Share News

భగ్గుమన్న సిక్కోలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:09 AM

Extreme heat waves సూర్యుడు భగభగ మండుతున్నాడు. నిప్పులకొలిమిలా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) జారీ చేసిన వాతావరణ నివేదిక ప్రకారం శుక్రవారం జిల్లా అంతటా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది.

భగ్గుమన్న సిక్కోలు
ఎండల తీవ్రతతో.. శుక్రవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న చిలకపాలెం జంక్షన్‌

కొత్తూరులో గరిష్టంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు

నిర్మానుష్యంగా రహదారులు

శ్రీకాకుళం, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి) : సూర్యుడు భగభగ మండుతున్నాడు. నిప్పులకొలిమిలా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) జారీ చేసిన వాతావరణ నివేదిక ప్రకారం శుక్రవారం జిల్లా అంతటా ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. జిల్లాలోని మొత్తం 30 మండలాలకుగాను 7 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. మరో 20 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచాయి. కొత్తూరు మండలంలో అత్యధికంగా 42.7 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దీని తర్వాత బూర్జలో 42.1, మెళియాపుట్టి, పాతపట్నం, సారవకోట మండలాల్లో 42 డిగ్రీలు చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి మండలాల్లో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండల తీవ్రత, మరోవైపు వడగాల్పులతో జిల్లావాసులు విలవిలలాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నం పూట ప్రధాన కూడళ్లు, రహదారులన్నీ జనాలు లేక వెలవెలబోతున్నాయి. ద్విచక్ర వాహనదారులు, ఆటో కార్మికులు, రోజువారీ కూలీలు ఎండ దెబ్బకు తట్టుకోలేక చెట్ల కింద, నీడ ఉన్న ప్రదేశాల్లో సేద తీరుతున్నారు. మరోవైపు నిరంతర ఉక్కపోతతో వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. రాబోయే రెండు రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉన్నందున, ఎండ తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ నివేదిక సూచిస్తోంది. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, తగినన్ని నీళ్లు తాగాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:09 AM