తొందర పడండి
ABN , Publish Date - Jul 06 , 2026 | 12:22 AM
Only 8 days left for ‘Sir’ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ఇంటింటి సర్వేకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ శతశాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ మాత్రం ఆశించినస్థాయిలో పూర్తికావడం లేదు.
‘సర్’కు ఇక గడువు 8 రోజులే
ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వకపోతే ఓటు గల్లంతే
డిజిటలైజేషన్‌లో జాప్యం
‘సర్’ ప్రక్రియ ఇలా..
----------------------------
జిల్లాలో ఓటర్లు : 18,97,405
డిజిటలైజేషన్ పూర్తి : 11,96,232
డిజిటలైజేషన్ పెండింగ్ : 7,01,173
మ్యాపింగ్ : 17,96,885
మ్యాపింగ్ చేయాల్సినవి : 1,00,520
టెక్కలి రూరల్, జూలై 5(ఆంధ్రజ్యోతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ఇంటింటి సర్వేకు గడువు సమీపిస్తోంది. ఈ నెల 14 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ శతశాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ మాత్రం ఆశించినస్థాయిలో పూర్తికావడం లేదు. ఇక 8 రోజులే గడువు ఉండడంతో.. ఈలోగా డిజిలైజేషన్ చేయించుకోకపోతే ఓట్లు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు. తొందర పడండి.. ‘సర్’ ప్రక్రియ విజయవంతానికి సహకరించండని ఓటర్లకు పిలుపునిస్తున్నారు.
జిల్లాలో 18,97,405 మంది ఓటర్లు ఉన్నారు. గత నెల 15 నుంచి ఓటరు సమగ్ర సర్వే మొదలైంది. ఈనెల 14వరకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌వో)ఇంటింటికి వచ్చి ప్రతీ ఓటరుకు ఈఎఫ్ అందజేయాలి. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉన్నారా?లేదా?అనేది పరిశీలించాలి. కొన్నిచోట్ల బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లకుండా ఒక చోటుకు పిలిచి ఫారాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం నాటికి 17,96,885 ఓట్లు మ్యాపింగ్ చేశారు. ఇంకా సుమారు లక్ష ఓట్ల మ్యాపింగ్ పెండింగ్ ఉంది. కొంతమంది ఓటర్లు ఉపాధి కోసం వలస పోవడం.. మరికొందరు ఇళ్ల వద్ద అందుబాటు ఉండకపోవడంతో మ్యాపింగ్ ప్రక్రియకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీఎల్‌వోలు చెబుతున్నారు.
నత్తనడకన డిజిటలైజేషన్
జిల్లాలో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ నత్తనడకన సాగుతోంది. జిల్లావ్యాప్తంగా 18,97,405 మంది ఓటర్లు ఉండగా.. ఇప్పటివరకూ 11,96,232 ఓట్లకు డిజిటలైజేషన్ పూర్తయింది. చాలామంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు నింపి తిరిగి బీఎల్‌వోలకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారు. ఈక్రమంలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఆశించినస్థాయిలో పూర్తికావడం లేదు. ఈ నెల 14వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తిచేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు.
ఆ జాబితాలో పేర్లు లేకున్నా.. ఆందోళన వద్దు
‘సర్’ ప్రక్రియ బీఎల్‌వోలకు క్షేత్రస్థాయిలో అగ్నిపరీక్ష ఎదురవుతోంది. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సుమారు వెయ్యికిపైగా ఓటర్లు ఉన్నారు. ఎన్యూమరేషన్ ప్రక్రియలో భాగంగా సంబంధించి ఓటర్ల వివరాలు 2002 జాబితా ప్రకారం పరిశీలించాలి. సొంత ఇళ్లు ఉన్నవారికి పెద్దగా ఇబ్బందులు లేక పోయినా అద్దె ఇళ్లు మారే ఓటర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతోంది. సర్ కార్యక్రమంలో భాగంగా అధికారులు పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను తెలుసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. కాగా 2002 ఓటర్ల జాబితాలో కొంతమంది పేర్లు లేవు. అటువంటి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ప్రస్తుత వివరాలతో ఎన్యూమరేషన్ ఫారం నింపి.. తాజా కలర్ ఫొటో జతచేసి బూత్‌స్థాయి అధికారికి అందజేయాలని సూచిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిన 12 రకాల డాక్యు మెంట్లులో ఏదో ఒకటి ఇవ్వాలని తెలిపారు. తీసుకున్న ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వకపోతే ఓట్లు తొలగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
22న తుది జాబితా
ఇంటింటి సర్వే అనంతరం బీఎల్‌వోలు తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రచురిస్తారు. ఆ తరువాత క్లైయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించి వాటిని సెప్టెంబర్ 18 లోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురిస్తారు.
