Share News

మంటలు ఆర్పేదెలా?

ABN , Publish Date - Feb 18 , 2026 | 11:53 PM

ఇది కొత్తూరు అగ్నిమాపక కేంద్రానికి చెందిన భవనం. దీన్ని 30 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రస్తుతం భవనం స్లాబ్‌ పెచ్చులూడి, గోడలకు బీటలు వారి శిథిలావస్థకు చేరింది.

 మంటలు ఆర్పేదెలా?

- జిల్లాలో అగ్నిమాపక సిబ్బంది కొరత

- డిప్యుటేషన్‌పై పని చేస్తున్న హోంగార్డ్‌లు

- మొరాయిస్తున్న వాహనాలు

- శిథిలావస్థలో భవనాలు

ఇది కొత్తూరు అగ్నిమాపక కేంద్రానికి చెందిన భవనం. దీన్ని 30 ఏళ్ల కిందట నిర్మించారు. ప్రస్తుతం భవనం స్లాబ్‌ పెచ్చులూడి, గోడలకు బీటలు వారి శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందోనని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. అగ్నిమాపక వాహనానికి కూడా కాలం చెల్లడంతో అప్పడప్పుడూ మొరాయిస్తుంది. సిబ్బందికి కనీస వసుతులు లేవు. అగ్నిమాపక కేంద్రంలో ఓ వైపు వాహనం.. మరోవైపు వారు ఉంటున్నారు. ఆఫీసర్‌ ఉండే భవనం కూడా పాతబడి కూలేందుకు సిద్ధంగా ఉంది. కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లు ప్రారంభానికి నోచుకోవడం లేదు. ప్రహరీ లేకపోవడంతో కార్యాలయంలోకి మూగజీవాలు, విష సర్పాలు వచ్చేస్తున్నాయి.

కాశీబుగ్గ, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. చాలా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. మరికొన్ని కేంద్రాలకు భవనాలు ఉన్నా శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో ఆరుబయట, చెట్ల కింద వాహనాలను నిలుపుదల చేయాల్సి వస్తోంది. సిబ్బంది కొరత కూడా తీవ్రంగా వేధిస్తోంది. గత కొన్నేళ్లుగా కొత్తవారిని నియమించడం లేదు. ప్రస్తుతం వేసవి కాలం ప్రారంభమైంది. ఎండలు అప్పుడే భగ్గుమంటున్నాయి. అగ్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అయితే, మంటలను ఆర్పేందుకు పూర్తిస్థాయిలో అగ్నిమాపక సిబ్బంది లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

జిల్లాలో పరిస్థితి..

జిల్లాలో శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, కోటబొమ్మాళి, నరసన్నపేట, ఆమదాలవలస, కొత్తూరు, రణస్థలం, మందస, పొందూరులో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. మందస, పొందూరు కేంద్రాల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ సుశిక్షితులైన సిబ్బంది లేకపోవడంతో పోలీస్‌ శాఖ నుంచి డిప్యూటేషన్‌పై హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారు. చాలాచోట్ల అగ్నిమాపక వాహనాలకు సొంత భవనాలు లేవు. పొందూరులో మార్కెట్‌ యార్డులో నిర్వహిస్తున్నారు. రేకుల షెడ్‌లో వాహనాన్ని నిలుపుతున్నారు. సోంపేట, కొత్తూరు, ఇచ్ఛాపురంలో అగ్నిమాపక కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్ని స్టేషన్ల వద్ద వాహనాల్లో నీరు నింపేందుకు మోటారు బోర్లు లేవు. సమీపంలోని కాలువలు, చెరువుల్లో నీటిని నింపాల్సి వస్తోంది. చాలా కేంద్రాల వద్ద సిబ్బందికి కనీసం మరుగుదొడ్లు లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వాహనాలు దశాబ్దాల కిందట నాటివి. దీంతో తరచూ మొరాయిస్తున్నాయి. అత్యవసర సేవలు అందించే విభాగాలకు వాహనాలు సమకూర్చాల్సి ఉన్నా గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది.

అరకొరగా సిబ్బంది

అగ్నిమాపక కేంద్రాల్లో సిబ్బంది కొరత అధికంగా ఉంది. గత కొన్నేళ్లుగా పదవీ విరమణ చేస్తున్న సిబ్బంది స్థానంలో కొత్తవారి నియామకం జరగడం లేదు. శ్రీకాకుళం అగ్నిమాపక కేంద్రంలో 29 మంది సిబ్బందికి 21 మంది ఉన్నారు. ఇక్కడ పోలీస్‌ శాఖ 8 మంది హోంగార్డులను సర్దుబాటు చేసింది. ఇచ్ఛాపురంలో 16 మందికిగాను 8 మంది ఉన్నారు. ఇక్కడ 8 మంది హోంగార్డులు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. సోంపేటలో 16 మందికిగాను 8 మంది ఉండగా, ఇద్దరు హోంగార్డులు కూడా పని చేస్తున్నారు. టెక్కలిలో 16 మందికి ఆరుగురు ఉన్నారు. ఇక్కడ నలుగురు హోంగార్డులను పోలీస్‌ శాఖ సర్దుబాటు చేసింది. కోటబొమ్మాళిలో 16 మందికిగాను ఐదుగురే ఉన్నారు. ఈ కేంద్రంలో నలుగురు హోంగార్డులు డిప్యూటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. నరసన్నపేటలో 16 మందికిగాను ఏడుగురు మాత్రమే ఉండగా, ముగ్గురు హోంగార్డులను సర్దుబాటు చేశారు. ఆమదాలవలసలో 16 మందిగాను ఏడుగురు ఉన్నారు. ఐదుగురు హోంగార్డులు ఇక్కడ పని చేస్తున్నారు. కొత్తూరులో 15 మందికిగాను ఐదుగురు ఉన్నారు. ఆరుగురు హోంగార్డులను సర్దుబాటు చేశారు. రణస్థలం అగ్నిమాపకంలో కేంద్రంలో 16 మంది సిబ్బందికి గాను ఐదుగురు మాత్రమే ఉన్నారు. ఆరుగురు హోంగార్డులు ఇక్కడ డిప్యూటేషన్‌పై పని చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను బలోపేతం చేయడంతో పాటు సిబ్బంది నియామకం చేపట్టాల్సిన అవసరం ఉంది.

సిబ్బంది కొరత వాస్తవమే

అగ్నిమాపక శాఖ పనితీరును మరింత మెరుగుపరుస్తున్నాం. సిబ్బంది కొరత వాస్తవమే. ఫైర్‌మెన్లతో పాటు డ్రైవర్ల కొరత ఉంది. అయినా సరే ఎక్కడా ఇబ్బందులు లేకుండా ముందడుగు వేస్తున్నాం. జిల్లాలో 60మంది హోంగార్డుల ద్వారా సేవలు అందిస్తున్నాం. కొత్త ఫైరింజన్లతో పాటు కొత్త భవనాలకు ప్రతిపాదనలు పంపాం. త్వరలో నిధుల విడుదలకు అవకాశం ఉంది. అగ్నిమాపక కేంద్రంలో ఉద్యోగుల కోసం త్వరలో ప్రభుత్వం నోటీఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉంది. వేసవి దృష్ట్యా అప్రమత్తంగానే ఉన్నాం.

- మోహనరావు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి, శ్రీకాకుళం

Updated Date - Feb 18 , 2026 | 11:53 PM