కన్ను పడిందా...బండి గోవిందా
ABN , Publish Date - Sep 26 , 2026 | 12:42 AM
నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
ద్విచక్రవాహనాల దొంగ అరెస్టు ఫపది మోటారు సైకిళ్లు స్వాధీనం
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): నగరంలో వరుసగా ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని శ్రీకాకుళం టూటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సి.హెచ్.వివేకానంద కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడిని శ్రీకాకుళం మండలం పాత్రునివలస టిడ్కో కాలనీకి చెందిన యాగంటి సంతోష్‌కుమార్ (31)గా గుర్తించామని చెప్పారు. నిందితుడు గతంలో అంబులెన్స్ ఔట్‌సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేసినట్టు పోలీసులు తెలిపారు. 2017లో శ్రీకాకుళం జీటీ రోడ్డులోని ఓ షాపులో పనిచేస్తున్న సమయంలో నిందితుడికి దేవా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని తెలిపారు. ఇద్దరూ కలిసి గంజాయి తాగడంతో పాటు జల్సాలకు అలవాటు పడ్డారని వివరించారు. ఈ క్రమంలో ఖర్చులకు డబ్బులు అవసరం కావడంతో మారుతాళంతో వివిధ ప్రాంతాల్లో నిలిపిన వాహనాలను చోరీ చేసేవాడన్నారు. చోరీ చేసిన వాహనాలను వెంటనే వి క్రయించకుండా...వివిధ పార్కింగ్ ప్రదేశాల్లో ఉంచి... అవసరమైన సమయంలో వి క్రయించేందుకు ప్రయత్నించేవాడని పేర్కొన్నారు. ఈ నెల 25న నిందితుడు ఏపీ 39 సి 8373 నెంబర్ ఉన్న వాహనంపై కొత్తరోడ్డు జంక్షన్ వైపు నుంచి శ్రీకాకుళం నగరానికి వస్తున్నాడు. ఆదివారంపేట వద్ద వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు విచారించగా... చోరీలకు పాల్పడినట్టు అంగీకరించాడని తెలిపారు. నిందితుడి నుంచి శ్రీకాకుళం-2 టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన 8 కేసులు, పాలకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన రెండు కేసులకు సంబంధించి మొత్తం పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ తెలిపారు. కేసును చేధించడంలో ప్రతిభ చూపిన టూటౌన్ సీఐ ఈశ్వరరావు, ఎస్‌ఐ హేమంత్, సిబ్బందిని ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు.