ఆగిఉన్న లారీని ఢీకొని..
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:01 AM
Mother and son die in road accident ఆ తల్లీకొడుకులిద్దరూ ప్రత్యక్ష దైవం.. ఆదిత్యుడి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో తల్లీకొడుకు దుర్మరణం
మృతులు విశాఖ జిల్లావాసులు
అరిణాం అక్కివలసలో విషాదం
ఎచ్చెర్ల, మార్చి 26(ఆంధ్రజ్యోతి): ఆ తల్లీకొడుకులిద్దరూ ప్రత్యక్ష దైవం.. ఆదిత్యుడి దర్శనానికి వచ్చారు. దర్శనం అనంతరం ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఆగి ఉన్న లారీని అతివేగంగా ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం చెందారు. రెప్పపాటులోనే తల్లీకొడుకు మృతి చెందడంతో స్థానికులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నగరం ఏవీఎన్ కళాశాల సమీపాన చెంగలరావుపేట చెందిన సీహెచ్ నరేంద్రకుమార్(32), అతని తల్లి నాగమణి (55).. గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణస్వామిని దర్శించుకునేందుకు గురువారం ఉదయం 9 గంటల సమయంలో తల్లీకొడుకు విశాఖలో ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. అరసవల్లిలో ఆదిత్యుడ్ని దర్శించుకుని మళ్లీ ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస జంక్షన్ సమీపంలో ఫ్లైఓవర్‌పై ఆగి ఉన్న లారీని అతి వేగంగా ఢీకొన్నారు. దీంతో వారిద్దరూ రోడ్డుపై పడి.. తీవ్రంగా గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వచ్చి సపర్యలు చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎచ్చెర్ల ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. వారిద్దరూ విశాఖ వాసులుగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలో సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.
ఆ కుటుంబానికి దిక్కెవరు..
నరేంద్రకుమార్ విశాఖపట్నం రుషికొండలో ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. మూడేళ్ల కిందట ప్రశాంతి అనే మహిళతో వివాహమైంది. ఈ దంపతులకు ఏడాది వయసు గల కుమార్తె ఉంది. తల్లి నాగమణి గృహిణి కాగా, తండ్రి ముత్యరాజు 2018లో మృతి చెందారు. తల్లీ, భార్య, పాపతో కలిసి సరదాగా జీవనం సాగించేవారు. దైవదర్శనం నిమిత్తం వచ్చి.. ఒకేసారి తల్లీకొడుకు ఇద్దరూ మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఇక తమకు దిక్కెవరు అని రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా రహదారులపై ఎక్కడికక్కడ లారీలను నిలిపేయడం.. కొంతమంది వాహనదారులు మితిమీరిన వేగంతో వెళ్లి ఢీకొనడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. వాహనదారులు నిబంధనలు పాటించేలా.. ప్రమాదాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.