ఎత్తు, బరువు.. లేరు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:49 PM
Malnutrition among young children అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహార లోపం వెంటాడుతోంది. చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీకి రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం లేకపోతోంది. జిల్లాలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పోషకాహారంతో బాధపడుతున్నట్టు ప్రత్యేక డ్రైవ్‌లో తేలడం ఆందోళన కలిగిస్తోంది.
చిన్నారుల్లో పౌష్టికాహార లోపం
జిల్లాలో 15,819 మందికి రుగ్మతలు
ప్రత్యేకడ్రైవ్ ద్వారా గుర్తింపు
ఇచ్ఛాపురం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహార లోపం వెంటాడుతోంది. చిన్నారుల ఆరోగ్యానికి ప్రాధాన్యమిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార పంపిణీకి రూ.కోట్లు ఖర్చు పెడుతున్నా ఫలితం లేకపోతోంది. జిల్లాలోని ప్రతి ఐదుగురు చిన్నారుల్లో ఒకరు పోషకాహారంతో బాధపడుతున్నట్టు ప్రత్యేక డ్రైవ్‌లో తేలడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా 3,385 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఏడాదిలోపు చిన్నారులు 11,478 మంది.. 1 నుంచి 3 సంవత్సరాల్లోపు చిన్నారులు 34,825 మంది ఉన్నారు. 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులు 25,024 మంది ఉన్నారు. చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం సక్రమంగా అందక చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఆగస్టులో జిల్లావ్యాప్తంగా అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారుల ఎత్తు, బరువును కొలిచారు. ఏకంగా 15,819 మంది చిన్నారులు వయసుకు తగ్గట్టు ఎత్తు, బరువు లేకపోవడాన్ని గుర్తించారు. కొందరు పిల్లలు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలుసుకున్నారు. అన్ని కేంద్రాల్లో అలాంటి వారు 712 మంది ఉండగా.. మధ్యస్థ పోషకాహార లోపం ఉన్నవారు 2,325 మంది ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. వీరితోపాటు ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నవారు 4,412 మంది ఉన్నట్టు తేలడం విశేషం. తీవ్ర, పాక్షిక ఎదుగుదల లోపం ఉన్నవారు 10.81 శాతం ఉన్నట్టు తేలింది.
కారణాలెన్నో..
అంగన్‌వాడీ కేంద్రాల్లో మెనూ ప్రకారం చిన్నారులకు ప్రతినెలా గుడ్లు, పాలు అందజేస్తున్నారు. మెనూలో కొత్తగా ఎగ్‌ఫ్రైడ్‌రైస్, ఉడికించిన శనగలు వంటి పోషక పదార్థాలను చేర్చారు. గర్భిణులు, బాలింతలకు రాగిపిండి, బెల్లం, వేరుశనగ చిక్కీ, ఎండు ఖర్జూరం వంటి పోషకాలు ఇస్తున్నారు. అయినా కొందరు పిల్లలు సరైన పోషకాహారం అందక అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే కేంద్రాల నిర్వహణపై అనేక విమర్శలున్నాయి. అధికారులు పర్యవేక్షణ చేయరు.. ఆపై సరుకుల పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలున్నాయి. తల్లిదండ్రుల్లో అవగాహనలోపం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్యకరమైన బాల్యానికి ఎంతోమంది చిన్నారులు దూరం అవుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇచ్చే పోషకాహారాన్ని కొంతమంది తల్లిదండ్రులు ఇంటి వద్ద పిల్లలకు ఇవ్వడం లేదు. మరోవైపు మేనరికం, బాల్య వివాహాల కారణంగా జన్యుపరమైన లోపాలు, తక్కువ బరువుతో పుట్టడం కూడా వంటివి కూడా కారణాలుగా మిగులుతున్నాయి. పరిశుభ్రత పాటించక పోవడంతో కొంతమంది చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. విటమిన్లు, ప్రోటీన్లు అందకపోవడం, జంక్‌ఫుడ్‌కు అలవాటుపడడం వంటి కారణాలతో ఎదుగుదల లోపిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ప్రత్యేక శ్రద్ధ
అంగన్‌వాడీ కేంద్రాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. కేంద్రాల్లో అందించే ఆహారాన్ని విధిగా ఇళ్ల వద్ద పిల్లలకు పెట్టాలి. బాలామృతం, పప్పు దినుసులు, గుడ్లు తినిపించాలి. చిన్నారులకు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉండే సమతుల ఆహారాన్ని అందించాలి. పోషకాహార లోపంతో బాధపడే చిన్నారుల కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఎంఆర్‌సీ కేంద్రం అందుబాటులో ఉంది. దానిని సద్వినియోగం చేసుకోవాలి.
- పి.శోభారాణి, ఐసీడీఎస్ పీడీ, శ్రీకాకుళం