ఇల్లు కట్టేదెలా?
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:23 AM
పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలో పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది.
- నిర్మాణ రంగంపై యుద్ధం ప్రభావం
- పెరిగిన ఇనుము, సిమెంట్ ధరలు
- టైల్స్, మార్బుల్స్ రేట్లు కూడా..
-నిలిచిపోతున్న నిర్మాణాలు
కోటబొమ్మాళి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పశ్చిమాసియాలో యుద్ధం జిల్లాలో పేద, మధ్య తరగతి జీవితాలపై పెను ప్రభావం చూపుతోంది. పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఇనుము, సిమెంట్, ఇతర ముడి సరుకుల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో చాలా వరకు నిర్మాణాలు నిలిచిపోతున్నాయి. సామాన్య ప్రజలు ఇంటి నిర్మాణం అంటేనే హడలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మాణాల్లో కీలకమైన ఇనుము ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. 20 రోజుల కిందట పోల్చితే ధరల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభంలో టన్ను ఇనుము ధర రూ. 65వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 75వేల నుంచి రూ. 78వేలు వరకు పెరిగింది. రెండు వారాల కిందట సిమెంట్ బస్తా రూ.285 ఉండగా ఇప్పుడు రూ.330కు చేరింది. బస్తాపై రూ.45 పెరిగింది. టైల్స్, మార్బుల్స్ ధరలకు కూడా రెక్కలొచ్చాయి. టైల్స్‌కు సంబంధించి రకాన్ని బట్టి చదరపు అడుగు రూ.5నుంచి రూ.10 వరకు ధరను పెంచి వ్యాపారులు విక్రయిస్తున్నారు. అల్‌టెక్ సీలింగ్‌కు వినియోగించే జిప్పమ్ షీట్ ధరలు కూడా పెరిగాయి. అన్ని రకాల టైల్స్ ఇతర ప్రాంతాల నుంచే జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా అక్కడ కొన్ని పరిశ్రమలు మూసి వేయడంతో సమస్య ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. గుజరాత్ , ఇతర రాష్ట్రాల నుంచి టైల్స్ రావడం లేదని ఓ వ్యాపారి చెప్పారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ఉత్పత్తి చేస్తుండడంతో ధరలు పెంచినట్లు చెబుతున్నారు. జింకు పైపు ధర గతంలో కేజీ రూ.75 ఉంటే ఇప్పుడు రూ. 90కి చేరుకుంది. 20 అడుగుల పొడవు ప్లాస్టిక్ పైపు గతంలో రూ.300 ఉంటే తాజాగా రూ.450కి చేరుకుంది. గత పదిహేను రోజులుగా పూర్తి స్థాయిలో ఇనుము, సిమెంటు సరఫరా కావడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. యుద్దం ఇలానే కొనసాగితే ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ధరల భారం తట్టుకోలేక కొంతమంది భవన నిర్మాణాలను మధ్యలోనే నిలుపుదల చేస్తున్నారు. దీంతో నిర్మాణ సామగ్రి అమ్మకాలు సైతం తగ్గాయి.