ఆర్టీసీలో ప్రయాణించేదెలా?
ABN , Publish Date - Aug 31 , 2026 | 01:05 AM
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నానాటికీ కష్టమైపోతోంది. స్త్రీశక్తి పథకంతో మహిళలకు ప్రభుత్వం ఉచితంగా బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించింది.
కొత్త బస్సుల్లేవ్.. కొత్త నియామకాలు లేవు
స్త్రీశక్తి పథకంతో పెరిగిన ప్రయాణికుల సంఖ్య
356 నుంచి 324కు తగ్గిన బస్సులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు
అరసవల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం నానాటికీ కష్టమైపోతోంది. స్త్రీశక్తి పథకంతో మహిళలకు ప్రభుత్వం ఉచితంగా బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించింది. దీంతో ప్రయాణికుల కష్టాలకు అంతే లేకుండా పోతోంది. గతంలో జిల్లాలోని శ్రీకాకుళం-1, 2, టెక్కలి, పలాస డిపోల నుంచి రోజుకు సుమారు 90వేల మంది ప్రయాణించేవారు. స్త్రీశక్తి పథకంతో నేడు రోజువారీ ప్రయాణికుల సంఖ్య ఏకంగా 1.52లక్షలకు చేరుకుంది. ఆక్యుపెన్సీ రేటు 94శాతానికి పెరిగింది. నెలకు రూ.14కోట్లు ఉండే ఆదాయం ఏకంగా రూ.21కోట్లకు చేరుకుంది. ఈ పథకం అమలు చేయడానికి ముందు జిల్లాలో మొత్తం 356 బస్సులు అందుబాటులో ఉండేవి. నేడు ఆ సంఖ్య 324కు పడిపోయింది. కాలం చెల్లిన 32 బస్సులను యాజమాన్యం రద్దు చేసింది. నిజానికి ఒక బస్సు జీవిత కాలం 15 సంవత్సరాలు. ఆ సమయం పూర్తయ్యాక బస్సులను నడపడం ఆపేస్తారు. ఈ కారణంగా బస్సుల సంఖ్య తగ్గిపోయింది. అదే సమయంలో ప్రయాణికుల సంఖ్య ఇంచుమించు రెట్టింపు స్థాయికి చేరుకుంది. దీంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కష్టమైపోతోంది. స్త్రీశక్తి అమల్లోకి వచ్చి ఏడాది గడుస్తున్నా నేటికీ జిల్లాకు కొత్త బస్సులు రాకపోవడం, కాలం చెల్లిన బస్సులను తొలగించడం పలు ఇబ్బందులకు దారి తీస్తోంది. దీంతో శ్రీకాకుళం నుంచివిశాఖపట్నం వెళ్లే రూట్‌లో నాలుగు బస్సులు, పలాస 2, ఇచ్ఛాపురం 2, పలాస-కవిటి 1, టెక్కలి నుంచి శ్రీకాకుళం-1, బత్తిలి మార్గంలో ఒక బస్సును తగ్గించేశారు. చాలా రూట్లలో ఇదే పరిస్థితి నెలకొంది. ఒకవైపు ప్రయాణికుల రద్దీ, మరోవైపు బస్సుల తగ్గింపుతో ప్రజలు పత్నామ్యాయ రవాణా మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి దాపురించింది. బైక్‌లు, కార్లలో ప్రయాణాలు అధికంగా ఉన్నాయని, రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. దీనికితోడు పదవీ విరమణ చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఆర్టీసీ సిబ్బంది తీవ్ర ఒత్తిడిలో విధులను నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి, కొత్త బస్సుల కేటాయింపునకు కృషి చేయాలని, ఔట్‌సోర్సింగ్ విధానంలో సిబ్బందిని నియమించి, ప్రయాణ కష్టాలకు ముగింపు పలకాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం
ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సుల కోసం ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. జిల్లాకు 52 విద్యుత్ బస్సులు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకు సంబంధించి కూడా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. 120 మంది కండక్టర్లు, 90 మంది డ్రైవర్లు అవసరం ఉంది. అనుమతులు వచ్చిన వెంటనే ఔట్ సోర్సింగ్ విధానంలో సిబ్బంది నియామకానికి అన్ని చర్యలూ తీసుకుంటాం.
సీహెచ్.అప్పలనారాయణ, జిల్లా ప్రజా రవాణా అధికారి