Share News

వధువు కావలెను

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:28 AM

Shortage of brides in the srikakulam జిల్లాలో అన్ని సామాజికవర్గాల్లోనూ పెళ్లికుమార్తెల కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా.. వధువు కావలెను అనే మాట వినిపిస్తోంది. వధువుల కోసం పెళ్లికాని యువకులు, కుటుంబ సభ్యులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో సైతం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

వధువు కావలెను

జిల్లాలో పెళ్లికుమార్తెల కొరత

30 ఏళ్లు వచ్చినా వివాహం కాలే

పెళ్లికాని యువకుల్లో ఆందోళన

జమ్ముకు చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.40వేలు సంపాదిస్తున్నాడు. కొన్నాళ్ల కిందట వరకు ఆర్థికంగా తన స్థాయికి తగిన అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అటువంటి వధువు కోసం ఎన్నో గ్రామాలు తిరిగాడు. కానీ, ఫలితం లేకపోయింది. ఇక లాభం లేదనుకుని మంచి అమ్మాయి అయితే చాలు అనే పరిస్థితికి వచ్చాడు.

నరసన్నపేటకు చెందిన ఓ యువకుడికి మంచి ఉద్యోగం, ఆస్తి బాగానే ఉంది. కానీ వారి సామాజికవర్గంలో అమ్మాయిల కొరత తీవ్రంగా వేధిస్తోంది. కట్నం ఆశించకుండా పెళ్లికి రెడీ అయినా ఎక్కడా వధువు జాడ కనిపించడం లేదు. వధువు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

నరసన్నపేట/ కోటబొమ్మాళి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి):జిల్లాలో అన్ని సామాజికవర్గాల్లోనూ పెళ్లికుమార్తెల కొరత ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎక్కడ విన్నా.. వధువు కావలెను అనే మాట వినిపిస్తోంది. వధువుల కోసం పెళ్లికాని యువకులు, కుటుంబ సభ్యులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో సైతం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అందం, ఆస్తి, ఉద్యోగం ఉన్నా.. వివాహానికి సరైన జోడీ దొరకని దుస్థితి ఎదురవుతోంది. కొంతమంది తల్లిదండ్రులు పెళ్లిళ్ల పేరయ్యలను, బంధువులను కలిసి తమ కుమారుడికి తగిన వధువును చూడాలని కోరుతున్నారు. మరికొందరు సామాజిక మాధ్యమాల వేదికగా తమకు తగిన సంబంధం కోసం వెతుకుతున్నారు. పలువురు యువకులు కట్నకానుకలు లేకుండా పెళ్లిళ్లకు సిద్ధమవుతున్నారు. మరికొందరు ఎదురుకట్నం ఇచ్చి వివాహం చేసుకునేందుకు సైతం వెనుకాడడం లేదు. ఇంకొందరు యువకులు కులాంతర వివాహాలకు ముందుకొస్తున్నారు. అయినా వధువులు దొరక్కపోవడంతో ఓ వైపు వయసు మించిపోయి.. ‘పెళ్లికాని ప్రసాద్‌’లుగా చాలామంది యువకులు మిగిలిపోతున్నారు.

కారణాలు అనేకం

భ్రూణహత్యలతో ఆడపిల్లల జనాభా క్రమేపీ తగ్గుతోంది. పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా వివక్ష మాత్రం తగ్గడంలేదు. ఆడ పిల్లలను ఇప్పటికీ భారంగా భావిస్తున్న వారెందరో ఉన్నారు. కొందరైతే వారసుడి కోసం ఆరాటపడుతూ.. గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయించి.. ఆడపిల్ల అని తెలిస్తే.. కడుపులోనే చిదిమేస్తున్నారు. ఈక్రమంలో రెండు, మూడు దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ఇప్పటికే చాలా సామాజికవర్గాల్లో యువతుల కొరత అధికమైంది. ఒకప్పుడు బాల్యవిహాలు అధికంగా ఉండేవి. తర్వాత వరుడుకి 21, వధువుకి 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలన్న చట్టం వచ్చింది. కానీ ప్రస్తుతం చదువు, ఉద్యోగం వేటలో పడి 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు వచ్చేవరకు అధికశాతం మంది పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఉన్నత విద్యావంతులు, వివిధ ఉద్యోగాల్లో స్థిరపడినవారు తమలాంటి స్థాయి ఉన్నవారినే కోరుకుంటారు. సాఫ్ట్‌వేర్‌ రంగం, డాక్టర్లు, టీచర్లు, సచివాలయ సిబ్బందికి అదే వృత్తిలో ఉన్నవారే కావాలనుకుంటున్నారు. దీంతో సహజంగానే వధువుల కొరత తీవ్రమవుతోంది.

కట్నకానుకలు లేకపోయినా సరే

మూడున్నర దశాబ్దాల కిందట పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలంటే.. కులం, గోత్రంతోపాటు వారి తరాల చరిత్ర చూసేవారు. అప్పట్లో కట్నకానుకలు సమర్పించి కన్యాదానం చేసేవారు. ప్రస్తుతం ఈ పరిస్థితులు.. మారుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది. జీవనశైలి మారింది. చాలా కులాల్లో యువకుల కుటుంబ సభ్యులు కట్నకానుకలు లేకపోయినా ఫర్వాలేదు.. అనుకున్నా అమ్మాయి దొరకడం లేదు. పెళ్లి ఖర్చుఅంతా తామే భరిస్తామని ముందుకొచ్చినా.. ఫలితం ఉండడం లేదు. కుటుంబ కట్టుబాట్లు, సంప్రదాయాలు గౌరవించేవారు తమ కులానికి చెందిన యువతుల కోసం నిరీక్షిస్తున్నారు. మరికొందరు మాత్రం వధువుల కొరత కారణంగా కులాంతర వివాహాలకు ముందుకొస్తున్నారు. ఏదిఏమైనా తమ కుమారులకు పెళ్లి చేయడం ప్రహసనంగా మారిందని చాలా మంది యువకుల తల్లిదండ్రులు నిట్టూర్చుతున్నారు.

ట్రెండ్‌ మారింది

ఐదేళ్లుగా పెళ్లికి సిద్ధమయ్యే యువతుల కొరత ఎక్కువగా ఉంది. కొన్ని సామాజికవర్గాల్లో ఈ సమస్య అధికం. ట్రెండ్‌ మారింది. అప్పట్లో ఆడపిల్లల తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి మంచి సంబంధాల కోసం ఆరా తీసేవారు. ప్రస్తుతం ఎదురుకట్నం ఇస్తాం. పెళ్లి సంబంధం కోసం మంచి అమ్మాయి ఉంటే చూడండి అని యువకుల కుటుంబ సభ్యులు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. గతంలో కులాల పట్టింపు ఉండేది. ప్రస్తుతం చాలామంది కులాలను కూడా పట్టించుకోవడం లేదు.

పెళ్లిళ్ల పేరయ్య, నరసన్నపేట

Updated Date - Apr 12 , 2026 | 12:28 AM