మీ బిడ్డలను క్షేమంగా తీసుకొస్తా
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:54 PM
ఉపాధి కోసం మలేషియా వెళ్లి, దళారుల మాయలో పడి అక్కడి పోలీసులకు చిక్కిన సిక్కోలు యువకులను క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత తనదని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు.
‘మలేషియా’ బాధిత కుటుంబాలకు
కేంద్ర మంత్రి రామ్మోహన్ భరోసా
శ్రీకాకుళం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం మలేషియా వెళ్లి, దళారుల మాయలో పడి అక్కడి పోలీసులకు చిక్కిన సిక్కోలు యువకులను క్షేమంగా తీసుకువచ్చే బాధ్యత తనదని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు భరోసా ఇచ్చారు. ఆదివారం క్యాంపు కార్యాల యంలో బాధితుల కుటుంబ సభ్యులు ఆయనను కలిసి తమ గోడును వెలిబుచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. సోంపేట మండలం ఎర్ర ముక్కాం గ్రామానికి చెందిన చీకటి సాయివంశీ, సిరిమామిడికి చెందిన గిరిబాబు, వజ్రపుకొత్తూరు మండలానికి చెందిన చొక్కర సాయి, లండ తరుణ్ కుమార్ ఉపాధి కోసం మలేషియా వెళ్లారు. అయితే పని ఇప్పిస్తామని ఆశ చూపిన మధ్యవర్తులు (ఏజెంట్లు) వీరిని నిబంధనలకు విరుద్ధంగా టూరిస్ట్ వీసాపై మలేషియా పంపించారు. దీంతో అక్కడి పోలీసుల తనిఖీల్లో ఈ నలుగురు యువకులు పట్టుబడ్డారు. దళారుల మోసం వల్లే తమ పిల్లలు విదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారని యువ కుల తల్లిదండ్రులు పాపారావు, పోతయ్య, మధుర లక్ష్మి, లండ ఈశ్వర రావు, విజయలక్ష్మి కేంద్రమంత్రికి వివరించారు. మా బిడ్డలను క్షేమంగా ఇంటికి చేర్చాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువకుల వివరాలు ఆరా తీసి వారిని ఇంటికి తీసుకుచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, ఎటువంటి ఆందోళన చెందవద్దని హామీ ఇచ్చారు. ఈ విషయమై ఇప్పటికే మలేషియా అధికారులతో పాటు భారత విదేశాంగ శాఖ, ఇండియన్ ఎంబసీ అధికారులతో సమన్వయం చేస్తున్నామన్నారు. సోమవారం నాటికి అక్కడి తాజా పరిస్థితిపై మరింత స్పష్టత వచ్చే అవ కాశం ఉందని, అప్పటి వరకు కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ధైర్యంగా ఉండాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో బాధిత కుటుం బాలతో పాటు మత్స్యకార నాయకులు సూరాడ చంద్రమోహన్, అశోక్ రాజు, దుర్గారావు, అఖిల్ తదితరులు ఉన్నారు.