Share News

నిప్పుల సెగ

ABN , Publish Date - May 21 , 2026 | 11:43 PM

Increased sunshine in the srikakulam భానుడు ప్రతాపానికి జిల్లాప్రజలు విలవిల్లాడిపోయారు. నిప్పులకొలిమిని తలపించే ఎండలు.. వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో గురువారం గరిష్ఠంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆసుపత్రుల్లో రోగులు ఉక్కపోతకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

నిప్పుల సెగ
శ్రీకాకుళంలో మండుటెండకు వెలవెలబోతున్న పొట్టి శ్రీరాముల మార్కెట్‌

  • జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రత

  • జి.సిగడాంలో అత్యధికంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత

  • కలవరపరుస్తున్న వేడిగాలులు

  • ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు

  • బయటకు వచ్చేందుకు భయాందోళన

  • నిర్మానుష్యంగా రహదారులు

  • శ్రీకాకుళం/ ఇచ్ఛాపురం/ కోటబొమ్మాళి/ నరసన్నపేట, మే 21(ఆంధ్రజ్యోతి): భానుడు ప్రతాపానికి జిల్లాప్రజలు విలవిల్లాడిపోయారు. నిప్పులకొలిమిని తలపించే ఎండలు.. వేడిగాలులకు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. జిల్లాలో గురువారం గరిష్ఠంగా 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఆసుపత్రుల్లో రోగులు ఉక్కపోతకు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(ఏపీఎస్‌డీఎంఏ) విడుదల చేసిన అధికారిక నివేదిక ప్రకారం గురువారం జిల్లాలోని పలు మండలాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఎండ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత పెరిగిపోవడంతో.. భయపడి చాలామంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. సూర్యుడి ప్రాతాపానికి శ్రీకాకుళంలో ఉదయం 11 గంటల తర్వాత పొట్టిశ్రీరాముల మార్కెట్‌, రైతుబజారుతోపాటు ప్రధాన జంక్షన్లలో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. ప్రధాన వీధులన్నీ కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. తప్పని పరిస్థితిలో కొంతమంది రోడ్లపైకి గొడుగులు వేసుకుని, ముఖానికి కాటన్‌ వస్ర్తాలు కట్టుకుని బయటకు వచ్చారు. శుక్ర, శనివారాల్లో కూడా ఎండ మరింత తీవ్రంగా ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఎండలో తిరగకూడదని సూచిస్తున్నారు.

  • కోటబొమ్మాళిలో గత నాలుగు రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే వడగాలులతో వేడి పెరుగుతోంది. వివిధ పనుల కోసం పొలాల్లోకి వెళ్లిన రైతులు పనులు చేయలేక ఇంటికి రాలేక చెట్లకింద సేదదీరారు. అధిక ఉష్ణోగ్రత, వేడి గాలుల కారణంగా ఇచ్ఛాపురంలో ప్రధాన రహదారులు జనసంచారం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. నరసన్నపేటలో కూడా అదే పరిస్థితి. గత రెండురోజులుగా గాలిలో తేమశాతం తగ్గి.. ఉక్కపోత పెరిగింది. వేడిగాలులు వీస్తున్నాయి. వెల్డింగ్‌, వర్క్‌షాపు కార్మికులు, దర్జీలు ఎండవేడికి పనులు చేయలేకపోతున్నారు. ఉపాధిహామీ కూలీలు ఎండవేడిమి తట్టుకోలేక 10 గంటలకే ఇళ్లకు తిరిగొస్తున్నారు. కొద్దిరోజులు పనులు నిలిపివేయాలని పలువురు అధికారులను కోరుతున్నారు.

  • గురువారం నమోదైన ఉష్ణోగ్రతలు (డిగ్రీల్లో)

  • జి.సిగడాం 42.2

  • ఎల్‌.ఎన్‌.పేట 41.9

  • సరుబుజ్జిలి 41.9

  • బూర్జ 41.7

  • పాతపట్నం 41.7

  • మెళియాపుట్టి 41.7

  • సారవకోట 41.7

  • పొందూరు 41.6

  • కొత్తూరు 40.8

  • మందస 40.8

  • ఆమదావలస 39.6

  • ఇచ్ఛాపురం 39.6

  • జలుమూరు 39.6

  • కంచిలి 39.6

  • కవిటి 39.6

  • హిరమండలం 39.5

  • కోటబొమ్మాళి 39.3

  • సంతబొమ్మాళి 39.3

  • శ్రీకాకుళం 35.5

  • జాగ్రత్తలు పాటించాలి

  • ఎండలో బయటకు వెళ్లినప్పుడు వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, కొబ్బరినీళ్లు తాగాలి. చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు బయటకు వెళ్లకపోవడమే మంచిది. అధిక ఎండలతో శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. వడదెబ్బ లక్షణాలతోపాటు కొందరిలో రక్తం గడ్డకట్టి గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చే ప్రమాదముంది.

  • - పి.గణేష్‌, ప్రభుత్వ అసుపత్రి సూపరింటెండెంట్‌, కోటబొమ్మాళి.

  • అప్రమత్తంగా ఉండాలి

  • ఎండల తీవ్రతపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మెదడులోని హైపోధిలామిస్‌ అనే భాగము శరీరంలోని వేడిని నియంత్రిస్తుంది. ఎండలు ఎక్కువైతే అది నియంత్రణ కోల్పోయి.. ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. మనిషిలోని నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. ఎండలో తిరుగుతూ రోగాల బారిన పడొద్దు.

    - డాక్టర్‌ రెడ్డి భార్గవ్‌, సీహెచ్‌సీ, నరసన్నపేట

Updated Date - May 21 , 2026 | 11:43 PM