హోటళ్లు మూత!
ABN , Publish Date - Mar 30 , 2026 | 12:17 AM
Supply of commercial gas cylinders stopped గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా జిల్లాలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. మార్కెట్‌లో కొన్ని హోటళ్లను మాత్రమే కష్టమ్మీద కొనసాగిస్తున్నారు. ఈ నెల 14 వరకూ వాణిజ్య సిలెండర్లు బాగానే సరఫరా చేశారు. కానీ తర్వాత పూర్తిగా నిలిపివేశారు.
ఈ నెల 14 నుంచి నిలిచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా
ఉపాధికి దూరమైన కార్మికులు
ఇచ్ఛాపురం, మార్చి 29(ఆంధ్రజ్యోతి):
ఇచ్ఛాపురంలో సుమారు 50 హోటళ్లు ఉన్నాయి. అందులో 40 హోటళ్లు మూతపడ్డాయి. ప్రస్తుతం 10 హోటళ్లు మాత్రమే నిర్వహిస్తున్నారు. కొందరు కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. మరికొందరు వారికి ఉన్న పరపతితో కమర్షియల్ గ్యాస్ సిలెండర్లు అటు ఒడిశా నుంచి తెప్పించుకొని హోటళ్లు నడిపిస్తున్నారు.
.........
గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా జిల్లాలో చాలా హోటళ్లు మూతపడ్డాయి. అందులో పనిచేస్తున్న కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. మార్కెట్‌లో కొన్ని హోటళ్లను మాత్రమే కష్టమ్మీద కొనసాగిస్తున్నారు. ఈ నెల 14 వరకూ వాణిజ్య సిలెండర్లు బాగానే సరఫరా చేశారు. కానీ తర్వాత పూర్తిగా నిలిపివేశారు. కేవలం ఆస్పత్రులు, వసతిగృహాలు, విద్యాసంస్థలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తున్నారు. ఫలితంగా హోటళ్ల నిర్వహణ కష్టతరంగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 వరకూ హోటళ్లు, రెస్టారెంట్లు ఉంటాయి. వాటి ద్వారా దాదాపు 10వేల మంది ఉపాధి పొందుతున్నారు. గ్యాస్ కొరతతో కారణంగా జిల్లాలో సగానికిపైగా హోటళ్లు మూతపడడంతో వారంతా ఉపాధికి దూరమైనట్టే. ఒక వేళ కట్టెల పొయ్యి మీద వంటలు చేద్దామన్నా వంట చెరకు లభ్యత లేదు. అందుబాటులో ఉన్న వంటచెరకు ధర భారీగా ఉంది. అందుకే హోటళ్లు నడిపిస్తే తమకు ఇబ్బందులు తప్పవని యజమానులు చెబుతున్నారు. సాధారణ పరిస్థితులు వచ్చేవరకూ హోటళ్లు నడిపే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.
శుభకార్యాలకూ కష్టమే..
ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా వివాహాలు, శుభకార్యాలు జరుగుతున్నాయి. వాటికి సైతం గ్యాస్ కొరత వెంటాడుతోంది. కొందరు ముందుగానే క్యాటరింగ్ చెప్పుకున్నారు. ఇప్పుడు గ్యాస్ లభ్యత లేకపోవడంతో వంటల నిర్వాహకులు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. కొంతమంది పెళ్లిళ్లకు ఇళ్ల వద్ద కట్టెలతో వంటలు చేస్తున్నారు. కొరత నేపథ్యంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి గ్యాస్ సిలిండర్ల కొరత లేకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
చాలా కష్టం..
గ్యాస్ సిలిండర్ల లభ్యత లేకపోవడంతో హోటళ్లు నడపడం చాలా కష్టంగా ఉంది. గతంలో అందరికీ భోజనం పెట్టామన్న సంతృప్తి ఉండేది. కూలీలకు ఉపాధి దొరికేది. కానీ ప్రస్తుతం గ్యాస్ ఇబ్బందులతో హోటళ్లు మూతపడుతుండం బాధాకరం.
- గవరయ్య, భవానీ రెస్టారెంట్ హోటల్ నిర్వాహకుడు, ఇచ్ఛాపురం