సేద్యానికి చేయూత
ABN , Publish Date - May 10 , 2026 | 12:29 AM
Grant of agricultural mechanization equipment రైతులకు వ్యక్తిగతంగా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సేద్యానికి వినియోగించే 1,328 యంత్రాలను పంపిణీ చేసేందుకుగానూ జిల్లాకు 4.84 కోట్ల నిధులు కేటాయించింది.
వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు మంజూరు
జిల్లాకు రూ.4.84 కోట్లు కేటాయింపు
ఈ నెల 19వరకు దరఖాస్తుల స్వీకరణ
లాటరీ పద్ధతిలో లబ్ధిదారుల ఎంపిక
నరసన్నపేట, మే 9(ఆంధ్రజ్యోతి):
రైతులకు వ్యక్తిగతంగా సబ్సిడీపై వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సేద్యానికి వినియోగించే 1,328 యంత్రాలను పంపిణీ చేసేందుకుగానూ జిల్లాకు 4.84 కోట్ల నిధులు కేటాయించింది. సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్ (స్మామ్) పథకం ద్వారా యాంత్రీకరణ పరికరాలు మంజూరు చేయనుంది. ఈ నెల 19 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. ఈ పథకం అమలుకు ప్రత్యేక వెబ్ అప్లికేషన్‌ను రూపొందించింది. తద్వారా లాటరీ విధానం ద్వారా లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించనుంది.
జిల్లాకు కేటాయించినవి ఇవే
జిల్లాకు ట్రాక్టర్ పనిముట్లు, విత్తడం, నాటడం, తవ్వే యంత్రాలు, స్ర్పేయర్లు, ట్రాక్టర్లు, మినీ ట్రాక్టర్లు, పవర్ టిల్లర్లు, రోటావేటర్లు, హార్వెస్టింగ్, నూర్పిడికి వినియోగించే తదితర వ్యవసాయ యంత్రాలను 1,328 కేటాయించారు. హార్వెస్టింట్, థ్రెషింగ్ పరికరాలు - 19, ప్లాంట్ ప్రొటెక్షన్ పరికరాలు - 894, పాస్ట్‌హార్వెస్టింగ్, ప్రొసెసింగ్ మిషనరీలు - 18, పవర్ టిల్లర్లు -63, కలుపుతీత యంత్రాలు - 42, ట్రాక్టర్లు -43, ట్రాక్టరు, పవర్ టిల్లర్లు డ్రివైన్ పరికరాలు -129, ప్లాటింగ్, డిగ్గింగ్ పరికరాలు-14, సెల్ఫ్‌ఫ్రోఫిల్లడ్ మిషనరీలు 106 పంపిణీ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, మహిళా లబ్ధిదారులకు యాంత్రాల యూనిట్ ధరలో 50శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీ వర్తింపజేస్తారు.
అర్హతలు ఇవీ...
భూమి కలిగిన రైతులతోపాటు అటవీహక్కుల గుర్తింపు చట్టం ద్వారా(ఆర్‌వోఎఫ్‌ఆర్) భూమిపై హక్కులు కలిగిన రైతులు యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. గత మూడేళ్లలో కనీసం మూడు పంటల సీజన్లలో ఈ పంట నమోదు చేసుకున్న సీసీఆర్‌సీ కార్డులు కలిగిన రైతులు కూడా అర్హులే. గతేడాది యాంత్రీకరణ పథకం ద్వారా సబ్సిడీ పొందిన రైతులు అనర్హులు. కుటుంబంలో ఒక సభ్యుడు మాత్రమే యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తు చేసుకోవాలి.
ప్రక్రియ ఇలా..
రైతులు యాంత్రీకరణ పరికరాల కోసం ఈసీడ్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఈ నెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. నేరుగా ఆన్‌లైన్‌లో లేదా, రైతు సేవాకేంద్రాల్లో సిబ్బంది సహకారంతో దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు వీటిని పరిశీలించి ఈ నెల 23 నుంచి 25వ తేదీలోగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం కోసం జాబితా సమర్పిస్తారు. ఆమోదం పొందిన జాబితాలోని రైతుల సమక్షంలో జేసీ ఆధ్వర్యంలో లాటరీ ప్రక్రియ నిర్వహిస్తారు. లాటరీ ద్వారా ఎంపికైన లబ్దిదారులకు ఈనెల 26 నుంచి జూన్ 9వ తేదీలోగా సబ్సిడీయేతర డబ్బు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. జూన్ 26వ తేదీలోగా యంత్ర పరికరాలను రైతులకు అందజేస్తారు. జూన్ 30 నుంచి రైతులకు సబ్సిడీ సొమ్ము విడుదల చేస్తారు. జిల్లాలో అర్హులైన రైతులు యాంత్రీకరణ పరికరాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలని జేడీఏ మురళీకృష్ణ సూచించారు.