గృహాలు శభాష్.. తాగునీరు అట్టడుగు
ABN , Publish Date - Sep 11 , 2026 | 12:11 AM
Ranked 4th in the state for house construction... సిక్కోలు.. ఇళ్ల నిర్మాణాలతోపాటు కొన్ని సంక్షేమ పథకాల అమల్లో ప్రగతి సాధించింది. తాగునీటితోపాటు రోడ్లు, భూసేకరణ తదితర మౌలిక వసతుల కల్పనలో మాత్రం వెనుకబడింది. గురువారం అమరావతి వేదికగా సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతిపై సమగ్ర విశ్లేషణ జరిగింది.
జిల్లా ఈఎస్‌జీ స్కోరు 88.. ఏ-గ్రేడ్ కైవసం
ఇళ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే 4వ స్థానం..
జల్‌జీవన్ మిషన్ పనుల్లో 28వ ర్యాంక్
ఇంకా రోడ్డు సదుపాయంలేని 336 గ్రామాలు..
మున్సిపాలిటీల్లో 42.94 శాతానికే కుళాయిలు
పారిశ్రామిక భూసేకరణలో తీవ్ర నిరాశ..
సీఎం చంద్రబాబు- కలెక్టర్ల సదస్సు నివేదికలో వెల్లడి
శ్రీకాకుళం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): సిక్కోలు.. ఇళ్ల నిర్మాణాలతోపాటు కొన్ని సంక్షేమ పథకాల అమల్లో ప్రగతి సాధించింది. తాగునీటితోపాటు రోడ్లు, భూసేకరణ తదితర మౌలిక వసతుల కల్పనలో మాత్రం వెనుకబడింది. గురువారం అమరావతి వేదికగా సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో జిల్లా ప్రగతిపై సమగ్ర విశ్లేషణ జరిగింది. ఈ నివేదిక ప్రకారం పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన(ఈఎస్‌జీ) సూచీల్లో జిల్లా 88 స్కోరుతో ఏ-గ్రేడ్ సాధించి ముందంజలో నిలిచింది. ఓవరాల్ కేపీఐలో 82 స్కోరుతో 16వ స్థానం దక్కించుకుంది.
పేదల ఇళ్ల నిర్మాణం(పీఎంఏవై)లో జిల్లా యంత్రాంగం అద్భుత పనితీరు కనబరిచింది. మంజూరైన 69,353 ఇళ్లకు గాను ఏకంగా 56,470 ఇళ్లను(82 శాతం) పూర్తి చేసి రాష్ట్రంలోనే 4వ స్థానంలో నిలిచింది.
వ్యవసాయ, అనుబంధ రంగాల స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో అద్భుతమైన వృద్ధి నమోదైంది. 2025-26 తొలి త్రైమాసికంలో రూ.1,735 కోట్లుగా ఉన్న జీవీఏ.. 2026-27 నాటికి రూ. 2,084 కోట్లకు చేరి 20.06 శాతం వృద్ధిని నమోదు చేసింది.
జిల్లాలోని 919 గ్రామ పంచాయతీలకుగాను 917 గ్రామాలకు (99.8 శాతం) ఫైబర్‌నెట్ కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.
జిల్లాలో వందశాతం గృహాలకు ఎల్పీజీ కనెక్షన్లు, విద్యుదీకరణ పూర్తిచేశారు. 912 గ్రామ పంచాయతీల్లో నూరు శాతం ఎల్‌ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. నిర్దేశించిన 1,247 గ్రామాలకుగాను 1,247 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్‌గా ప్రకటించారు.
జిల్లాలోని నాలుగు మునిసిపాలిటీల్లో 95.90 శాతం ఇళ్లకు (95,798 గృహాలకు) డోర్-టు-డోర్ చెత్త సేకరణ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలకు హిరమండలం రిజర్వాయర్ (ఫేజ్-1) ద్వారా కొత్త ఎంవీఎస్ మంచినీటి ప్రాజెక్టు మంజూరైంది.
తీరని కష్టాలు.. నత్తనడక పనులు
గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ మిషన్ పనుల్లో జిల్లా పనితీరు అత్యంత దారుణంగా ఉంది. రాష్ట్రంలోనే అట్టడుగున 28వ ర్యాంక్‌లో నిలిచింది. మంజూరైన మొత్తం 4,285 పనులకు గాను కేవలం 1,168 పనులు(27.26శాతం) మాత్రమే పూర్తయ్యాయి.
పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల కల్పనలో జిల్లా 23వ స్థానానికి పరిమితమైంది. 4 మున్సిపాలిటీల్లోని 86,624 ఇళ్లకు గాను కేవలం 37,194 ఇళ్లకు (42.94 శాతం) మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. పట్టణాల్లో 662 మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా కేవలం 10 మాత్రమే పూర్తయ్యాయి.
గ్రామీణ రోడ్ల కనెక్టివిటీకి సంబంధించి జిల్లాలో ఇంకా 336 నివాసిత ప్రాంతాలకు కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం గమనార్హం.
పరిశ్రమల స్థాపనకు సంబంధించి ఏపీఐఐసీ భూసేకరణలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. 2024 జూన్ నుంచి 10,080.95 ఎకరాల భూమి అవసరం కాగా.. కేవలం 49.24 ఎకరాలను(0.49శాతం) మాత్రమే సేకరించి 18వ స్థానంలో నిలిచింది.
పోర్టులకు సంబంధించి 2,422 ఎకరాలు, ఎయిర్‌పోర్టులకు 1,271 ఎకరాలు, ఫిషింగ్ హార్బర్ల కోసం 6 ఎకరాలు.. ఇలా మొత్తం 3,698 ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉంది. మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ కోసం నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ ఏడాది మే 6న ఫైలు పంపినప్పటికీ ఇంకా కలెక్టర్ వద్దే పెండింగ్‌లో ఉంది.
పర్యాటక రంగానికి సంబంఽధించి బారువ వద్ద 54 ఎకరాల భూమి అడ్వాన్స్ పొజిషన్ ఇచ్చినా ఎలియనేషన్ కాలేదు. నెలవంక వద్ద 300-500 ఎకరాల భూమిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ఫుడ్‌ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి ‘‘సన్‌రైజ్ నేచర్ సీ ఫుడ్స్’’ (రూ.50కోట్ల పెట్టుబడి, 800 మంది ఉపాధి)కి 25 ఎకరాల భూ కేటాయింపు ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. ఇంధన రంగానికి సంబంధించి ఎస్‌ఐపీబీ ఆమోదించిన రూ.204 కోట్ల ప్రాజెక్టు ఇంకా గ్రౌండింగ్ కాలేదు.
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అందుబాటులో ఉన్న రూ.102 కోట్ల నిధుల్లో కేవలం రూ.67.4 కోట్లు(66 శాతం) మాత్రమే వెచ్చించి 20వ స్థానానికే పరిమితమైంది. ఈ నివేదిక ద్వారా గుర్తించిన లోపాలను అధిగమించి.. జిల్లాను ప్రగతి పథంలో నడిపించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సదస్సులో ఆదేశించారు. సదస్సులో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పాల్గొన్నారు.