సచివాలయంలో ఇబ్బందులు
సచివాలయ ఉద్యోగులకు బీఎల్‌వో విధులను అదనంగా అప్పగించారు. ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు వివిధ సర్వేలతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. కొంతమంది వీఆర్‌ఏలకు వీఆర్వోలుగా పదోన్నతి కల్పించారు. వారిలో కొందరికి ‘సర్’ సర్వేపై అవగాహన లేకపోవడంతో ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. డిజిటల్ అసిస్టెంట్లను సైతం ‘సర్’ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడంతో సచివాలయాల్లో ఉద్యోగులు అందుబాటులో లేక వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
సమగ్రమైన ఓటర్ల జాబితా: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
కోటబొమ్మాళి : ఎన్నికల సంఘం చేపడుతున్న ‘సర్’ ప్రక్రియతో సమగ్రమైన ఓటర్ల జాబితా సిద్ధమవుతోందని కేంద్రపౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోన్‌నాయుడు తెలిపారు. ఆదివారం స్వగ్రామం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో ఆయన పర్యటించారు. ఆయనకు బీఎల్‌వో బాలయోగి ఎన్యూమరేషన్ పత్రాలను అందించారు. ఓటరు పేరు, ఫొటో, గుర్తింపు కార్డు నంబర్ తదితర వివరాలను ఎన్యూమరేషన్ పత్రంలో పొందుపరిచి కేంద్రమంత్రి సంతకాన్ని చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాలో మరింత పరిపూర్ణత వస్తోందన్నారు. అధికారులకు ఓటర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు.
సర్వే వేగవంతం చేయండి : ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అదనపు సీఈవో ఎ.వేంకటేశ్వరరావు
జలుమూరు : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) సర్వే మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అదనపు సీఈవో ఎ.వేంకటేశ్వరరావు బీఎల్వోలకు ఆదేశించారు. శ్రీముఖలింగంలోని 1, 2 పోలింగ్ కేంద్రాల్లో చేపడుతున్న సర్ సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జిల్లాలో నరసన్నపేట నియోజకవర్గం సర్ సర్వేలో ముందంజలో ఉంది. తప్పిదాలకు తావులేకుండా ఓటర్ల జాబితా సవరణ పక్రియ బీఎల్వోలు పారదర్శకంగా చేపట్టాలి. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులకు తప్పనిసరిగా ఓటుహక్కు పొందేలా చూడాలి. మృతులు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి ఓట్లు తొలగించాలి. ఓటర్లు జాబితా సవరణలో బీఎల్‌వోలదే కీలకపాత్ర. సూపరువైజర్లు ప్రతీ రోజు సర్ సర్వేను క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సూచనలు చేయాల’ని తెలిపారు. ముందుగా శ్రీముఖలింగేశ్వరస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. రణస్థలం మండలం కొండములగాం గ్రామంలో 135, 136 పోలింగ్ కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం అదనపు సీఈవో వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు సంబంధించిన దరఖాస్తులపై ఆరా తీశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఈఆర్‌వో బి.జయదేవి, తహసీల్దార్లు జె.రామారావు, ఎస్.కిరణ్ కుమార్, ఎన్నికల డీటీలు శరత్‌బాబు, హేమసుందర్ ఆర్.ఐ జగదీష్, బీఎల్‌వోలు పాల్గొన్నారు.