Share News

హేమశ్రీ డిశ్చార్జ్‌

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:19 AM

Kidney transplant surgery successful పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి నుంచి సోంపేట పట్టణానికి చెందిన హేమశ్రీ ఆదివారం డిశ్చార్జ్‌ అయింది. గత నెల 13న ఈమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు.

హేమశ్రీ డిశ్చార్జ్‌
హేమశ్రీతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శిరీష, పక్కన వైద్యులు..

21 రోజుల తరువాత ఆసుపత్రి నుంచి ఇంటికి

కిడ్నీమార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న ఎమ్మెల్యే శిరీష

పలాస, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం-200 పడకల ఆసుపత్రి నుంచి సోంపేట పట్టణానికి చెందిన హేమశ్రీ ఆదివారం డిశ్చార్జ్‌ అయింది. గత నెల 13న ఈమెకు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించారు. ఆమెకు తండ్రి మోహనరావు కిడ్నీని దానం చేశారు. పలాస కిడ్నీ ఆసుపత్రి వైద్యబృందం, శ్రీకాకుళం కిమ్స్‌, జెమ్స్‌ ఆసుపత్రి వైద్యాధికారుల బృందం ఎంతో శ్రమించి విజయవంతంగా ఆపరేషన్‌ చేశారు. ఉన్నత చికిత్స కోసం స్థానిక ఆసుపత్రిలోనే 21 రోజులపాటు వివిధ చికిత్సలు, మందులు అందించారు. ఆమె పూర్తిగా కోలుకోవడంతో ఆదివారం ఆసుపత్రిని నుంచి ఆమెను డిశ్చార్జి చేశారు. ఈ సందర్భంగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆసుపత్రిలో హేమశ్రీని, ఆయన తండ్రి మోహనరావును పరామర్శించారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. పూర్తిగా నయమయ్యే వరకూ తాము అండగా ఉంటామని, ఏ చిన్న సమస్య వచ్చినా తనకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ పరంగా బాధిత కుటుంబానికి సహాయం అందిస్తామన్నారు. వైద్యబృందానికి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఆమె వెంట టీడీపీ నాయకులు లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, బడ్డ నాగరాజు, సప్ప నవీన్‌, గురిటి సూర్యనారాయణ ఉన్నారు.

ఇక్కడే మరిన్ని ఆపరేషన్లు..

హేమశ్రీ ఆపరేషన్‌ విజయవంతం కావడంతో ఇదే స్ఫూర్తితో ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని ఆపరేషన్లు ఇక్కడే నిర్వహిస్తామని ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ శరత్‌జ్యోత్స్న తెలిపారు. ‘హేమశ్రీతోపాటు ఆమె తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. దినచర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా కొన్నిరోజులు ఐసోలేషన్‌లో ఉండాల’ని సూచించారు.

Updated Date - Apr 06 , 2026 | 12:19 AM