అధిక ఒత్తిడి.. ప్రమాదం ‘గురూ’!
ABN , Publish Date - Aug 23 , 2026 | 12:24 AM
The burden of unnecessary academics on young children విద్యారంగంలో పోటీతత్వం పెరుగుతోంది. అదే సమయంలో విద్యార్థులపై ఒత్తిడి అధికమవుతోంది. తమ పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని చాలామంది తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే భాష, గణితాంశాలను నేర్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు క్యూ కడుతున్నారు. అయితే పిల్లలకు గొప్ప భవిష్యత్ ఇస్తున్నామని తల్లిదండ్రులు భావిస్తున్నారే కానీ.. వారిపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నామన్న విషయాన్ని గ్రహించడం లేదు.
చిన్నారులపై అనవసర చదువుల భారం
పరీక్షలు, ర్యాంకులు అంటూ ప్రయోగాలు
మానసిక రుగ్మతలతో ఆరోగ్యంపై ప్రభావం
తల్లిదండ్రులు బాధ్యతగా ఉండకపోతే ముప్పే
టీచర్లు భయంతో కాదు.. భరోసాతో బోధించాలి
శ్రీకాకుళం ఎడ్యుకేషన్/రణస్థలం, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి):
విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో హోంవర్క్ చేయలేదని టీచర్ కాస్త మందలించేసరికి ఆరేళ్ల విద్యార్థి కుప్పకూలి పోయాడు. గుండెపగిలి చనిపోయాడు. అయితే ఇక్కడ టీచర్ వేధింపులు అని చెప్పలేం కానీ.. తీవ్ర ఒత్తిడికి గురై ఆ విద్యార్థి ఆరేళ్ల ప్రాయంలోనే గుండెపోటుకు గురికావడం గుర్తించాల్సిన విషయం.
విద్యారంగంలో పోటీతత్వం పెరుగుతోంది. అదే సమయంలో విద్యార్థులపై ఒత్తిడి అధికమవుతోంది. తమ పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని చాలామంది తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు తెచ్చుకోవాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. ప్రాథమిక స్థాయిలోనే భాష, గణితాంశాలను నేర్చుకోవాలని భావిస్తున్నారు. అందుకే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు క్యూ కడుతున్నారు. అయితే పిల్లలకు గొప్ప భవిష్యత్ ఇస్తున్నామని తల్లిదండ్రులు భావిస్తున్నారే కానీ.. వారిపై విపరీతంగా ఒత్తిడి పెంచుతున్నామన్న విషయాన్ని గ్రహించడం లేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు కూడా హోంవర్క్‌లు, పరీక్షలు, ప్రయోగాల పేరిట చిరుప్రాయంలోనే విద్యార్థులపై ఒత్తిడి పెంచడంతో.. వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల చదువుపై అధిక ఒత్తిడి, భయపెట్టడం, మందలించడం వంటివి తీవ్ర పరిణామాలకు దారి తీస్తున్నాయి.
మనో వికాసం కీలకం..
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యం వారి శారీరక, మానసిక వికాసంపై ఆధారపడి ఉంటుంది. అది వయసుతో ముడిపడి ఉంటుంది. ఈ వికాసాన్ని బట్టి పిల్లలు క్రమంగా సరళమైన అంశాల నుంచి సంక్లిష్టమైన విషయాలను అర్ధం చేసుకోగలుగుతారు. అందుకే ఉపాధ్యాయ శిక్షణలో విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా బోధిస్తారు. కానీ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులే ఉన్నారా? నిబంధనల ప్రకారం బోధన సాగిస్తున్నారా? విద్యా ప్రమాణాలు పాటిస్తున్నారా? అంటే మాత్రం సమాధానం దొరకని పరిస్థితి.
మూడేళ్లకే బడిబాట..
విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశానికి నిర్ధిష్టంగా ఐదేళ్లు నిండాలి. కాగా తమ పిల్లలు చిరుప్రాయంలోనే అద్భుతమైన ప్రతిభ సాధించాలని చాలామంది తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకే మూడేళ్లకే వారిని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో వారికి కంటి నిండా నిద్ర ఉండదు. మనసారా ఆటలు ఆడుకోలేరు. ఆపై బలవంతపు చదువులు, బెదిరింపులతో చిరుప్రాయంలోనే అనేక రుగ్మతలు. ఒకరికి కంటి సమస్య, మరొకరికి పంటి సమస్య, మరొకరికి అలర్జీ, ఇంకొకరికి అజీర్తి, సరైన ఎదుగుదల ఉండదు. ఆపై కొందరికి స్థూలకాయం. చిరుప్రాయంలోనే గుండెపోటు వస్తుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. దానికి కారణమం ముమ్మాటికీ ఒత్తిడే కారణం. పాఠశాలలకు వెళ్లే చిన్నారులతో రోజుకు కనీసం అరగంటపాటు గడపని తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. చిన్నారుల విషయంలో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలది ఎంత బాధ్యతో.. తల్లిదండ్రులది అంతకు మించి అన్న విషయాన్ని మరిచిపోకూడదు.
ఉపాధ్యాయులు పాటించాల్సినవి
విద్యార్థులు తప్పుచేస్తే ఉపాధ్యాయులు సరిదిద్దాలి. ఇతర విద్యార్థుల ప్రతిభతో పోల్చకూడదు. గట్టి స్వరంతో భయపెట్టడం కానీ, కొట్టడం కానీ చేయరాదు. చెప్పే పాఠం అర్ధంకాకపోతే మళ్లీ బోధించాలి. ఉపాధ్యాయులు అంటే భయం అనే భావన విద్యార్థులకు రాకుండా వ్యవహరించాలి. కొత్త విషయాలను వారికి నేర్పేలా.. భరోసాతో బోధన సాగించాలి. ఉపాధ్యాయుల మాటతీరు విద్యార్థులకు భద్రత, ఆప్యాయత కల్పించేలా ఉండాలి. విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయరాదు. తోటి విద్యార్థుల ముందు విమర్శించకూడదు. ఏ సమస్య వచ్చిని ఎదుర్కొనేలా విద్యార్థుల్లో మనోధైర్యం పెంచాలి.
విద్యార్థులు చదువులో వెనుకబడినా.. హోంవర్క్ చేయకపోయినా.. భయపెట్టకుండా నిధానంగా అడిగి తెలుసుకోవాలి. వారికి బోధన అర్థమైందో లేదో .. ఇతర అనారోగ్య సమస్యలేమైనా ఉన్నాయా? అని గమనించాలి. విద్యార్థులు.. సమస్యను చెప్పుకునేలా స్వేచ్ఛ కల్పించాలి. తరగతి గదిలోనే హోంవర్క్ పూర్తిచేయించడానికి సహకరించాలి. విద్యార్థులకు చిన్నపాటి ప్రశంసలు, స్టార్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే.. వారు చదువుపై మరింత శ్రద్ధ చూపే అవకాశం ఉంటుంది.
మార్గదర్శకత్వంతో తీర్చిదిద్దాలి
పాఠశాలల్లో విద్యార్థులను క్రమశిక్షణ పేరుతో భయపెట్టడం సరైన విధానం కాదు. దీనివల్ల ఉపాధ్యాయులపై విద్యార్థులకు వ్యతిరేక భావాలు పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులతో ఉపాధ్యాయులు స్నేహంగా మెలగాలి.విద్యార్థులు తప్పుచేస్తే దాని వెనుక కారణాలను తెలుసుకుని మార్గదర్శకత్వంతో తీర్చిదిద్దాలి.
- ఎ. రవిబాబు, డీఈవో, శ్రీకాకుళం
విద్యార్థుల ప్రవర్తనను గమనించాలి
పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన నిత్యం ఉపాధ్యాయులు గమనించాలి. అందరు విద్యార్థులలో ప్రజ్ఞ ఒకే రకంగా ఉండదు. విద్యార్థుల కుటుంబ నేపథ్యంపై అవగాహన ఉండాలి. 12ఏళ్లు వరకు పిల్లలు శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. పిల్లలను శిక్షించే ఉపాధ్యాయుడు అంటే చాలా భయపడతారు. భయంతో కాకుండా.. భరోసాతో బోధన చేపట్టాలి.
- బెండి సాయిరాం, మానసిక వైద్యనిపుణుడు, కేజీహెచ్, విశాఖపట్నం