‘గుండ’ కుటుంబానికి హోంమంత్రి పరామర్శ
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:05 AM
టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి గుండ అప్పలసూర్య నారాయణ ఇటీవల కాలం చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం పరామర్శించారు.
శ్రీకాకుళం, జనవరి 21(ఆంధ్రజ్యోతి): టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి గుండ అప్పలసూర్య నారాయణ ఇటీవల కాలం చేసిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత బుధవారం పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని, వారి తనయులను ఓదార్చారు. అప్పల సూర్యనారాయణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... పార్టీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ‘గుండ అప్పలసూర్యనారాయణ’ అందించిన సేవలు ఎనలేనివని కొనియాడారు.
బార్ అసోసియేషన్ హాల్లో ‘గుండ’ చిత్రపటం
శ్రీకాకుళం లీగల్ జనవరి21 (ఆంధ్రజ్యోతి): జిల్లాకోర్టు బార్ అసోసియేషన్ హాల్లో మాజీమంత్రి, సీనియర్ న్యాయవాది గుండ అప్పలసూర్యనారాయణ చిత్రపటాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఇటీవల అప్పలసూర్య నారాయణ మృతి చెందిన నేపథ్యంలో ఆయన చిత్రపటం వద్ద బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తంగి శివప్రసాద్, పిట్టా దామోదర్ తదితరులు బుధవారం నివాళి అర్పించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. కోర్టు ప్రాంగణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అప్పల సూర్యనారాయణ ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. ఆయన మృతి చెందడం తీరనిలోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరు కున్నారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తర్లాడ రాధాకృష్ణ, వాన కృష్ణచంద్, వై.మురళీమోహన్ రావు, నౌపడా విజయ్‌కుమార్, గెదల వాసుదేవరావు, కిల్లి మార్కండేయులు, డి.పార్థసారధి, పేరూరి నాగేశ్వర రావు, కింజరాపు శ్రీనివాసరావు, మామిడి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.
‘గుండ’ అజాతశత్రువు
మాజీమంత్రి గుండ అప్పలసూర్యనారాయణ మృతి చెందిన నేపథ్యంలో జిల్లా బీసీ న్యాయవాదుల సంఘం ప్రతినిధులు బుధవారం సంతాపం తెలిపారు. అరసవల్లిలోని గుండ ఇంటికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, వారి కుమారులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు ఆగూరు ఉమామహే శ్వరరావు మాట్లాడుతూ.. అప్పల సూర్యనారాయణ అజాత శత్రువుగా పేరుపొందారన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఎన్ని సూర్యారావు, కొమ్ము రమణమూర్తి, బీవీ రమణ, వాన కృష్ణచంద్, బీన ఢిల్లీశ్వరరావు, ఖాన్ తదితరులు పాల్గొన్నారు.