మళ్లీ.. ‘పంచాయితీ’!
ABN , Publish Date - Sep 09 , 2026 | 12:03 AM
Do not merge our villages into the corporation స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రెండు గ్రామాల ప్రజలు పంచాయతీ కోసం పట్టుబడుతున్నారు. గతంలో శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనమైన తమ గ్రామాలను.. పంచాయతీలుగానే కొనసాగించాలని ఎచ్చెర్ల మండలం కుశాలపురం, తోటపాలేం గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
మా గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయొద్దు
పంచాయతీలుగానే కొనసాగించాలి
కుశాలపురం, తోటపాలేం గ్రామస్థుల డిమాండ్
హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూపు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో మరోసారి తెరపైకి..
ఎచ్చెర్ల రూరల్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రెండు గ్రామాల ప్రజలు పంచాయతీ కోసం పట్టుబడుతున్నారు. గతంలో శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనమైన తమ గ్రామాలను.. పంచాయతీలుగానే కొనసాగించాలని ఎచ్చెర్ల మండలం కుశాలపురం, తోటపాలేం గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే పలువురు హైకోర్టును ఆశ్రయించగా.. కేసు కొనసాగుతోంది. తాజాగా మరోసారి ఈ ‘పంచాయితీ’ తెరపైకి వచ్చింది. త్వరలో స్థానిక ఎన్నికలు జరగనుండడంతో.. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సైతం ‘విలీనం వద్దు.. పంచాయతీలే ముద్దు’ అని తేల్చిచెబుతున్నారు.
2019లో వైసీపీ ప్రభుత్వం.. ప్రత్యేక గెజిట్‌ద్వారా ఏడు పంచాయతీలను శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనం చేసింది. ఇందులో కుశాలపురం, తోటపాలేంతోపాటు శ్రీకాకుళం మండలానికి చెందిన ఖాజీపేట, చాపురం, కిల్లిపాలేం, పెద్దపాడు, పాత్రునివలస ఉన్నాయి. వీటికి 2021లో పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికలు సైతం నిలిపివేశారు. కోర్టు కేసుల కారణంగా శ్రీకాకుళం కార్పొరేషన్‌కు కూడా ఎన్నికలు జరగడం లేదు. అప్పట్లోనే విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడు పంచాయతీల నాయకులు.. రాజకీయాలకు అతీతంగా హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పు రాకపోవడంతో 2021లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఇప్పటికీ ఈ కేసు హైకోర్టులో కొనసాగుతోంది.
అభివృద్ధి ఏదీ?
కుశాలపురం, తోటపాలేం గ్రామాలు విజయనగరం లోక్‌సభ పరిధి ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనం చేసినా.. అభివృద్ధికి నోచుకోవడం లేదని ఈ రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ పనులకు సైతం దూరమయ్యామని వాపోతున్నారు. కాగా.. న్యాయస్థానంలో కేసులు వేసిన వారితో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రావణ్‌కుమార్ ఇటీవల సమావేశం నిర్వహించారు. గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వనున్నట్లు చెప్పారు. కేసులు వెనక్కి తీసుకోవాలని కోరారు. వారు మాత్రం పంచాయతీలుగానే కొనసాగించాలని స్పష్టం చేశారు.
‘స్థానిక’ నేతల తీర్మానం
ప్రభుత్వం స్థానిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతోంది. ముందుగా మునిసిపాలిటీ, నగరపాలక సంస్థలు, తరువాత జడ్పీ, మండల పరిషత్, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పంచాయతీల విలీనం రద్దు చేయాలనే అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కుశాలపురంలో పార్టీలకు అతీతంగా టీడీపీ, వైసీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఈ నెల 6న గ్రామసభ నిర్వహించి తీర్మానం చేశారు. పంచాయతీల విలీనం రద్దుపై హైకోర్టు తీర్పు అనుకూలంగా రాకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. తోటపాలేంలో టీడీపీ, వైసీపీ నాయకులు సమిష్టిగా పోరాటం చేయకపోయినా, అన్ని పార్టీల నేతలు పంచాయతీ ప్రకటన కోసం తమ ప్రయత్నాలు చేస్తున్నారు.
పంచాయతీగా ప్రకటించాలి:
ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న మా గ్రామాన్ని పంచాయతీగా ప్రకటించాలి. మా గ్రామాన్ని శ్రీకాకుళం కార్పొరేషన్‌లో విలీనం చేయడంతో అభివృద్ధి ఆగిపోయింది. ఈ సమస్యను ముసిసిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాం. హైకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం.
- పైడి అన్నంనాయుడు, టీడీపీ నాయకుడు, కుశాలపురం
తీర్పుకోసం ఎదురు చూస్తున్నాం
హైకోర్టు తీర్పు కోసం ఎదురుచూస్తున్నాం. అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తాం. పట్టణ ప్రాంతం వల్ల జలజీవన్ పథకం నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఉపాధిహామీ పనులు జరగటం లేదు. మెటీరియల్ కాంపోనెంట్ నిధులు రావటం లేదు. శ్రీకాకుళం నియోజకవర్గంతో సంబంధం లేని మా గ్రామాన్ని కార్పొరేషన్‌లో విలీనం చేయటం వల్ల ప్రయోజనం లేదు.
- గురు జగపతిబాబు, మాజీ ఎంపీటీసీ, తోటపాలెం