Share News

సుపారీ ఇచ్చి..

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:30 PM

కన్నకొడుకే సుపారీ ఇచ్చి తల్లిదండ్రులపై దాడి చేయించాడు. అనంతరం వారి నుంచి బంగారు ఆభరణాలను దోపిడీ చేశాడు.

సుపారీ ఇచ్చి..
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ భవాని, చిత్రంలో సిఐ తిరుపతిరావు, ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌

-తల్లిదండ్రులపై దాడి చేయించి..

- బంగారు ఆభరణాలు దోపిడీ

- ఓ కుమారుడి ఘాతుకం

- పోలీసుల దర్యాప్తులో బట్టబయలు

- ఆ నగలు రోల్డ్‌గోల్డ్‌గా తేల్చిన వైనం

- నలుగురి అరెస్టు

పలాస, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): కన్నకొడుకే సుపారీ ఇచ్చి తల్లిదండ్రులపై దాడి చేయించాడు. అనంతరం వారి నుంచి బంగారు ఆభరణాలను దోపిడీ చేశాడు. తీరా ఆ బంగారం కాకి బంగారం(రోల్డ్‌గోల్డ్‌)గా తేలింది. దీనికి సంబంధించి మొత్తం నలుగురిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ వివరాలను కాశీబుగ్గ డీఎస్పీ జి.భవాని ఆదివారం విలేకరులకు వెల్లడించారు. మందస మండలం వీరభద్ర గ్రామానికి చెందిన దంపతులు ఇప్పిలి రాఘవులు, స్వర్ణలత గత నెల 31న సమీపంలో ఉన్న దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా దారి మధ్యలో ముసుగులు ధరించిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. రాఘవులుపై పిడిగుద్దులు కురిపించి, స్వర్ణలత మెడలో ఉన్న బంగారు ఆభరణాలు దోచుకొని పరారయ్యారు. దీనిపై రాఘవులు మందస పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ సంఘటనా స్థలానికి చేరుకుని చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి ఆధారాలు సేకరించారు. తొలుత చైన్‌స్నాచర్లగా అనుమానించి జిల్లా అంతటా ప్రధాన రహదారులపై జల్లెడపట్టారు. దీనిపై వారికి ఎటువంటి ఆచూకీ లభించలేదు. మరో కోణంలో దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయట పడింది. ఈ నేరానికి పాల్పడింది రాఘవులు కుమారుడు వివేక్‌గా తేలింది. ఈయన మందస మండలం మకరజోల గ్రామానికి చెందిన యానాది జ్యోతిరాజు, పలాస లేబర్‌ కాలనీకి చెందిన చీకటి అభిరామ్‌, వజ్రపుకొత్తూరు మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన గురుబిల్లి అనిల్‌కుమార్‌కు సుపారీ ఇచ్చి తల్లిదండ్రులపై దాడి చేయించి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు నిర్ధారించారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశారు.

తగాదాలే కారణం..

రాఘవులు స్థానికంగా మంచిపలుకుబడి ఉన్నవ్యక్తి. బంగారం వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుమారుడు వివేక్‌తో ఉన్న తగాదాల కారణంగా అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించాడు. ఈ నేపథ్యంలో జల్సాలకు నగదు అవసరం కావడంతో అనిల్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బంగారు ఆభరణాలు చోరీ చేయడంతో పాటు తండ్రిని భయపెట్టి తిరిగి ఇంటిలోకి వెళ్లడానికి జ్యోతిరాజు, అభిరామ్‌, అనిల్‌కుమార్‌తో కలసి వివేక్‌ పథకం వేసుకున్నాడు. జ్యోతిరాజుపై గతంలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులు ఉన్నాయి. జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. అభిరామ్‌, అనిల్‌కుమార్‌ కూడా జులాయిగా తిరుగుతుంటారు.

అది బంగారమే కాదు..

స్వర్ణలత మెడలో దొంగిలించిన ఆభరణాలు అసలు బంగారమే కాదని బాధితులు పోలీసులకు వివరించారు. రోల్డ్‌గోల్డ్‌ నగలు పెట్టకొని ఆలయానికి వెళితే అసలు బంగారంగా భావించి దోపిడీ చేశారు. అవి అమ్మకానికి పెట్టినప్పుడు అసలు విషయం బయట పడింది. సీసీ ఫుటేజిల ఆధారంగా నిందితులను గుర్తించిన మందస పోలీసులను డీఎస్పీ అభినందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీఐ ఎం.తిరుపతిరావు, ఎస్‌ఐ కె.కృష్ణప్రసాద్‌ ఉన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 11:30 PM