Share News

నాన్నకు భారం కాకూడదనే.. చనిపోతున్నా

ABN , Publish Date - May 23 , 2026 | 12:16 AM

Odisha woman commits suicide in Srikakulam hotel అనారోగ్య సమస్యలు ఆ యువతిని కుంగదీశాయి. చికిత్స కోసం రూ. లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి.. తాపీ పని చేసుకునే తండ్రికి అంత భారం వేయకూడదని నిర్ణయించుకుంది.

నాన్నకు భారం కాకూడదనే.. చనిపోతున్నా
కస్తూరి (ఫైల్‌)

  • శ్రీకాకుళం హోటల్‌లో ఒడిశా యువతి ఆత్మహత్య

  • స్నేహితురాలికి వాట్సాప్‌ చేసి బలవన్మరణం

  • అనారోగ్య సమస్యలు, చికిత్సకు డబ్బుల్లేక..

  • గుండెలు పిండేస్తున్న ఆఖరి సందేశం

  • శ్రీకాకుళం క్రైమ్‌, మే 22(ఆంధ్రజ్యోతి): అనారోగ్య సమస్యలు ఆ యువతిని కుంగదీశాయి. చికిత్స కోసం రూ. లక్షల్లో ఖర్చవుతుందని తెలిసి.. తాపీ పని చేసుకునే తండ్రికి అంత భారం వేయకూడదని నిర్ణయించుకుంది. స్నేహితురాలి ఇంటికని చెప్పి ఒడిశా నుంచి శ్రీకాకుళం చేరుకుంది. ఓ హోటల్‌ గదిలో ఉరివేసుకుంది. చనిపోయే ముందు స్నేహితురాలికి పంపిన సందేశం కంటతడి పెట్టిస్తోంది.

  • స్నేహితురాలి ఇంటికని చెప్పి..

  • ఒడిశా రాష్ట్రం రాయగడ జిల్లా గుణుపూర్‌ వద్ద కుబేబర్‌ గ్రామానికి చెందిన అభిమన్యు బెహరా కుమార్తె కస్తూరి కుమారి బెహరా (23) డిగ్రీ పూర్తి చేసింది. అభిమన్యు తాపీమేస్త్రీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బర్హంపూరల్‌లో ఉన్న తన స్నేహితురాలి వద్దకు వెళ్తానని కస్తూరి కుమారి రెండు రోజుల క్రితం తండ్రికి చెప్పింది. దీంతో గురువారం (ఈ నెల 21న) ఉదయం ఆరు గంటలకు గుణుపూర్‌లో తండ్రి ఆమెను రైలు ఎక్కించాడు. ఆ రైలులోనే పాతపట్నం మీదుగా టెక్కలి చేరుకున్న ఆమె.. అక్కడి నుంచి అదే రోజు మధ్యాహ్నానికి శ్రీకాకుళం చేరుకుంది. అంతకుముందే ఆన్‌లైన్‌లో శ్రీకాకుళంలోని ఓ ప్రముఖ హోటల్‌లో గది బుక్‌ చేసుకుంది.

  • స్నేహితురాలికి మెసేజ్‌ చేసి...

  • హోటల్‌ గదికి చేరుకున్న కస్తూరి కుమారి గురువారం సాయంత్రం తన స్నేహితురాలైన టిక్కీ బెహరాకు ఓ సందేశం (మెసేజ్‌) పంపింది. ‘నాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఫిట్స్‌, మానసిక సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. వైద్యం కోసం రూ. 10 లక్షలు ఖర్చవుతుంది. మా నాన్న తాపీమేస్త్రీ. అంత డబ్బు మా నాన్న వద్ద ఉండదు. అందుకే చనిపోతున్నా’ అని ఆ మెసేజ్‌లో పేర్కొంది. ఆ వెంటనే సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసి, సిమ్‌ కార్డులను తొలగించేసింది. మెసేజ్‌ చూసిన వెంటనే కంగారుపడిన స్నేహితురాలు టిక్కీ బెహరా.. కస్తూరి కుమారి తండ్రి అభిమన్యుకు సమాచారం అందించింది. బంధువుల సహకారంతో తండ్రి గుణుపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆమె శ్రీకాకుళంలో ఉన్నట్లు నిర్ధారించారు.

  • అప్పటికే విగతజీవిగా...

  • శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో హోటల్‌ గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది.. ఎంతసేపు బెల్‌ కొట్టినా కస్తూరి కుమారి తలుపు తీయలేదు. అనుమానం వచ్చిన సిబ్బంది హోటల్‌ మాస్టర్‌ కీతో తలుపు తెరిచి చూడగా.. అప్పటికే ఆమె గదిలోని సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. గురువారం రాత్రే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. హోటల్‌ సిబ్బంది సమాచారంతో రెండో పట్టణ ఎస్‌ఐ హేమంత్‌ కల్యాణ్‌ ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

  • గుంటూరు చిరునామాతో ఆధార్‌..

  • గదిలో కస్తూరి కుమారి వినియోగించిన సెల్‌ఫోన్‌, సిమ్‌ కార్డుతో పాటు ఆధార్‌ కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆధార్‌ కార్డుపై గుంటూరు జిల్లా తిమ్మాపురం చిరునామా ఉండటంతో పోలీసులు ఆరా తీశారు. ఘటనా స్థలంలో దొరికిన సిమ్‌ కార్డును ఫోన్‌లో వేసి తండ్రి అభిమన్యుకు సమాచారం అందించారు. హుటాహుటిన హోటల్‌ వద్దకు చేరుకున్న తండ్రి, బంధువులు కస్తూరి కుమారి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కొన్నాళ్ల క్రితం తాము బతుకుదెరువు కోసం గుంటూరులో ఉండేవారమని, అందుకే ఆధార్‌లో ఆ చిరునామా ఉందని తండ్రి పోలీసులకు వివరించారు. తండ్రి అభిమన్యు బెహరా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

Updated Date - May 23 , 2026 | 12:16 AM