వరదలొస్తే వణుకే
ABN , Publish Date - Jun 27 , 2026 | 12:00 AM
Fear of inundation for 138 villages along the rivers ఆ రైతులకు వంశధార, నాగావళి నదుల పక్కనే భూములు ఉన్నా నిరుపయోగమే. ఏటా వరదలకు ఆ భూముల్లో పంటలు కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. ఒడిశాలో అధికంగా వర్షాలు కురిసినా.. ఇక్కడి రైతులకు ముంపు నష్టం వెంటాడుతోంది. చాలామంది రైతులు నదుల పక్కన ఆ భూములను సాగు చేయకపోవడంతో బీడుగా కనిపిస్తున్నాయి.
నదుల చెంతన 138 గ్రామాలకు ముంపు భయం
కరకట్టల పనులు కాక ఇబ్బందులు
నిరుపయోగంగా వందలాది ఎకరాలు
మెళియాపుట్టి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ఆ రైతులకు వంశధార, నాగావళి నదుల పక్కనే భూములు ఉన్నా నిరుపయోగమే. ఏటా వరదలకు ఆ భూముల్లో పంటలు కొట్టుకుపోవడం పరిపాటిగా మారింది. ఒడిశాలో అధికంగా వర్షాలు కురిసినా.. ఇక్కడి రైతులకు ముంపు నష్టం వెంటాడుతోంది. చాలామంది రైతులు నదుల పక్కన ఆ భూములను సాగు చేయకపోవడంతో బీడుగా కనిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు వంశధార, నాగావళి నదులు అనుసంధానంగా ఉన్నాయి. కాగా.. కరకట్టలు లేకపోవడంతో ఏటా వర్షాకాలంలో 138 గ్రామాలకు వరద ముప్పు తప్పడం లేదు. పంటపొలాలకు ముంపు నష్టం వాటిల్లుతోంది. పాలకొండ మండలంలో నాలుగు గ్రామాలు, ఆమదాలవలసలో 16 గ్రామాలు, రేగిడి మండలంలో 12, వీరఘట్టంలో 10, బూర్జలో 16, సంతకవిటిలో 21, వంగరలో 7, పొందూరులో 5, ఎచ్చెర్లలో 12, శ్రీకాకుళంలో 4, కొమరాడలో 18, గరుగుబిల్లిలో 11, జియ్యమ్మవలసలో 2 గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించారు. వంశధార నదికి సంబందించి కొత్తూరు మండలంలో 8 గ్రామాల రైతుల పంటలు ముంపును గురవుతున్నాయి. పంట పొలాలలోపాటు మూడు గ్రామాలు సైతం ముంపు భారిన పడుతున్నాయి. హిరమండలంలో 6, ఎల్.ఎన్.పేట మండలంలో 12 ముంపు గ్రామాలు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ముంపునకు గురయ్యే గ్రామాలు
కొత్తూరు మండలంలో సిరుసువాడ, కుంటిభద్ర, వనప, మాతల, నివగాం, కడుము, ఆకులతంపర, అంగూరు, సోమరాజపురం, మదనపురం గ్రామాల్లో పంట పొలాలు ఏటా వర్షాకాలంలో ముంపునకు గురవుతుంటాయి. అలాగే పెనుగోటివాడ, హంస, నివగాం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుంటాయి.
హిరమండలం మండలంలోని భగీరథపురం, పిండ్రువాడ, రిలీవలస, అక్కరాపల్లి, పాతహిరమండలం, గులుమూరు గ్రామాలు ముంపు సమస్యను ఎదుర్కొంటాయి.
ఎల్.ఎన్.పేట మండలంలో దబ్బపాడు, వాడవలస, ఎల్లన్నపేట, కోయిలాం, ధనుకువాడ, చితిమండలం, మిరియాపల్లి, చిట్టి మండలం, తురకపేట, సుమంతాపురం గ్రామాలకు ఏటా ముంపు ముప్పు తప్పడం లేదు. మోదుగువలస, బసవరాజుపేట, ఎల్లన్నపేట, మిరియాపల్లి, వాడవలస, దబ్బపాడు, సుమంతపురం గ్రామాల్లో పంట పొలాలు ముంపునకు గురవుతుంటాయి. ఇలా ఏటా వర్షాకాలంలో మూడు జిల్లాల పరిధిలో సుమారు 138 గ్రామాలకు ముంపు భయం వెంటాడుతోంది.
