Share News

నేటి నుంచి 70 బృందాలతో ఇంటింటా సర్వే

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:30 AM

Diarrhea has decreased జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా, ప్రణాళికా బద్ధంగా పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రబలిన డయేరియా వ్యాధి తీవ్రత తగ్గింది. బాధితులెవరూ ప్రమాదకర పరిస్థితిలో లేర’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు.

నేటి నుంచి 70 బృందాలతో ఇంటింటా సర్వే

నీటి ద్వారానే డయేరియా వ్యాప్తి చెందినట్లు నివేదిక

వ్యాధి తీవ్రత గణనీయంగా తగ్గింది

ప్రజలు పరిశుభ్రత పాటిస్తూ సహకరించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

అరసవల్లి/అర్బన్‌, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా, ప్రణాళికా బద్ధంగా పనిచేస్తోంది. గత నాలుగు రోజులుగా ప్రబలిన డయేరియా వ్యాధి తీవ్రత తగ్గింది. బాధితులెవరూ ప్రమాదకర పరిస్థితిలో లేర’ని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ పేర్కొన్నారు. పూర్తిస్థాయిలో నివారణకు శనివారం నుంచి 70 బృందాలతో ఇంటింటా సర్వే చేయనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. కాలువలు పరిశీలించారు. అలాగే సాయంత్రం ఆయన స్థానిక మునిసిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘శ్రీకాకుళంలో డయేరియా నివారణకు పటిష్ఠ చర్యలు చేపట్టాం. శుక్రవారం 13 కొత్త కేసులు వచ్చాయి. వ్యాధి వ్యాప్తికి కారణాలను విశ్లేషిస్తూ గత నాలుగు రోజులుగా నీటి నమూనాలు సేకరించి.. విశాఖపట్నంలో ల్యాబ్‌కు పంపాం. ఇందులో 11 శాంపిళ్లలో డయేరియాకు కారణమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒకటి బోరు వాటర్‌ ద్వారా, రెండు నేరుగా నాగావళి నది నుంచి, మిగిలిన 8 శాంపిళ్లు మునిసిపల్‌ కొళాయిల ద్వారా సేకరించిన నీటినమూనాల్లో ఉన్నట్లు తేలింది. నీరు కలుషితం కాకుండా ముందుగా డయేరియా ప్రభావిత ప్రాంతాలతోపాటు నగరంలో ముఖ్యమైన అన్ని మునిసిపల్‌ తాగునీటి సరఫరా ట్యాంకులను శుభ్రం చేశాం. ఇప్పటికీ ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నాం. 35 లీకులను గుర్తించి వాటిని సరిచేశాం. టెక్నాలజీ, పరీక్షల ద్వారా మరిన్ని లీకేజీలను గుర్తించి, నగరమంతా లీకులను సరిచేస్తాం. డయేరియా ప్రభావిత ప్రాంతాలైన మంగువారితోట, దమ్మలవీధి, కాకివీధి, కంపోస్టు కోలనీ సచివాలయాల పరిధిలో ఇంటింటికీ సర్వే 50 టీమ్‌ల ద్వారా జరుగుతోంది. శనివారం నుంచి అదనంగా మరో 20 టీమ్‌లను కూడా ఏర్పాటు చేశాం. వీరంతా ప్రతీ ఇంటికీ వెళ్లి పూర్తి వివరాలను సేకరిస్తారు. ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తారు. నగరంలోని ప్రతీ రెండు సచివాలయాలకు ఒక ట్రాక్టర్‌, ఒక జేసీబీ, ఆరుగురు సిబ్బందిని నియమించాం. వీరంతా కాలువల్లో పూడిక తీతలు, పారిశుధ్య పనులు చేపడతారు. ప్రతీ మూడు డివిజన్లకు ఒక అధికారిని నియమించాం. గ్రామీణ నీటి సరఫరా సంస్థ ద్వారా నిర్వహించే అన్ని ఆర్వో ప్లాంట్లను ఇప్పటికే తనిఖీ చేశాం. అందరికీ నోటీసులు కూడా జారీ చేసాం. ఆహార నియంత్రణశాఖ అధికారులతో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొన్ని దుకాణాలను కూడా మూసివేయించాం. ఇదే సమయంలో దోమల నివారణకు గాను లార్వా దశలోనే నాశనం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రజలు కూడా ఇంటి పరిసరాల్లో చెత్తను వేయకుండా, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ వేడినీటిని తాగాలి. బయటి ఆహారాన్ని తీసుకోవద్ద’ని కలెక్టర్‌ సూచించారు.

Updated Date - Feb 28 , 2026 | 12:30 AM