సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:13 AM
టెక్కలి నియోజకవర్గాన్ని 2029 సంవత్సరం నాటికి సమస్యలు లేనివిధంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కోటబొమ్మాళి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): టెక్కలి నియోజకవర్గాన్ని 2029 సంవత్సరం నాటికి సమస్యలు లేనివిధంగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో 4,100 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గొడ్డలి పార్టీ కార్యాలయంలో ఉండి రీసర్వే చేయడం వల్ల 98శాతం భూ రికార్డులలో తప్పులు జరిగాయని, కూటమి ప్రభుత్వం పక్కాగా రీ సర్వే నిర్వహించి తప్పులు లేని రాజముద్ర ఉన్న పట్టాదారు పాస్‌పుస్తకాలు ఇస్తోందని తెలిపారు. 2027 నాటికి భూ సమస్య లేని రాష్ట్రంగా చేస్తామని ఆయన తెలిపారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయానికి వచ్చి ఏడేళ్లవుతోందని అన్నారు. గొడ్డలి పార్టీ నాయకులు కార్యాలయాన్ని అస్తవ్యస్తం చేశారని ఆయన ఆరోపించారు. విజయవాడ సచివాలయానికి దీటుగా కార్యాలయం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 13 నుంచి 15వ తేదీ వరకు కొత్తమ్మ తల్లి ఉత్సవాలను ఘనంగా నిర హించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఆర్థిక సాయం
కాగువాడ గ్రామానికి చెందిన మల్ల రమేష్ గత ఏడాది విద్యుత్ ప్రమాధం దుర్మరణం చెందారు. ఆయన భార్య మల్ల వాణికి రూ.5లక్షల పరిహారం చెక్కును మంత్రి కింజరాపు అచ్చెన్నా యుడు కోటబొమ్మాళిలో శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్‌డీవో ఎన్.కృష్ణమూర్తి, మండల ప్రత్యేక అధికారి కె.గడ్డెమ్మ, మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్, బోయిన గోవింద రాజులు, బోయిన రమేష్, బోయిన సత్యశ్రీనివాస్, తర్ర రామకృష్ణ, వెలమల విజయలక్ష్మి, కామేశ్వరరావు, కర్రి అప్పారావు, రోణంకి లీలామోహన్, కల్లి నాగయ్యరెడ్డి, ఎంపీడీవో కె.నారాయణరావు, తహసీల్దార్ సీహెచ్. ప్రసాదరావు, పాల్గొన్నారు.
వైభవ వేంకటేశ్వరుని దర్శించుకున్న మంత్రి
టెక్కలి, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): టెక్కలిలోని వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు మంత్రికి స్వాగతం పలికి పూజలు చేశారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆయనతో పాటు ఏఎంసీ చైర్మన్ బగాది శేషగిరి, ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.