Share News

హోటళ్లపై గుదిబండ

ABN , Publish Date - May 03 , 2026 | 12:15 AM

Rs. 993 hike on commercial gas cylinder వాణిజ్య సిలిండర్ల వినియోగదారులపై గ్యాస్‌ కంపెనీలు గుదిబండ మోపాయి. ఒక్కో సిలిండర్‌పై 993 చొప్పున పెంచేశాయి. దీంతో హోటళ్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.

హోటళ్లపై  గుదిబండ
శ్రీకాకుళంలో ఓ హోటల్‌లో కట్టెలపొయ్యిపై వంట

  • ఒక్కో వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌పై రూ.993 పెంపు

  • ఆందోళనలో నిర్వాహకులు

  • నరసన్నపేట, మే 2(ఆంధ్రజ్యోతి): వాణిజ్య సిలిండర్ల వినియోగదారులపై గ్యాస్‌ కంపెనీలు గుదిబండ మోపాయి. ఒక్కో సిలిండర్‌పై 993 చొప్పున పెంచేశాయి. దీంతో హోటళ్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్ల నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 3,301 వాణిజ్య గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. సుమారు 80 శాతం మంది హోటళ్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తున్నారు. ఒక్కో సిలిండర్‌ ధర రూ.2,185 ఉండగా.. తాజాగా రూ.993 చొప్పున పెంచడడంతో రూ.3,178కి చేరింది. ఇప్పటికే ఇరాన్‌- ఇజ్రాయెల్‌, అమెరికా యుద్ధ ప్రభావంతో గ్యాస్‌ కొరత ఏర్పడింది. వాణిజ్య సిలిండర్ల సరఫరా నిలిచిపోయింది. దీంతో చాలా హోటళ్లు, వీధి దుకాణాలు మూతపడ్డాయి. కొన్ని హోటళ్లు, దాబాల్లో కట్టెలు, బొగ్గు వినియోగిస్తున్నారు. కొందరు ఊక, జీడితొక్క, కర్రపొట్టు పొయ్యలను ఏర్పాటు చేసి వంటకాలు చేసి విక్రయిస్తున్నారు. ఇకనైనా వాణిజ్య సిలిండర్లు లభ్యమవుతాయని నిర్వాహకులు ఎదురుచూశారు. కాగా.. యుద్ధ ప్రభావంతో ఇప్పటికీ గ్యాస్‌ కొరత ఉందని, ప్రస్తుతం 40 శాతం మాత్రమే వాణిజ్య సిలిండర్లు సరఫరా అవుతున్నాయని గ్యాస్‌ ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి. కాగా.. గ్యాస్‌ కొరత కారణంగా పరోక్షంగా ప్రజలపైనే భారం పడుతోంది. గ్యాస్‌ కొరత సాకుచూపి.. ఇప్పటికే హోటళ్లలో టిఫిన్‌, భోజనాల ధరలు పెంచేశారు. తోపుడుబండ్లుపై తినుబండారాల ధరలు కూడా పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు.

  • బొగ్గు, ఊకకు పెరిగిన డిమాండ్‌

  • వాణిజ్య సిలిండర్ల ధరలు పెరగడంలో చాలామంది హోటళ్లు, దాబాల నిర్వాహకులు బొగ్గు, ఊక, కర్రపొట్టు, జీడితొక్కతో వంటకాలు చేస్తున్నారు. దాబాల నిర్వాహకులు ఒడిశా, బిహార్‌ ప్రాంతాల నుంచి జిల్లాకు బొగ్గును దిగుమతి చేస్తున్నారు. ఈ క్రమంలో బొగ్గు, ఊకకు డిమాండ్‌ పెరిగింది.

  • అక్రమంగా.. గ్యాస్‌ రీఫిల్లింగ్‌!

  • ఓ వైపు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత.. మరోవైపు సిలిండర్‌ ధరను కంపెనీలు పెంచడంతో కొంతమంది వ్యాపారులు గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నరసన్నపేటలో సుమారు వంద వరకు దాబాలు, హోటల్స్‌, స్వీటు దుకాణాలు, టీస్టాల్స్‌ ఉన్నాయి. వీటిలో చాలామంది నిర్వాహకులు వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా.. నిబంధనలకు విరుద్ధంగా గృహాలకు వినియోగించే సిలిండర్లతో హోటళ్లలో వంటకాలు తయారు చేస్తున్నారు. ఇంకొందరు గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు పాల్పడుతున్నారు. 19 కేజీల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.3,178కి చేరింది. గృహసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్‌ మాత్రం రూ.940కు లభిస్తోంది. ఈ నేపథ్యంలో హోటళ్లు, దాబాలు, ఫాస్ట్‌ఫుడ్‌ నిర్వాహకులు గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నారు. గృహవసర వినియోగదారులకు కొంతమొత్తాన్ని అధికంగా చెల్లించి.. సిలిండర్లు పొందుతున్నారు. ఆ సిలిండర్లలో గ్యాస్‌ను చిన్న పరికరం ద్వారా తమ వద్ద ఉన్న ఖాళీ వాణిజ్య సిలిండర్లలో రీఫిల్లింగ్‌ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు తనిఖీలు చేసినా.. నిబంధనల విషయంలో తమకు ఇబ్బందులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనిపై అధికారులు మరింత దృష్టి సారించి.. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై తహసీల్దార్‌ సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా.. గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - May 03 , 2026 | 12:15 AM