Share News

ఈ రోడ్లపై ప్రయాణమెలా?

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:18 AM

మండలంలోని పలు గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఏ రోడ్డు చూసినా అధ్వానంగా ఉంటుంది.

ఈ రోడ్లపై ప్రయాణమెలా?
రాళ్లు తేలిన నువ్వాగడ రహదారి

- అధ్వానంగా గిరిజన గ్రామాల రహదారులు

- అడవి బిడ్డలకు తప్పని ఇబ్బందులు

కంచిలి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేవు. ఏ రోడ్డు చూసినా అధ్వానంగా ఉంటుంది. రాళ్లు తేలి గోతులతో దర్శనమిస్తోన్నాయి. కనీసం వాటిపై నడవలేని పరిస్థితి నెలకొంటుంది. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నువ్వాగడ, తుత్తాసాయి, సంబరమొర తదితర గ్రామాలకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైంది. జలంత్రకోట నుంచి నువ్వాగడ వెళ్లే తారురోడ్డు పూర్తిగా రాళ్లు తేలి భయానకంగా మారింది. నువ్వాగడ ఆశ్రమ పాఠశాల నుంచి సంబర మొర, గోపకేళి గ్రామాలకు వెళ్లే రహదారి సైతం గోతులమయమైంది. సరైన రోడ్లు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆయా గ్రామాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు వినతిపత్రాలు అందించినా, ఆందోళనలు చేసినా సంబంధిత అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇటీవల గొల్లకంచిలి నుంచి బొగాబెణి వరకు, బొగాబెణి నుంచి గోపకేళి వరకు నూతన రహదారి నిర్మించారు. మిగిలిన గిరిజన గ్రామాలకు సైతం పూర్తిస్థాయిలో రోడ్లు నిర్మించి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఆర్‌అండ్‌బీ ఏఈ మోహనరావును వివరణ కోరగా.. ‘నువ్వాగడ కాలనీ రహదారికి కోటి రూపాయలు మంజూరయ్యాయి. టెండర్లు సైతం పూర్తయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం.’ అని తెలిపారు.

Updated Date - Apr 02 , 2026 | 12:18 AM