ధర్మాన మెడకు ‘హుద్‌హుద్’ ఉచ్చు!
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:06 AM
: శ్రీకాకుళం మండలం కుందువానిపేటలో ‘హుద్‌హుద్’ తుఫాన్ బాధితుల గృహాల ఆక్రమణ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై నమోదైన కేసులో (క్రైమ్ నెం:176/2026) కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎఫ్‌ఐఆర్‌లో వెలుగుచూసిన కీలక అంశాలు
ఆక్రమించింది ఆరుగురు.. ఉసిగొల్పింది మాజీ మంత్రి, జడ్పీటీసీయే
కొత్త చట్టం బీఎన్‌ఎస్ కింద కఠిన సెక్షన్ల నమోదు
శ్రీకాకుళం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మండలం కుందువానిపేటలో ‘హుద్‌హుద్’ తుఫాన్ బాధితుల గృహాల ఆక్రమణ వ్యవహారంలో మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుపై నమోదైన కేసులో (క్రైమ్ నెం:176/2026) కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆగస్టు 29న కేసు నమోదు కాగా.. తాజాగా పోలీసుల ఎఫ్‌ఐఆర్ కాపీతో పూర్తి వివరాలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంలో ఇళ్లను నేరుగా ఆక్రమించింది ఎవరు? వారిని వెనకుండి రెచ్చగొట్టింది ఎవరు? అనేదానిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో స్పష్టమైన వివరాలు పొందుపరిచారు.
కఠిన సెక్షన్లు..
కేవలం ఆరోపణల మేరకే కాకుండా.. పక్కా ఆధారాలతోనే పోలీసులు కొత్త క్రిమినల్ చట్టం ‘భారతీయ న్యాయ సంహిత’ (బీఎన్‌ఎస్) కింద కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తిలోకి అక్రమంగా చొరబడటం, ఆక్రమించుకున్నందుకుగాను 329(4) బీఎన్‌ఎస్ సెక్షన్ నమోదు చేశారు. నేరం చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఇతరులను ప్రేరేపించినందుకు 49 బీఎన్‌ఎస్ సెక్షన్ ప్రయోగించారు. ఒకే ఉమ్మడి ఉద్దేశంతో నేరంలో పాల్గొన్నందుకు రెడ్ విత్ 3(5) బీఎన్‌ఎస్ కింద కేసు నమోదు చేశారు.
కమిటీ విచారణ తర్వాతే పక్కాగా...
ఈ ఆక్రమణల వ్యవహారంపై ఫిర్యాదు అందగానే పోలీసులు నేరుగా కేసు నమోదు చేయలేదు. ఇళ్ల కబ్జా జరిగిన వెంటనే శ్రీకాకుళం ఆర్డీవో, ఎస్డీపీవో (డీఎస్పీ), జిల్లా హౌసింగ్ అధికారితో కూడిన ‘త్రిసభ్య కమిటీ’ క్షేత్రస్థాయిలో విచారణ జరిపింది. ఎలాంటి అధికారిక కేటాయింపులు, లాటరీ ప్రక్రియ లేకుండానే ఆక్రమణలు జరిగినట్లు ఈ కమిటీ నిర్ధారించింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, జడ్పీటీసీ రుప్ప దివ్యల ప్రేరణతోనే ఈ కబ్జాలు జరిగినట్లు కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ ఏఈ వీవీ సత్యాజీ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అనుచరులు వీరే...
ఇళ్లలోకి చొరబడిన మిగతా ఆరుగురి వివరాలను ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. ఏ-1 రాయతి అంకమ్మ, ఏ-2 బర్రి యేసమ్మ, ఏ-3 బర్రి సీతమ్మ, ఏ-4 బర్రి లక్ష్మమ్మ, ఏ-5 బొడ్డేపల్లి లక్ష్మి, ఏ-6 బొడ్డేపల్లి లక్ష్మణ.. ఈ ఆరుగురు ప్రభుత్వ ఇళ్లలోకి అక్రమంగా చొరబడగా.. వీరికి వత్తాసు పలికి, ఆస్తులను ఆక్రమించేలా ఉసిగొల్పినందుకు శ్రీకాకుళం జడ్పీటీసీ రుప్ప దివ్యను ఏ-7గా, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఏ-8గా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఉన్నతాధికారుల త్రిసభ్య కమిటీ విచారణ నివేదికతో ఈ కేసు నమోదు కావడంతో మాజీ మంత్రి మెడకు ఉచ్చు గట్టిగానే బిగుసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.