ఎలా చదువుతున్నారు?
ABN , Publish Date - Aug 27 , 2026 | 11:40 PM
Assessment of students' learning abilities ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం జిల్లాలో 218 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో 17,861 మంది విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల సర్వే చేపట్టనుంది.
విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంచనా
నేడు 218 పాఠశాలల్లో సర్వే
శ్రీకాకుళం ఎడ్యుకేషన్, ఆగస్టు 27(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను అంచనా వేయడానికి విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం జిల్లాలో 218 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో 17,861 మంది విద్యార్థుల అభ్యసన సామర్ధ్యాల సర్వే చేపట్టనుంది. ఆయా పాఠశాలలు విద్యార్థులు వందశాతం హజరయ్యేలా చూడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అభ్యాసన సామర్థ్యాల పరీక్ష నిర్వహణకు 361 మంది సమన్వయకర్తలను నియమించింది. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన ప్రశ్నవళిలో ఈ సర్వేను నిర్వహించనుంది.
గతేడాది ఏప్రిల్‌లో 4,6,8 తరగతులకు పరీక్ష నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది. దాన్ని అనివార్య కారణాలతో రద్దు చేసింది. విద్యాసంవత్సరం ముగియడంతో 4,6,8 తరగతుల విద్యార్థులు ప్రస్తుతం 5,7,9 తరగతులకు వచ్చారు. వీరిలో ఐదో తరగతిలో 4,170 మంది, ఏడోతరగతిలో 6,578 మంది, తొమ్మిదోతరగతిలో 7,113 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. మొత్తం 17,861 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొంటారు. ఐదో తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి 11 గంటలు వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 7,9 తరగతుల విద్యార్థులకు అరగంట అదనంగా సమయమిచ్చారు.
ఒక్కో తరగతిలో విద్యార్థుల్ని మూడు బృందాలుగా విభజించి పరీక్ష నిర్వహిస్తారు. మొదటి బృందానికి తెలుగు, ఆంగ్లం, రెండో బృందానికి గణితం, ఆంగ్లం, మూడో బృందానికి తెలుగు, గణితం సబ్జెక్టుల్లో బహుళైచ్ఛిక ప్రశ్నలు ఇస్తారు. ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో తెలుగు, ఆంగ్లంలో రూపొందించిన ప్రశ్నపత్రాలను ఇచ్చి సమాధానాలు రాయిస్తారు. ఎంపిక చేసిన పాఠశాలలో రెండు సబ్జెకులుగా వారీగా సర్వేను సమర్థంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లాపరీక్షల నిర్వహణ బోర్డు కార్యదర్శి సంజీవరావు, డీఈవో రవిబాబు తెలిపారు.