Share News

ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:58 PM

బస్సులో మరిచిపోయిన బంగారం, డబ్బుతో ఉన్న బ్యాగును తిరిగి ప్రయాణికుడికి అందజేసి ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు.

 ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ
ప్రయాణికుడికి బ్యాగును అందజేస్తున్న స్టేషన్‌ మేనేజర్‌ ప్రసాదరావు, సిబ్బంది బ్యాగులో ఉన్న బంగారు ఆభరణాలు

- బంగారం, డబ్బు బ్యాగును బస్సులో మరిచిపోయిన ప్రయాణికుడు

- తిరిగి ఆ బ్యాగును బాధితుడికి అప్పగించిన వైనం

అరసవల్లి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): బస్సులో మరిచిపోయిన బంగారం, డబ్బుతో ఉన్న బ్యాగును తిరిగి ప్రయాణికుడికి అందజేసి ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని చాటుకున్నారు. సంతబొమ్మాళి మండలం సీతానగర్‌ గ్రామానికి చెందిన గుడియా సంతోష్‌కుమార్‌ పలాస వెళ్లేందుకు శుక్రవారం ఉదయం తన కుటుంబంతో సహా సోంపేటలో ఆర్టీసీ బస్సు (ఇచ్ఛాపురం నుంచి విశాఖపట్నం) ఎక్కాడు. బస్సు హరిపురం చేరాక, వేరే అర్జెంట్‌ పని ఉండడంతో హరిపురంలో వారంతా దిగిపోయారు. బస్సు దిగే హడావుడిలో బంగారం, డబ్బుతో గల బ్యాగును బస్సులోనే మరిచిపోయారు. కొంతసేపటికి బ్యాగు మర్చిపోయామని గుర్తించి డ్రైవర్‌కు ఫోన్‌ చేసి విషయాన్ని తెలియజేశారు. బస్సు శ్రీకాకుళం కాంప్లెక్‌ చేరుకున్నాక, స్టేషన్‌ మేనేజర్‌ మీసాల ప్రసాదరావుకు బ్యాగును అందజేస్తానని, అతన్ని సంప్రదించాలని డ్రైవర్‌ చెప్పాడు. దీంతో సంతోష్‌ కుమార్‌ శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం వచ్చి స్టేషన్‌ మేనేజర్‌ను కలిశాడు. సంతోష్‌ నుంచి పూర్తి వివరాలు సేకరించిన స్టేషన్‌ మేనేజర్‌ ఆ బ్యాగును తెరిచారు. అందులో గల బంగారు గొలుసు, చెవి రింగులు -2, హెయిర్‌ రింగ్‌లు-4, నగదు రూ.67వేలను సరిచూసి, సెక్యూరిటీ సిబ్బంది, ఔట్‌పోస్ట్‌ సిబ్బంది సమక్షంలో సంతోష్‌కు అందజేశారు.

Updated Date - Feb 20 , 2026 | 11:58 PM