‘క్యూఐబీ’ వలలో గృహిణి..
ABN , Publish Date - Jan 20 , 2026 | 12:02 AM
శ్రీకాకుళం నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే లక్ష్యంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఉచ్చు బిగిస్తున్నారు.
శ్రీకాకుళం క్రైమ్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం నగరంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే లక్ష్యంగా ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఉచ్చు బిగిస్తున్నారు. ఆదివారం నగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కోటి రూపాయలకు ముంచిన కేటుగాళ్లు.. ఆ ఘటన జరిగిన 24 గంటలు దాటకుండానే సోమవారం పీఎన్ కాలనీకి చెందిన ఓ గృహిణికి రూ.16 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టారు. వరుసగా రెండు రోజుల్లో రెండు భారీ సైబర్ మోసాలు వెలుగుచూడడంతో నగరవాసుల్లో ఆందోళనకు గురవు తున్నారు.
అసలేం జరిగిందంటే..
నగరంలోని పీఎన్ కాలనీకి చెందిన ఓ గృహిణి నెంబర్‌ను సైబర్ నేరగాళ్లు ఇటీవల ఓ వాట్సాప్ గ్రూపు లో యాడ్ చేశారు. అందులో ‘క్యాపి స్టోయిన్’ అనే యూట్యూబ్ లింక్ ద్వారా ‘క్యూఐబీ’ యాప్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. డీమ్యాట్ ఖాతా తెరిచి ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే ఇంట్లోనే ఉండి సంపాదించవచ్చని ఆశ చూపారు. ఆ వాట్సాప్ గ్రూపులోని మరికొందరు తాము కూడా ఇందులో పెట్టుబడి పెట్టామని, తమకు లక్షల్లో లాభాలు వచ్చాయంటూ నకిలీ స్ర్కీన్ షాట్లు పెట్టి సదరు గృహిణిని నమ్మించారు.
విడతల వారీగా రూ.16 లక్షలు జమ
గ్రూపులోని సభ్యుల మాటలు, స్కామర్ల ప్రలోభాలను పూర్తిగా నమ్మిన బాధితురాలు.. 2025 డిసెంబరు 26 నుంచి ఈ ఏడాది జనవరి 16 వరకు పలు దఫాలు స్కామర్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు రూ.16 లక్షలు జమ చేశారు. యాప్‌లో అంకెలు (లాభాలు) కనిపిస్తున్నా.. వాటిని విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా సాధ్యపడలేదు. పైగా లాభాలు డ్రా చేసుకోవాలంటే మరికొంత పెట్టుబడి పెట్టాలని స్కామర్లు ఒత్తిడి చేయడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు లబోదిబో మంటూ సోమవారం శ్రీకాకుళం రెండో పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయిం చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అపరిచిత గ్రూపులతో జాగ్రత్త
‘వాట్సాప్, టెలిగ్రామ్ వేదికగా గుర్తు తెలియని వ్యక్తులు యాడ్ చేసే గ్రూపుల్లో ఉండవద్దు. అధిక లాభాలు వస్తాయని నమ్మించే యాప్స్‌ను డౌన్ లోడ్ చేసుకోవద్దు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే పెట్టుబడి లింకు లను క్లిక్ చేయవద్దు. సైబర్ మోసం జరిగిన వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాల’ని పోలీసులు సూచిస్తున్నారు.