Share News

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి?

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:44 AM

Accidents due to flyover construction work రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారాయి. అస్తవ్యస్తంగా పనులు చేపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై రణస్థలం మండల కేంద్రంలో సుమారు 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు.

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి?
రణస్థలంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో స్కూటీతో గోతిలో పడిన దృశ్యం

  • రణస్థలంలో అస్తవ్యస్తంగా ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు

  • కానరాని కనీస నిబంధనలు

  • తరచూ రోడ్డుప్రమాదాలు

  • గతేడాది డిసెంబరు 14న లావేరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన నర్సింగరావు రణస్థలంలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వంతెన నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గోతుల్లో బైక్‌ అదుపు తప్పి దుర్మరణం పాలయ్యాడు.

  • ఈ ఏడాది జనవరి 17న స్వాములపాలెం గ్రామానికి చెందిన యువకుడు తన తల్లితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. రణస్థలం వద్ద రహదారిపై గోతుల్లో అదుపు తప్పి కింద పడిపోయారు. ఆ సమయంలో లారీ రావడంతో యువకుడి శరీరం నుజ్జునుజ్జుయి.. 40మీటర్ల మేర ఈడ్చుకెళ్లిపోయింది.

  • ఈ నెల 18న అల్లివలసకు చెందిన నూకరాజు, రమేష్‌ స్కూటీపై వస్తుండగా.. రణస్థలంలోని రోడ్డుపై గోతుల్లో పడిపోయారు. ఆ ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

  • తాజాగా ఆదివారం రణస్థలంలోనే ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఇసుక మేటలు వేయడంతో బైక్‌ అదుపు తప్పింది. అదే సమయంలో వెనుక నుంచి లారీ ఢీకొని మెళియాపుట్టి మండలం శేఖరపురం గ్రామానికి చెందిన పంది ప్రేమ్‌కుమార్‌(15) విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. ప్రేమ్‌కుమార్‌ తల్లిదండ్రులతో కలిసి ప్రస్తుతం విశాఖపట్నంలో నివాసం ఉంటున్నారు. డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశపరీక్ష రాసేందుకు ఆదివారం తండ్రితో కలిసి ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వచ్చాడు. తిరిగి విశాఖ వెళ్తుండగా రణస్థలంలో ఇసుక మేటలు కారణంగా వాహనం అదుపుతప్పి.. అదే సమయంలో లారీ ఢీకొనడంతో ప్రేమ్‌కుమార్‌ మృతిచెందాడు. తండ్రి పక్కకు తూలిపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

  • రణస్థలం, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): రణస్థలంలో ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు ప్రజల ప్రాణాలకు సంకటంగా మారాయి. అస్తవ్యస్తంగా పనులు చేపడుతుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారిపై రణస్థలం మండల కేంద్రంలో సుమారు 4 కిలోమీటర్ల మేర వంతెన నిర్మాణ పనులు చేపడుతున్నారు. ప్రధాన రహదారి మార్గాన్ని మూసివేసి సర్వీసు రోడ్లలో రాకపోకలకు అనుమతించారు. దీంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతూ.. భయం మాటున గడుపుతున్నారు. విశాఖ నుంచి వచ్చే మార్గంలో దన్నానపేట సూర్యస్కూల్‌ వద్ద.. శ్రీకాకుళం నుంచి వచ్చే మార్గంలో పాత పెట్రోల్‌ బంక్‌ వద్ద డైవర్షన్‌ ఇచ్చారు. రోడ్డు దాటాలంటే దాదాపు కిలోమీటరు వెళ్లాల్సి వస్తోంది. సర్వీసు రోడ్డుకు ట్రాఫిక్‌ మళ్లించడంతో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, వాహనాలు నిలిపిన చోట ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా పనులు జరుగుతున్నచోట ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడ జాతీయ రహదారుల సంస్థ సిబ్బంది ఉండాలి. స్థానిక పోలీసులతోపాటు వంతెన నిర్మాణ సంస్థతో సమన్వయం చేసుకోవాలి. కానీ ఇక్కడా పరిస్థితి లేదు. కనీసం నిబంధనలు సూచించే బోర్డులు లేవు. హెచ్చరికల బోర్డులు కానరావడం లేదు. దీంతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

  • ఫ్లైఓవర్‌ పనుల్లో భాగంగా 21సింగిల్‌ ఫిల్లర్ల నిర్మాణం చేపడుతున్నారు. ఒక్కో ఫిల్లర్‌ కోసం భారీ గోతులు తవ్వారు. అందుకే ఆ పక్క నుంచే ప్రయాణాలు అంటేనే ఒక రకమైన ఆందోళన. అటువంటి చోట విధిగా సెక్కూరిటీ సిబ్బంది ఉండాలి. రక్షణ చర్యలు చేపట్టాలి. సర్వీసు రోడ్లలో ఎప్పటికప్పుడు మట్టి, చెత్తను శుభ్రం చేసి వాటరింగ్‌ చేయాలి. కానీ అటువంటివేవీ కానరాకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా నిర్మాణ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

  • ప్రత్యేక దృష్టి..

  • రణస్థలంలో ఫ్లైఓవర్‌ పనుల దృష్ట్యా ట్రాఫిక్‌ ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాం. సమస్య పరిష్కారానికి మా వంతు చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది ఎప్పటికప్పుడు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. రాంగు రూటులో వచ్చే వారికి అపరాధ రుసుం వసూలు చేస్తున్నాం. ప్రతీ వాహనదారుడు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలి.

    - ఎం.అవతారం, సీఐ, జేఆర్‌పురం

Updated Date - Apr 20 , 2026 | 12:44 AM