కానరాని కరకట్టలు
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2007లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి కరకట్టల నిర్మాణం కోసం రూ.1,056 కోట్లు మంజూరు చేశారు. నాగావళి నది సమీపంలో కొమరాడ (ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా) మండలం కూనేరు నుంచి వీరఘట్టం మండలం చిట్టిపులివలస, అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా కళ్లేపల్లి వరకు 80.88 కిలోమీటర్ల మేర పనులు చేశారు. వంశధార నదిపై మాత్రం పనులు చేపట్టలేదు.
2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మళ్లీ పనులు ప్రారంభించారు. నదికి ఇరువైపులా ఉన్న ఇసుక మేటలను తొలగించారు. దీంతోపాటు కరకట్టల పనులకు నిధులు మంజూరు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో ఈ పనులను నిలిపేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 8 శాతమే పనులు జరిగాయంటూ.. వాటిని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. అప్పటి నుంచి పనుల ఊసేలేదు. దీంతో నదుల పక్కన ఉన్న పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. భూములు నిరుపయోగంగా మారాయి. వైసీపీ నిర్లక్ష్యం తమకు శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పనులు ఇలా :
వంశధార నది కుడి, ఎడమ కాలువలు 199 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. 2007లో భామిని మండలం బత్తిలి నుంచి ఎల్.ఎన్.పేట.. అక్కడ నుంచి కళింగపట్నం వరకు నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. రెండు విడతల్లో పనులను ప్రారంభించి వదిలేశారు. మళ్లీ 2018లో రూ,1.056 కోట్లతో అంచనాలు రూపొందించారు. దీనికి సంబంధించి రైతుల నుంచి 600 ఎకరాలు భూమి సేకరించారు. కాగా.. వీరికి నేటికీ నష్టపరిహరం చెల్లించలేదు. వైసీపీ ప్రభుత్వం ఈ పనులను నిలిపివేయటంతో మూడు జిల్లాల్లో రైతులకు సంబంధించి వేల ఏకరాల్లో పంటలు ముంపునకు గురవుతున్నాయి.
నాగావళి పరిధిలో పేజ్-1, 2లో భాగంగా 81.88 కిలోమీటర్లు మేరకు పనులు చేయాల్సి ఉండగా.. 38 కిలోమీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి ఇంకా 350 ఎకరాల భూ సేకరణతో పాటు స్ట్రక్చర్లు, గ్రోయిన్లు నిర్మించాల్సి ఉంది.
రైతుల విజ్ఞప్తి మేరకు ప్రస్తుత కూటమి ప్రభుత్వం దృష్టికి ప్రజాప్రతినిధులు ఈ సమస్యను తీసుకెళ్లారు. దీంతో కరకట్టల పనులు ప్రారంభానికి అనుమతి ఇచ్చింది. కాగా ప్రస్తుతం వంశధార నదిపై గులుమూరు, సోమరాజుపురం వద్ద మాత్రమే పనులు ప్రారంభించింది. వర్షాలు అడపాదడపా కురుస్తుండడంతో గొట్టాబ్యారేజీ ఎగువన కొంతమేర పనులు చేపట్టి నిలిపేసింది. మిగిలినచోట కూడా పనులు చేపట్టి.. ముంపు ముప్పు తొలగించాలని రైతులు కోరుతున్నారు.
రైతులను ఆదుకుంటాం
వైసీపీ పాలనలో కరకట్టల పనులు రద్దు చేశారు. తర్వాత కనీసస్థాయిలో పనులు చేపట్టలేదు. ఈ పాపం వైసీపీ నాయకులదే. ముంపు గ్రామాల రైతులను ఆదుకుంటాం. సీఎం చంద్రబాబు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లాం. గులుమూరు, సోమరాజపురం వద్ద పనులు ప్రారంభించాం.
- ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, పాతపట్నం
ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించాం
వంశధార, నాగావళి నదుల సమీపంలో ప్రమాదకరమైన ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. ప్రస్తుతం వంశధార ప్యాకేజీ-2 పనులు చేపడుతున్నాం. వచ్చే ఏడాదికి పనులు పూర్తికానున్నాయి.
- పొన్నాడ సుధాకర్, జలవనరుల శాఖ ఈఈ, శ్రీకాకుళం