ఆకతాయిలు వేధిస్తున్నారు
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:07 AM
తన కుమార్తె నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోందని, అయితే నిత్యం కొందరు ఆకతాయిలు ఆమెను వేధిస్తున్నారని గార మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని తల్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఎస్పీకి బాధిత యువతి తల్లి ఫిర్యాదు
శ్రీకాకుళం క్రైం, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తన కుమార్తె నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతోందని, అయితే నిత్యం కొందరు ఆకతాయిలు ఆమెను వేధిస్తున్నారని గార మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థిని తల్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేదికను నిర్వహించారు. కళాశాలకు వెళ్లేందుకు తన కుమార్తె ఇబ్బంది పడుతోం దని, తక్షణం స్పందించి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని బాధిత విద్యార్థిని తల్లి ఎస్పీకి వినతిపత్రం అందించారు. అలాగే ఇచ్ఛాపురం మండలం కేదారపురానికి చెందిన బుక్త బలరాంను ఈ ఏడాది ఏప్రిల్ 7న గంజాయి కేసులో పోలీసులు అరెస్టు చేసి అంపోలు జిల్లా జైలుకు తరలించారని, ఏప్రిల్ 8న సదరు వ్యక్తి జైలులో మృతి చెందాడని, మాకు ఎటువంటి ఆధారం లేదని తల్లిదండ్రులు బుక్త కామరాజు, భార్య రమణమ్మ ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. కుమారుడు మృతితో తమను ఆదుకునే వారు ఎవరూ లేరని, దివ్యాంగుడనైన తనను, భార్యను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదు పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా సమగ్ర విచారణ చేపట్టి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ సెల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 80 ఫిర్యాదులను స్వీకరించి వారితో స్వయంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.