హై అలర్ట్
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:40 AM
Heavy rain forecast for today and tomorrow బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సోమవారం జిల్లాలో వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణంలో మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. మంగళ, బుధవారాలు మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
జిల్లాలో నేడు, రేపు భారీ వర్షసూచన
అధికారుల సెలవుల రద్దు
కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు
శ్రీకాకుళం, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో సోమవారం జిల్లాలో వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణంలో మబ్బులు కమ్ముకున్నాయి. మధ్యాహ్నం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షం కురిసింది. మంగళ, బుధవారాలు మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళ, బుధవారాల నాడు అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేశారు. కచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు మండల కేంద్రాల్లో ఉండాలని.. గ్రామస్థాయిలో అధికారుల బృందం పర్యటించి.. అత్యవసర సమాచారాన్ని జిల్లా కేంద్రానికి చేరవేయాలని సూచించారు. ప్రజలను అప్రమ్తతం చేసి ప్రాణనష్టం సంభవించకుండా కాపాడాల్సిన బాధ్యత మండల అధికారులదేనని స్పష్టం చేశారు.
సముద్రం.. అల్లకల్లోలం
రణస్థలం నుంచి ఇచ్ఛాపురం వరకు సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అఽధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. పెద్దగనగళ్లవానిపేట సముద్ర తీరంలో అలల ఉద్ధృతికి మత్స్యకారులు వలలు కుట్టుకునే ప్లాట్‌ఫాం ధ్వంసమైంది. తీరంలో ఉన్న రిసార్ట్ కోతకు గురైంది. ఒడ్డున ఆనుకుని ఉన్న తాటిచెట్లు, సరుగుడు చెట్లు కొట్టుకుపోయాయి. గతం కంటే ఒడ్డు మరింత కోతకు గురైంది. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బోట్లలో ఇంజిన్లు తడిసిపోకుండా షెడ్‌లో తాత్కాలికంగా భద్రపరిచారు. బందరువానిపేట, కళింగపట్నం, డి.మత్స్యలేశం, కుందువానిపేట, బారువ తీరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. కలెక్టర్ స్వప్పిల్ దినకర్ పుండ్కర్‌తో పాటు వివిధ శాఖల అధికారులతో సోమవారం ఆయన పోన్‌లో మాట్లాడి తుఫాన్ పరిస్థితిపై సమీక్షించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. తీరప్రాంతాల్లో అవసరమైతే ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. మత్య్సకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు.
సోమవారం కురిసిన వర్షపాతం (మి.మీ లలో)
ఇచ్ఛాపురం - 21.76,
కోటబొమ్మాళి - 20.75
జలుమూరు - 19.75
సంతబొమ్మాళి - 15.81
శ్రీకాకుళం - 13.25
సోంపేట - 11.0
ఎల్.ఎన్.పేట - 10.75,
నరసన్నపేట - 10.75,
ఆమదాలవలస - 10.25,
గార - 10.0,
ఎచ్చెర్ల - 9.0