేవి వైసీపీలో చేరితే రాజకీయంగా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పార్టీలో ఉన్న నేతలకు, కొత్తగా చేరే నాయకులకు మధ్య సమన్వయం కుదరడం సవాలుగా మారవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ధర్మాన తన కుమారుడి రాజకీయ ఎదుగుదలతో పాటు లక్ష్మీదేవి కుటుంబానికి ఎలా ప్రాధాన్యం ఇస్తారన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ధర్మానపై ఉన్న వ్యతిరేకతే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌కు భారీ మెజారిటీ రావడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి కొత్తగా వచ్చే నాయకులు, ఇప్పటికే పార్టీలో ఉన్నవారి మధ్య రాజకీయ సఖ్యత ఎలా కుదురుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. రానున్న మున్సిపల్‌, నగర పంచాయతీ ఎన్నికలతో పాటు ఇతర స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నుంచి కూటమిలోకి మరిన్ని చేరికలు ఉండవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీల ఎన్నికలకే పరిమితమైనా, రాజకీయ వేడి మాత్రం జిల్లా అంతటా కనిపిస్తోంది. పదవుల ఆశతో సాగుతున్న పార్టీ మార్పులు రానున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది వేచి చూడాలి.

Updated Date - Oct 18 , 2026 | 12:28 AM